Mirai: ‘హనుమాన్’ ఊహించని విజయాన్ని సాధించిన తర్వాత తేజా సజ్జా తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తేజా మరో విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా ‘మిరాయ్’ను ఎంచుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. దాదాపు రూ.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.
మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్‌లో అనేక ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే టీజర్ ద్వారా కథా సారాంశం తెలిసిన ప్రేక్షకులకు ట్రైలర్ మరింత క్లారిటీ ఇచ్చింది. పలువురు ముఖ్య పాత్రలు ఈ ట్రైలర్‌లో రివీల్ అయ్యాయి.
‘‘ఈ ప్రమాదం ప్రతి గ్రంధాన్నీ చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి’’… ‘‘ఇదే చరిత్ర… ఇదే భవిష్యత్తు… ఇదే మిరాయ్’’ వంటి డైలాగులు కథ నేపథ్యంపై స్పష్టత నిచ్చాయి.
విజువల్స్ పరంగా ఈ ట్రైలర్ అద్భుతంగా కనిపించింది. డ్రాగన్‌తో ఫైట్ సీక్వెన్స్, చివర్లో శ్రీరాముడి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తక్కువ బడ్జెట్‌లో ఇంతటి క్వాలిటీ మేకింగ్ అందించడం వెనుక సాంకేతిక బృందం శ్రమ స్పష్టంగా కనిపించింది.
ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ సహా నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.40 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక థియేట్రికల్ బిజినెస్ ద్వారా మరో 20 కోట్లు రాబట్టడం పెద్ద కష్టం కాదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన సినిమాలు ఆశించిన మేర విజయాలు సాధించకపోయినా…‘మిరాయ్’ మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా పరిశ్రమలో చర్చ నడుస్తోంది. తేజా సజ్జాకు ఇది మరో పాన్-ఇండియా హిట్ కావచ్చని అంచనాలు ఉన్నాయి.