ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ మంత్రులు ఉలిక్కిపడడం చూసి జాలేస్తుందని ఎద్దేవ చేశారు. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కుటుంబ సభ్యులను.. అలాగే గ్రంధి సన్యాసి రాజుని… రాజాంలోని వారి నివాసంలో మనోహర్ ఆత్మీయంగా కలిశారు. అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో 151 సీట్లను కట్టబెడితే.. సుపరిపాలన అందిచి మన్ననలు అందుకోవాల్సింది పోయి..పవన్ కల్యాణ్ విమర్శించడం ఏంటని? ప్రశ్నించారు. చవకబారు మాటలు, విమర్శలు మాని పాలన సాగించాలని హితవు పలికారు.
ఇక రాష్ట్రంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు మనోహర్. ఒక మంత్రి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే.. మరొక మంత్రి ఇక్కడి నుంచే పాలన అంటారన్నారు. రెవెన్యూ మంత్రి ఏకంగా ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. క్యాబినెట్లో ఒక మంత్రి అన్న మాటలకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలని.. మంత్రి మాటలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపిస్తున్న వైసీపీ నాయకుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని.. కచ్చితంగా వారు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాని వైపు మాత్రమే జనసేన పార్టీ ఉంటుందని మనోహర్ స్పష్టం చేశారు.