APpolitics :
ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.
రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. 50 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 39 స్థానాలను తిరిగి నిటబెట్టుకొని ఆ పార్టీ పటిష్టంగానే ఉందని, క్షేత్రస్థాయిలో నాయకులు చెక్కు చెదరకుండా ఐక్యంగానే ఉన్నారని, వైఎస్ఆర్సీసీ అధినేత నాయకత్వం పట్ల పార్టీ శ్రేణులకు నమ్మకం ఉందనే సంకేతాన్ని ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరో స్థానంలో వైఎస్ఆర్సీపీ రెబల్ గెలిచారు. మిగతా పది స్థానాల్లో 9 మంది కూటమి అభ్యర్థులు గెలవగా, అవి కూడా అక్రమంగానే గెలిచినట్టు ప్రచారం ఉంది. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను ఏ ఒక్క ప్రజాస్వామ్యవాది ఆమోదించరు. ఆనాడు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలకు, దాడులకు, పోలీస్, అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి ఆ ఎన్నికల్లో గెలుపొందింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు జరిగ్గాయి. ఆనాడు వైఎస్ఆర్సీపీ ఎదుర్కొని ఎన్నికల్లో నిలబడడానికి టీడీపీ, జనసేన సాహసించలేకపోయాయి. టీడీపీ అధినేత ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు అప్పుడు ప్రకటించడం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ముఖ్యంగా టీడీపీ నాయకులు గతంలో వైఎస్ఆర్సీపీ మాదిరిగానే దౌర్జన్యాలకు, దాడులకు, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, రాష్ట్రంలో మరో నాలుగు సంవత్సరాలు కూటమి అధికారంలోకి ఉంటుందని తెలిసినా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఆ పార్టీకి అండగా నిలబడడం రాష్ట్రంలో ఆ పార్టీ పటిష్టంగానే ఉందని చెప్పడానికి చక్కటి నిదరర్శనం. వైఎస్ఆర్సీపీకి చెందిన సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి, మోపిదేవీ వెంకటరమణ, బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ఉదయభానులతో పాటు మరికొంత మంది నేతలు పార్టీని వీడినా ఆ పార్టీ పటిష్టంగానే ఉందని, పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల వారికి విశ్వాసం ఉందని చెప్పడానికి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడమే నిదర్శనం.
ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలను పరిశీలిస్తే కూటమి కూడా వైఎస్ఆర్సీపీ బాటలోనే నడుస్తుందని ప్రజాస్వామ్యవాదులు, తటస్తులు, పౌర సమాజం వారు భావిస్తున్నారు. కూటమి కూడా అదే బాటలో నడిస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. కూటమికి మెజార్టీ లేదని తెలిసినా రాష్ట్రంలో పలు చోట్ల ఎందుకు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతుంది..? పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సాహిస్తుంది..? అధికార దుర్వినియోగానికి పాల్పడి దాడులు, దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడుతుంది..? దీని వలన కూటమికి అదనంగా కలిసి వచ్చేది ఏముంది..? అని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
గతంలో వైఎస్ఆర్సీపీ పాలన పట్ల, అప్రజాస్వామ్య విధానాలపట్ల ప్రజలు విసిగిపోయి కూటమికి పట్టం కట్టారు. ఈ విషయాన్ని గ్రహించకుండా వారి బాటలోనే కూటమి రాజకీయాలు చేయడం ప్రజలు హర్షించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (ఆనాడు ఏవిధంగా జరిగినా) వైఎస్ఆర్సీపీయే గెలుపొందింది. వివిధ కారణాల వలన ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వారికే మెజార్టీ ఉంది. ఆయా స్థానాల్లో అనవసరంగా తప్పుడు మార్గాల్లో పోటీ చేసి వాటిని కైవసం చేసుకోవాలనుకోవడం కూటమి పార్టీల దివాళాకోరుతనానికి నిదర్శనం.
ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు కొన్ని చోట్ల ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలొచ్చాయి. పలు చోట్ల డబ్బుతో వైఎస్ఆర్సీపీ నేతలను లొంగదీసుకోవాలని చూసినట్టు, లేకపోతే బెదిరించినట్టు తెలిసింది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీ ఓటు కోసం ప్రభుత్వ సంస్థల్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఆమె భర్తను పావుగా వాడుకొని భార్యాభర్తల మధ్య తగువుకు టీడీపీ నేతలు కారణమయ్యారు. ఈ ఘటనలు కూటమి ప్రతిష్టను దిగజార్చి నష్టం చేకూరుస్తాయి. గతంలో వైఎస్ఆర్సీపీ కూడా ఇలాగే వ్యవహరించి నష్ట పోయిందనే అనుభవాన్ని కూటమి నేతలు గ్రహించాలి. జగన్ సర్కార్ హయాంలో చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన దౌర్జన్యాలు తెలిసినవే. అనంతరం వైనాట్ 175 అంటూ 11 స్థానాలకే వైఎస్ఆర్సీపీ పరిమితమైనచరిత్ర నుండి ఇప్పుడు కూ టమి నేతలు పాఠం నేర్వాలి.
