journalism: జర్నలిజంలో “నా వాళ్లు ”…

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్టు):

జర్నలిజంలో వున్న యువతను చూస్తే నాకు బాధ, ఆశ…. రెండూ కలుగుతాయి. రోజు రోజుకూ దిగజారుతున్న వృత్తి విలువలు, ప్రమాణాల వడిలో పడి…. తెలిసి కొంత, తెలియక కొంత వారూ కొట్టుకుపోతున్నారే అని బాధ. ఉదాత్తమైన ఆ వృత్తి లక్ష్యం, కర్తవ్యం తో పాటు నేడు క్షేత్రంలో వున్న వాస్తవ పరిస్థితులను గ్రహించి… వారే ఏదోరోజ్న మార్పుకు వాకిళ్లు తెరుస్తారని నాదొక ఆశ. నేడు నాలుగు రోడ్ల కూడలిలో వున్న జర్నలిజాన్ని సరైన మార్గం పట్టించి, పూర్వపు వైభవాన్ని పునః ప్రతిష్టించాల్సిన బాధ్యత యువ జర్నలిస్టులపైనే వుందని నేను బలంగా విశ్వసిస్తా! రాజ్యం, కార్పొరేట్లు, మీడియా యాజమాన్యాలు, ఇతరేతర ప్రభావక శక్తులు… ఇలా అనేకానేకుల పాత్ర-ప్రమేయాలున్నా, వున్నంతలో ఓ
సమూల పరివర్తన వారితోనే సాధ్యం.

జర్నలిజం వృత్తిలోకొచ్చి మూడున్నర దశాబ్దాలు దాటినా, జర్నలిజం పాఠాలు చెప్పడం మొదలెట్టి దాదాపు 3 దశాబ్దాలవుతోంది. 1994-95 లో తొలిసారి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లి, ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్లకు వృత్తి నైపుణ్యం గురించి చెప్పడంతో మొదలైంది ఈ పాఠ్య బోధన పర్వం. తర్వాత్తర్వాత ఈనాడు జర్నలిజం బడిలో, ప్రెస్ క్లబ్ పనుపున గ్రామీణ విలేకరుల శిక్షణ శిబిరాల్లో, కేంద్ర-రాష్ట్ర సమాచార విభాగాల కార్యశాలల్లో, వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రయివేటు విద్యాసంస్థల తరగతి గదుల నుంచి అలా సాగుతున్న పయణం సాక్షి జర్నలిజం బడి (Sakshi School of Journalism-SSJ) వద్దకు వచ్చి మరింత చానలైజ్ అయింది.

పునర్వవస్థీకరించిన SSJ తొలి (2014-15) బ్యాచ్ మొదలుకొని చివరి (2019-20) బ్యాచ్ వరకు, అంటే ఆరు బ్యాచ్ లలో కలిపి 300 లకు పైగా విద్యార్థులు! జర్నలిజం డిప్లొమా కోర్సు పూర్తి చేసుకొని, మొదట సాక్షిలోనే వృత్తిలో చేరినా… తదనంతరం అత్యధికులు ఎక్కడెక్కడికో వెళిపోయారు. పలువురు వృత్తి వదిలి ఇతరేతర వృత్తులు, పనులు, వ్యాపకాల్లోకి మారినా మెజారిటీ సంఖ్యాకులు ఇంకా జర్నలిజం లోనే వేర్వేరు చోట్ల, వేర్వేరు సంస్థల్లో, వివిధ హోదాల్లో సగర్వంగా/సర్దుకొని, ఎలాగైతేనేం వున్నారు. ఎడనెడ చక్కగా ఎదుగుతూ వున్నారు. ఆయా చోట్లకు వెళ్లినపుడు వారు కనపడి, పలుకరిస్తే ఎక్కడ్లేని ఆనందం. ఆప్యాయపు పలుకరింపులు. కులాసా కబుర్లు!

కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ పరిధి Press Information Bureau-PIB వారి కార్యశాలలో ప్రసంగించడానికి నల్గొండ వెళితే…. ఇద్దరు శిష్యులు, నే వేదిక వద్దకు వచ్చిన నుంచి, అంతా ముగిసి హైదరాబాద్ బయల్దేరి వచ్చే వరకు నన్నంటే వున్నారు. అశోక్ రెడ్డి (2017-18), తిరుమలేశ్ (2019-20). పలు బ్రేక్ లతో సుమారు యేడాదిన్నర శిక్ష(ణ) సాగిన ఈ చివరి బ్యాచ్ ని ‘కరోనా బ్యాచ్’ అని సరదాగా మేము ఆటపట్టించేది. ఈ ఒక్క బ్యాచ్ మొత్తం 38 మందిని సాక్షిలో ఇండక్షన్ చేయలేక నాకెంతో ఇబ్బంది అయినా…. అయిదారు మాసాలు గడవక ముందే, అందరూ ఎక్కడో ఒకచోట, జర్నలిజంలోనే చేరిపోవడం నాకు భలే తృప్తినిచ్చింది. జర్నలిజమే అయినా, కాకపోయినా…. ఎక్కడున్నా వాళ్లంతా సంతోషంగా, సంతృప్తిగా వుండాలనే నేను కోరుకునేది.

Optimized by Optimole