జేఎన్యూ నుంచే కాదు భారతదేశం నుంచి బ్రాహ్మణులను తరిమివేసే ప్రయత్నాలు ఫలించవు!
………………………………………………………………………………………………………
కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పండిత జవాహర్ లాల్ నెహ్రూ పేరుతో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ హయాంలో 1969లో స్థాపించిన జేఎన్యూలో (కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు దర్శనమివ్వడం అత్యంత గర్హనీయం. పేరుకు బ్రాహ్మణ–వైశ్య నాయకత్వంలో సాగుతున్న బీజేపీ కళ్ల ముందే ఇదంతా జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచలీ బ్రాహ్మణుడు. కాషాయ ఓబీసీ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఆయన నివాసానికి దగ్గరలోని జవాహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ‘బ్రాహ్మణులూ, కేంపస్ వదిలి పోండి. రక్తం కళ్ల జూస్తాం. బ్రాహ్మలూ, భారత్ చోడో (ఇండియా వదిలిపోండి), బ్రాహ్మణ–బనియాల్లారా, మేం మీ కోసం వస్తున్నాం. పగ సాధిస్తాం,శాఖలకు వెళ్లిపోండి’ వంటి నినాదాలు గోడలపై కనిపించాయట. ఇది ఎవరో అజ్ఞాత శక్తుల పని అని యూనివర్సిటీ అధికారులు ఆరోపించారు. ఈ పాడు పనిచేసింది వామపక్ష–ఉదారవాదుల ముఠా అని కూడా జేఎన్యూ అధ్యాపకుల సంఘం ట్విటర్ ద్వారా నిందించింది.
నిజానికి ఎన్నో దశాబ్దాలుగా జేఎన్యూలోని మార్క్సిస్టులు, లిబరల్స్, లౌకికవాద శక్తులకు నాయకత్వం వహించేది బాగా చదువుకున్న సద్బ్రాహ్మణులే అనే విషయం అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లూ మార్క్సిస్టు బ్రామ్మల ఆధిపత్యంలో నడిచిన విశ్వవిద్యాలయంలో ఇలాంటి బ్రాహ్మణ వ్యతిరేక గోడ రాతలు దేశభక్తులందరినీ భయోత్పాతానికి గురిచేస్తున్నాయి. భారత–హిందూ సంస్కృతికి విరుద్ధమైన ఈ బ్రాహ్మణ వ్యతిరేక నినాదాల రాతపై దర్యాప్తునకు జేఎన్యూ వైస్ చాన్సలర్ శాంతిశ్రీ ధూలిపూడి పండిత్ దర్యాప్తునకు కూడా ఆదేశించారు. స్వయంగా బ్రాహ్మణ మహిళ అయిన వీసీ శాంతిశ్రీ హయాంలోనే ఇలా జరగడం అనేక అనుమాలు రేకెత్తిస్తోంది (ఆమె భర్త, తండ్రి బ్రాహ్మణులు అయినాగాని తాను ఓబీసీ ప్రొఫెసర్ ను అని శాంతిశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు).
4 శాతం జనం ఉన్న బ్రాహ్మణులపై ఉన్నత విద్యాకేంద్రాల్లోనే విద్వేషమా?