స్థానిక సంస్థల ఉప ఎన్నికలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకోవడం రాజకీయ వ్యూహలోపమే. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచినంత మాత్రానా కూటమి అధికారం కోల్పోయే అవకాశమే లేదు. అయినా కూటమి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ప్రతినిధులు అవినీతి, అక్రమాలు, వారి దౌర్జన్యాలు కూడా ఒక కారణం. వారిపట్ల ప్రజలు విసుగు చెంది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని చిత్తుచిత్తుగా ఓ డిం చారు. ఈ దశలో ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకొని, ప్రజా వ్యతిరేకులుగా ముద్రపడిన వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను కూటమిలోకి ఎందుకు చేర్చుకోవాలి..? వారి అప్రతిష్టను కూటమి ఎందుకు భరించాలి..? వీరిని చేర్చుకోవడంపై టీడీపీ, జనసేన, బీజేపీ కింద స్థాయి నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూటమి అధినేతలు గ్రహించాలి.
2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఐక్యత పెరిగింది. కూటమి దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటే తామంతా కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించిన వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు గ్రామాల కూడళ్లలో పార్టీ నేతల పేరున ఉండే బెంచీల వద్ద సమావేశమవుతున్నట్టు క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో కనిపించింది. మరోవైపు టీడీపీ నేతల పేర్లతో ఉండే బెంచీలు ఖాలీగా కనిపించాయి. అంటే కూటమి కక్షసాధింపుకు వ్యతరేకంగా వైఎస్ఆర్సీపీలో ఐక్యత పెరుగుతుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. కూటమి దౌర్జన్యాలకు పాల్పడకపోయుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి పట్ల కొంత సాఫ్ట్కార్నర్గానే ఉండేవారేమో కానీ ఇంత కసి మాత్రం పెంచుకునే వారు కాదు.
వైఎస్ఆర్సీపీ 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడడంతోపాటు అక్రమ కేసులు బనాయించడంతోనే వారంతా కసిగా 2024 ఎన్నికల్లో పనిచేసి కూటమి ఘనవిజయానికి దోహదపడ్డారు. ఈ విషయాన్ని గ్రహిస్తే కూటమి నాయకత్వం రెడ్బుక్ విధానాలకు స్వస్తి పలికి ప్రజారంజక పాలన అందిస్తే ప్రజలు హర్షిస్తారు. 2019లో టీడీపీ వారు 23 స్థానాల్లో గెలిచినా ఆ ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్చార్జీలే అప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంబించినా 2024 ఎన్నికల్లో ఆ వైసీపీ నేతలు ఓడిపోయారనే సత్యాన్ని కూటమి నేతలు గ్రహించాలి. గత అనుభవాలను పరిగణలోకి తీసుకోకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయకుండ 2024లో భారీ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని నిత్యం చెప్పుకునే కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతూ పాలిస్తే ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుంది.
టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కక్షసాధింపు చర్యలకు, ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడం వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా చెప్పుకునే ప్రస్తుత టీడీపీ నేతలు అందుకు విరుద్ధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపుతో చేస్తున్న దౌర్జన్యాలను, దాడులను చంద్రబాబు కట్టడిచేయకపోతే కూటమిలోని పార్టీలకు ప్రధానంగా టీడీపీకి భారీ నష్టమే తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
వైఎస్ఆర్సీపీ బలహీనపడిందని ఆ పార్టీ పని అయిపోయిందని కూటమి నేతలు పగటి కలలు కనడం మానేసి ఆ పార్టీ ఇంకా పటిష్టంగానే ఉందని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కూటమి వైఖరి కారణంగా 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీకి దూరమైన కొన్ని సామాజిక వర్గాలు తిరిగి ఆ పార్టీ వైపు మొగ్గుచూపే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే కూటమికి ఇబ్బందులు తప్పవు. ఏకోచాంబర్ వ్యవస్థలో కోటరీని నమ్ముకొని క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తే 2029 ఎన్నికల్లో కూటమికి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పరిస్థితే ఎదురుకావచ్చు.
అధికార బలంతో ప్రతిపక్షాలను అణిచి వేయవచ్చనే అభిప్రాయంతో పార్టీలు తప్పటడుగులు వేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో దౌర్జన్యం, దాడులకు తావుండదని గత అనుభవాలు నేర్పుతున్నా పార్టీలు పాఠాలు నేర్వడం లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ స్థానిక ఎన్నికల్లో అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడితే ఇప్పుడు కూటమి కూడా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అదే బాటను అనుసరిస్తుంది.
-జంపాల ప్రవీణ్ కుమార్,
రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.