తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. తెలంగాణలోను వణికిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల సంఖ్య 38కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంక్రాంతి వేడుకల్లోనూ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంది.. రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాలని సూచించింది.
అటు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి హరీష్‌రావు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామన్నారు. ఆర్డర్‌ కాపీ అందగానే ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బూస్టర్‌ డోస్‌, చిన్న పిల్లల వ్యాక్సిన్‌పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని హరీష్‌రావు అన్నారు.
ఇక రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ మహమ్మారితో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. ఢిల్లీ,కర్నాటక, హర్యానా ప్రభుత్వాలు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించడంతో పాటు మరిన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమయ్యాయి. మరి.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధిస్తుంది..? నైట్ కర్ఫ్యూను అమలు చేస్తుందా..? అనేది చూడాలి.

Optimized by Optimole