వైసీపీ సమాంతర వ్యవస్థ శాంతిభద్రతలకు విఘాతం: పవన్

Janasena: బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని వాలంటీర్ అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గురించి తెలుసుకొంటే బాధ ఆగలేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, పీకనులిమి అత్యంత భయానకంగా హత్య చేశాడని  ఆయన అన్నారు.ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నా మా అమ్మను కాపాడుకోలేకపోయామని వృద్ధురాలి కొడుకు పడుతున్న ఆవేదన చూసి కడుపు తరుక్కుపోతుందని పవన్ వాపోయారు. హత్య జరిగి పది రోజులు కావొస్తున్న ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఒక్క నాయకుడు కూడా పరామర్శకు రాలేదు అంటే వాళ్ల ఆలోచన విధానం ఏంటో అర్థమవుతుంద’ని పవన్ మండిపడ్డారు.పెందుర్తి సుజాతనగర్ లో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన శ్రీమతి కోటగిరి వరలక్ష్మి గారి కుటుంబాన్ని  పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ నేతలు ఈ పరామర్శలో పాల్గొన్నారు. 

అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ… “వైసీపీ ప్రభుత్వం తమ నవరత్నాల కోసం నియమించిన వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారి నేరాలకు తెగబడుతున్నారన్నారు. వాళ్లు చేస్తున్న దురాగతాలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయన్నారు. బయటకు రాని నేరాలు చాలానే ఉన్నాయని.. పాస్ పోర్టు కావాలన్నా, చిన్నపాటి ఉద్యోగానికైనా పోలీస్ వెరిఫికేషన్ చేస్తారని అన్నారు. వాలంటీర్ అనే ఈ సమాంతరం వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేయడం లేదు? వైసీపీ తన కోసం వినియోగించుకునే వ్యవస్థను నిబంధనలు గాలికొదిలి తయారు చేస్తోందని ప్రశ్నించారు.

ఇళ్లలోకి చొరబడి మరీ సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు అసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత వరకు సబబు? అని పవన్ నిలదీశారు. వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. వారిపై  పర్యవేక్షణ లేకపోవడంతో, క్షేత్రస్థాయిలో వారు రెచ్చిపోతున్నారని.. ఇదొక దండుపాళ్యం బ్యాచ్ లా తయారైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole