రాయ్ పూర్ వన్డేలో భారత్ ఘననిజయం..

రాయ్ పుర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా..గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ 40, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. షమికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 108 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాట్స్మెన్ ను ముప్పు తిప్పలు పెట్టారు. ఓ దశలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ …కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. ఈ క్రమంలో బ్రాస్ వెల్, గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 19వ ఓవర్లో బ్రాస్ వెల్ .. కీపర్ ఇషాన్ కిషన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 56 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ చేరారు. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్ 36, శాంట్నర్ 27, మిచెల్ బ్రెస్ వెల్ పరుగులు చేశారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, శార్దుల్ , కుల్దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్ ఇండియా 20.1 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్ మన్ గిల్ 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు . కివిస్ బౌలర్లలో శాంటర్న్, షిప్లే చెరో వికెట్ పడగట్టారు.