అధికార తెరాసకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మఠంపల్లి మండలం గుర్రంబోడుతండా భూముల కోసం గిరిజనుల పక్షాన పోరాడుతున్న భాజపా నాయకులు విడుదల సందర్భంగా కోదాడ వచ్చిన సంజయ్ భాజపా నేత ఓవీ రాజు నివాసంలో మీడియాతో మాట్లాడారు. సర్వే నంబరు 540లో ఉన్న 6,200 ఎకరాల గిరిజన భూములను తెరాస, కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి దాడులు చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారన్నారు.
గిరిజనులకు భరోసా కల్పించేందుకు భాజపా నాయకులు వెళితే అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టించారని బండి సంజయ్ ఆరోపించారు. గిరిజన భూములకు పట్టాలిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ఆక్షేపించారు. సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
కోదాడ పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్న బండి సంజయ్‌పై స్వెరోస్ అనుబంధ సంఘాల నాయకులు అడ్డుకొని కాన్వాయ్‌పై దాడి చేశారు. దీంతో ఆయన హుజూర్‌నగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ ఘటన వెనక ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని భాజపా అనుబంధ సంఘాల నేతలు ఆరోపించారు.