Nancharaiah merugumala:
=======================
ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా!
కిందటి నెల అక్టోబర్ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్ స్టార్‌ను ఫైవ్ స్టార్ హోటెల్ నోవాటెల్ స్వీట్ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే పవన్ కల్యాణ్ గారు గాని ప్రభుత్వ చక్రబంధం నుంచి తెలివితేటలతోగాని లేదా సమరశీల వ్యూహంతోగాని బయటకు రాలేకపోయారు. తర్వాత తెలుగుదేశం నేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును జనసేనాని కలవడం, విలేఖరుల సమావేశంలో స్వరం పెంచి మాట్లాడడం మనకు పెద్దగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కావు. ఎందుకుంటే, ఈ పరిణామాలు ఆంధ్రా రాజకీయాలను కీలక మలుపు తిప్పేవి కావు. మరి, అన్నయ్య చిరంజీవి గారితో పోల్చితే ఏకే–47లా కనిపించే 51 ఏళ్ల ‘భీమ్లా నాయక్’, ‘వకీల్ సాబ్’ పవన్ గారు ఉవ్వెత్తున లేచే పవనం మాదిరిగా ప్రభుత్వ పోలీసులను ప్రతిఘటించలేదు. తల వంచుకుని వెళ్లిపోయారు. ఈ విషయంలో అన్నయ్యనే ఆయన అనుసరించారనిపించింది.
సొంత కారు స్టీరింగ్ చేతిలో పెట్టుకున్న వైఎస్ షర్మిల–వెంటాడే దృశ్యం కాదా!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలో జరిగిన ఘటనలపై నిరసన తెలపడానికి మంగళవారం ప్రగతి భవన్ బయల్దేరిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డగించారు. తాను డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన కారు నుంచి ఆమె పోలీసుల కోర్కె మేరకు కిందకు దిగలేదు. డోర్లు లాక్ చేసుకుని తన కారు స్టీరింగ్ వెనుకే డ్రైవర్ సీటులో కదలకుండా షర్మిల కూర్చునిపోయారు.
ఇక చేసేదేమీ లేక పోలీసులు షర్మిల కూర్చున్న కారును మరో వాహనానికి కట్టుకుని (టవింగ్) తీసుకుపోయారు పోలిస్ స్టేషన్‌కు. నెల రోజుల్లో 49 ఏళ్లు నిండుతున్న షర్మిలమ్మ పోలీసు అరెస్టుకు, తన సొంత కారులో బందీగా మారి పోలిస్ స్టేషన్‌కు పోవడానికి భయపడలేదు. ఆమె కడప జిల్లా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని, ఆమె తండ్రి ముఖ్యమంత్రి అనీ, ఆమె అన్న గారు ఇప్పుడు ఏపీ సీఎం అని చెప్పి ఆమె ధైర్యానికి కారణాలు వివరించే ప్రయత్నం ఎవరైనా చేస్తే– అది అంత కన్విన్సింగ్‌గా ఉండదు. అందుకే, తెలంగాణ రాజధాని హైదరాబాదులో షర్మిల సాహసాన్ని, ఆంధ్రప్రదేశ్ కాబోయే కార్యనిర్వాహక రాజధానిగా అవతరిస్తుందని చెబుతున్న విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ ప్రవర్తనతో పోల్చి చూడడం తప్పుకాదనుకుంటాను. షర్మిల తాజా అనుభవం నుంచి కొణిదెల వెంకట్రావు గారి చిన్నబ్బాయి ఏమైనా నేర్చుకోవచ్చేమో ఆలోచిస్తే తెలుగు సమాజానికి మేలు జరుగుతుంది. బాపట్లలో గొడ్డుకారం తిన్నానని చెప్పుకునే కల్యాణ్ బాబు గారు పులివెందుల కుటుంబ నేపథ్యం ఉన్న వైఎస్ షర్మిల గారిలా ముందుకుపోవడం కుదరదంటారా? వయసు, రాజకీయ అనుభవం వంటి అంశాల్లో ఈ ఇద్దరు నేతలకూ పెద్ద తేడా కూడా లేదు కదా!