మునుగోడుపై నిధుల వర్షం.. వ్యూహాం మార్చనున్న రాజగోపాల్?

తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చనడుస్తోంది. ఉప ఎన్నిక వస్తేనే హుజురాబాద్ తరహాలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రకటించిన .. రెండు రోజుల్లోనే ప్రభుత్వం 33 కోట్లు నిధుల మంజూరుకై ప్రపోజల్స్ పంపాలని ఆదేశాలను జారీచేసింది. ప్రజాసమస్యలపై పలుమార్లు రోడ్లెక్కి, రాస్తారోకోలు చేసినా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోవడంతోనే నిధులు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక ఇటీవల పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అంతేకాక తాను రాజీనామా చేస్తే .. నియోజకవర్గంలో అభివృద్ది జరుగుతుందని కుండ బద్దలు కొట్టారు. ప్రజాభిప్రాయం మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటన చేపట్టిన ఆయన.. నిధుల మంజూరు ప్రపోజల్స్ ఆదేశాల నేపథ్యంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..సీఎం కేసీఆర్ విస్మరించిన హామీలను ప్రజలకు తెలియజేయనున్నారు.

ఇక ఉపఎన్నిక వస్తే ఏంటన్న దానిపై ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు సర్వే నిర్వహించాయి.వాటితో పాటు రాజగోపాల్ సైతం సొంతంగా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. అత్యధికశాతం ఆయనకు అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. అటు అధికార టీఆర్ఎస్ ఆశావాహులు సొంతంగా సర్వేలు చేయించుకుని అధిష్టానానికి నివేదిక పంపినట్లు తెలిసింది. దీంతో అలెర్ట్ అయిన అధికార పార్టీ.. సాగర్ బై ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన హమీలపై నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే జిల్లాలోని 157 పంచాయతీలకు 20 లక్షల చొప్పున.. ఆరు మండలాలకు 30 లక్షల చొప్పున కలిపి 33.20 కోట్ల నిధుల మంజూరుకు ప్రపోజల్ పెట్టింది.

మొత్తంమీద ఉప ఎన్నిక ఊహాగానాల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంపై నిధుల వర్షం కురువడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ సైతం అభ్యర్థి ఎంపిక పై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.