కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై వస్తున్న ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వలన జనజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకులే ప్రమాదముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు, పడకలు వంటి విషయాలపై చర్చించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణకు తక్షణ చర్యలు చేపడుతామని కేసీఆర్ తెలిపారు. అనంతరం వ్యాక్సిన్, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాలపై ప్రధాని మోదీ తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు గురించి వైద్య శాఖ ఉన్నతాధికారులు ప్రతి రోజు మీడియా తో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించాలని కేసీఆర్ ఆదేశించారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా , వైద్యులు సూచించిన మందులను వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.56 లక్షల మందికి కోవిడ్ సోకగా,1.35 లక్షల మంది కొలుకున్నారని.. కోవిడ్ పై వదంతులు నమ్మకుండా చికిత్స తీసుకున్నట్లయితే వ్యాధిని అడ్డుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.