అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీలో మొదలుపెట్టిన సర్పయాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని కోరారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఢిల్లీ మద్యం కుంభకోణం స్ఫూర్తితో, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో అసలు మద్యం కుంభకోణం అన్నదే చోటు చేసుకోలేదని తేలితే తమ పార్టీకే మంచిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, నగదు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఆ దిశగా కొత్త గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, లేకపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తన సచ్చీలతను నిరూపించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీబీఐ విచారణను కోరాలని రఘురామ సూచించారు.
గూగుల్ టెక్ అవుట్ ను తప్పు పట్టడం ఎందుకు?
మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు రఘురామకృష్ణ రాజు. గూగుల్ టేక్ అవుట్ పరిజ్ఞానాన్ని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన తొందర పాటు తనాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు. ఎటువంటి తప్పు చేయలేదని సజ్జల విశ్వసిస్తున్నట్లుగానే, రాష్ట్రంలో కొంత మంది ప్రజలు కూడా భావిస్తున్నారని… మనము ఏ తప్పు చేయనప్పుడు కంగారుపడి ఎదురు దాడి చేస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుందన్నారు. అటువంటి అనుమానాలు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వై.యస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.యస్. షర్మిల కోరారని.. వై.యస్. కుటుంబ ఆడపడుచుల కోరిక నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు రఘురామ పేర్కొన్నారు.