Mlckavitha: బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె రైల్ రోకో పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. “జూలై 17న బీసీ బిల్లు సాధన కోసం నిర్వహించనున్న రైల్ రోకోకు అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బీసీ బిల్లు అమలుపై బీజేపీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాసి, ఈ విషయంలో చొరవ చూపి తన అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని కోరాం” అని కవిత అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై ఖర్గేకి లేఖ..
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా బీజేపీపై ఒత్తిడి తేవాలి కోరుతూ ఏఐసీసీ అధ్యక్షులు
ఖర్గేకి కవిత లేఖ రాశారు. ఖర్గే తో పాటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఎప్పుడైనా బీసీల కోసం పార్లమెంట్లో మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఇక బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ ఎలా వెళ్తుందని ఆమె నిలదీశారు.
బిఆర్ఎస్ మద్దతు ఉంటుంది…
అదే విధంగా “దేశంలో కులగణన వివరాలు బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పాత లెక్కలే చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు పారదర్శకంగా ప్రకటించాలని ఆమె పేర్కొన్నారు. జూలై 17న తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకు బీజేపీపై గట్టి ఒత్తిడి తీసుకురాగలుగుతాం” అని కవిత స్పష్టం చేశారు. అలాగే, బనకచర్ల ప్రాజెక్ట్ విషయాన్ని ప్రస్తావిస్తూ…”ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి చూపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ కొందరి కాంట్రాక్టులకు అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు కూడా ఉన్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఆపేందుకు పోరాటం ఉధృతం చేయాలని సూచించారు.
రైల్ రోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా అనే ప్రశ్నకు స్పందించిన కవిత..”నేనే బీఆర్ఎస్ పార్టీ. రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.