………………………………………………………………………………
జేఎన్యూ, బీఎచ్యూ, ఢిల్లీ యూనివర్సిటీ సహా అనేక ఉన్నత విద్యాసంస్థల్లో బ్రాహ్మణ అధ్యాపకులు, ఆచార్యులూ ఆధిపత్యం చెలాయించారు. చెలాయిస్తున్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై వారు వివక్ష చూపించారు. ఇదంతా నిజమేనంటారు విషయాలు తెలిసినోళ్లు. అవసరమైనప్పుడు మార్క్సిస్టు, కాషాయ ముసుగులు కూడా కప్పుకున్నారు ఈ బ్రాహ్మణ ఆచార్యులు. ఇదంతా గతమా? వర్తమానమా? ఏమో, తెలీదు. మరి, ఘాంచీ అనే బీసీ కులానికి చెందిన నరేంద్ర మోదీ కళ్ల ముందే జేఎన్యూ బ్రాహ్మణ అధ్యాపకులు, ఆచార్యుల చాంబర్ల గోడలపై ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మీ అంతుచూస్తాం,’ వంటి నినాదాలు కొన్ని అజ్ఞాత శక్తులు రాయడం అత్యంత ఆందోళనకరం. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా ప్రాంతంలో మూలాలున్న కాన్యకుబ్జ బ్రాహ్మణ రాజకీయ దురంధరుడు అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న ఆరు సంవత్సరాల్లో జేఎన్యూలో గాని మరే ఇతర విశ్వవిద్యాలయంలోగాని ఇలాంటి బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రభాయ్ మోదీని తీవ్రంగా ద్వేషించిన బ్రాహ్మణులు చివరికి ‘ఛాయ్ వాలా నేత’తో రాజీపడ్డారు. ఆయన ప్రధానిగా ఉండడానికి కాషాయ బ్రాహ్మలు తలవంచకుండానే అంగీకరించారు. పదేళ్ల క్రితం అంటే 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మోదీని వ్యతిరేకించిన బ్రాహ్మణులు ‘బీజేపీని, మోదీని ఓడించాలి,’ అంటూ గుజరాత్ బ్రాహ్మణ మహాసభ పేరుతో గుజరాతీ దినపత్రికల్లో ఫుల్ పేజీ అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చిన విషయం మాలాంటోళ్లకు ఇంకా గుర్తుంది. తర్వాత బ్రాహ్మలకు నరేంద్ర మోదీపై ద్వేషం, వ్యతిరేకత మాయమయ్యాయి. ఫలితంగా ఆయన ప్రధాని అయ్యారు. మరి, మోదీ 8 సంవత్సరాల పాలన తర్వాత జాతీయ రాజధాని దిల్లీలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నినాదాలు రాయడం పవిత్ర భారతానికి కీడును సూచిస్తోంది.
నేడు బ్రాహ్మణలను బెదిరిస్తున్నారు, రేపు ‘బహుజనలను’ పొమ్మంటే…?
……………………………………………………………………………….
జేఎన్యూ బ్రాహ్మణ ఆచార్యుల గదుల గోడలపై దర్శనమిచ్చిన బ్రాహ్మణ వ్యతిరేక భావాలు, విద్వేషం దేశమంతటా విస్తరిస్తే– మొత్తం జనాభాలో నాలుగు శాతం ఉన్న బ్రాహ్మణులు ఎటు పోవాలి? కశ్మీరీ ముస్లిం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రధాని మొహమ్మద్ షాబాజ్ షరీఫ్ (పాకిస్తాన్ ముస్లింలీగ్ (ఎన్) పాలనలో ఉన్న పాకిస్తాన్‌కు భారత హిందూ బ్రామ్మలు వలసపోవాలా? నరేంద్ర మోదీ అర్జెంటుగా జేఎన్యూ గోడల బ్రాహ్మణ వ్యతిరేక నినాదాల సమస్యను పరిష్కరించకపోతే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టమే అనిపిస్తోంది. నేడు బ్రాహ్మణులు, బనియాలను వెళ్లిపోమంటున్న ‘అజ్ఞాత శక్తులు’ రేపు బహుజనులమనే భ్రమల్లో ఉన్న సూద్రులు, ఓబీసీలు, దళితలు, ఆదివాసీలను కూడా దేశం నుంచి పోవాలని బెదిరిస్తే హిందూ పెద్ద, ఆరెసెస్ రథ సారథి మోహన్ భాగవత్ జీ ఏం చేస్తారో? ఏదేమైనా భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దిల్లీ మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కేంద్ర సర్కారు తక్షణ చర్యలు తీసుకోవాలి. మొదట ముస్లింలను, తర్వాత బ్రాహ్మణులను మన శత్రుదేశమైన పాకిస్తాన్‌కు పంపించాలనే ప్రతిపాదన (బెదిరింపులు) అన్యాయం. అప్రజాస్వామికం.