‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు : బండి సంజయ్
BJPTelangana: ‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు. రాజకీయాలకు అతీతంగా సమాజానికి స్పూర్తినిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గ్రేట్. ఒక్క పిలుపుతో 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేసిన ఘనత మన్ కీ బాత్ దే. కాశ్మీర్ నుండి కన్యాకుమారిదాకా అటక్ నుండి కటక్ దాకా ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ సమాజానికి స్పూర్తి నింపిన మోదీగారికి ధన్యవాదాలు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మోదీ నిరంతరం దేశం కోసం పరితపిస్తుంటే.. కేసీఆర్ మాత్రం తాగి పండుకుంటూ తెలంగాణ ప్రజలను కలవడం లేదని విమర్శించారు. నాలాలో పడి పసిపిల్లలు చనిపోతున్నా… కుక్క కరిచి చనిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే మీడియాను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంటే జర్నలిస్టు సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మీడియాను అణిచివేయాలనుకున్న పాలకులంతా కాలగర్బంలో కలిసిపోయారని, కేసీఆర్ కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు ఒక వర్గం వారిని సంత్రుప్తి పర్చేలా నిర్మించిన సచివాలయానికి తాను వెళ్లబోనని పునరుద్థాటించారు. గుజరాత్ లోనూ అదే మోడల్ ఉందనే వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. గుజరాత్ సంస్క్రుతి ఉట్టిపడేలా అక్కడి కట్టడాలున్నాయన్నారు. తెలంగాణ సంస్క్రతిని ప్రతిబింబించేలా సచివాలయంలో మార్పులు చేసిన తరువాతే అందులో అడుగుపెడతానని బండి స్పష్టం చేశారు.
కాగా ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ ఉదయ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, బీజేపీ నేతలు బద్దం మహిపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, రాఘవరావు తదితరులు హాజరయ్యారు. బస్తీకి చెందిన ప్రజలంతా మన్ కీ బాత్ కార్యక్రమానికి హాజరై ప్రధానమంత్రి మోదీ ప్రసంగాన్ని విన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. బస్తీవాళ్లంతా ‘‘మన్ కీ బాత్’’ కు హాజరైతున్నరు. ఇట్లా ప్రతి ఒక్కరూ హాజరవడం సంతోషంగా ఉంది. మోదీగారు మన్ కీ బాత్ పేరుత్ 100 సార్లు మాట్లాడటం చాలా గొప్ప విషయం. ఇది ప్రపంచ రికార్డు. గతంలో అమెరికా అధ్యక్షులు 72 ఎపిసోడ్లు చేస్తే.. భవిష్యత్తులో ఎవరూ దాటలేని స్థితిలో 100 ఎపిసోడ్లు పూర్తి చేసి రికార్డు స్రుష్టించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు ఎన్నో అంశాలను ప్రస్తావించారు. సమాజానికి స్పూర్తినిచ్చారు.
ఇక దేశంలో రోజు ప్రతిపక్షాలు, లౌకిక కుహానావాదులు అనేకసార్లు ప్రధానిపై విమర్శలు చేశారు. కానీ ఏనాడూ మన్ కీ బాత్ ను రాజకీయంగా ఉపయోగించుకోలేదు. ప్రజల సమస్యలపైనే చర్చించారు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు. కరోనా సమయంలో ప్రపంచం అల్లాడితుంటే ప్రధానమంత్రి మోడీ గారు ‘‘మన్ కీ బాత్’ పేరుతో రేడియో, టీవీల ద్వారా ఒక్క పిలుపునిచ్చి 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేయగలిగిన మహానేత మోదీ. ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నానని మన్ కీ బాత్ ద్వారా పిలుపునిస్తే ఇయాళ 200 కోట్లకుపైగా డోసులు వేసుకుని కరోనా ను కట్టడి చేసిన ఘనత మోదీదేనని బండి స్పష్టం చేశారు