రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు నిర్ణయం : నాదెండ్ల మనోహర్

APpolitics: అసెంబ్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఉండి ఉంటే రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పాలకులు కనీస సంస్కారం లేకుండా దారుణంగా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితుల్ని ఖండించాలన్నారు. మన భవిష్యత్తు కోసం.. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేసినట్టు తెలిపారు. ఆయన దూరదృష్టిని అప్పట్లో ఎవరూ గ్రహించలేకపోయారన్నారు. ప్రస్తుతం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్లినట్టు తెలిపారు. మన రాష్ట్రం కోసం.. మన భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నంలో మచిలీపట్నం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో పార్టీ పక్షాన గాంధీ జయంతి నిర్వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు మనోహర్ తెలిపారు . బ్రిటీష్ కాలం నుంచి జిల్లా కేంద్రంగా ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో ప్రతి పౌరుడు కృషి చేశారన్నారు. అలాంటిది నేడు వర్షం కురిస్తే రాష్ట్రం నుంచి వచ్చే మొదటి ఫోటో మచిలీపట్నం నుంచే వస్తుందన్నారు. రహదారులు ఇప్పటికీ చెరువుల్ని తలపిస్తాయని పేర్కొన్నారు.

 కార్పొరేషన్… పోర్టు అన్నారు… బందరులో అభివృద్ధి ఏదీ?

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గీతలు గీసుకుంటూ.. నిధులు వచ్చాయి.. కార్పోరేషన్ వచ్చింది.. పోర్టు వచ్చిందని వైసీపీ నేతలు మాయ మాటలు చెబుతున్నారని మనోహర్ మండిపడ్డారు. బందరులో మార్పు ఎక్కడ వచ్చిందని.. పోర్టు వస్తే నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని.. కానీ వనరులు ఉన్నా మనం ఉపయోగించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.కార్పొరేషన్, పోర్టు అన్నారు.. అభివృద్ధి మాత్రం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. స్వాతంత్రం  వచ్చి ఇన్నేళ్లయినా నేటికీ కొన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రజలు ఇంకా కొట్లాడుతున్న పరిస్థితి ఉందని.. గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు సేవ చేయలేకపోతున్నారో ఆలోచించండని  విజ్ఞప్తి చేశారు.మచిలీపట్నంలో ప్రారంభం అయిన ఆంధ్రా బ్యాంకు విలీనం చేసేస్తుంటే ప్రశ్నించే వారు లేరన్నారు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యు ఉన్నా ఎందుకు మాట్లాడలేదని.. అటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవడం దౌర్భాగ్యమని అన్నారు.విభజన సమయంలోనూ అంతా నిస్సహాయంగా ఉండాల్సి రావడం పవన్ కళ్యాణ్ని బాధించిందని.. మనం రాష్ట్రం కోసం ఎవరూ నిలబడలేదు అన్న ఆలోచన ఆయనను పార్టీ పెట్టేలా చేసిందని మనోహర్ వివరించారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole