రవీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్-వార్తల్లోకెక్కిన ఈ బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా?
……………………………………………………..
ఇద్దరు బిహారీ బ్రాహ్మణ బుద్ధిజీవులు- ప్రశాంత్ కిషోర్ (పాండే), రవీష్ కుమార్ (పాండే)కు వారి శక్తి సామర్ధ్యాలు, ప్రతిభాపాటవాలకు మించిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయనిపిస్తోంది. వైశ్య (బనియా/కోమటి) పాత్రికాధిపతుల దగ్గర బ్రాహ్మణ పాత్రికేయులు, సంపాదకులు గతంలో చాలా పెద్ద సంఖ్యలో పనిచేశారు. ఇంకా పనిచేస్తున్నారు. పెత్తనం చేస్తున్నారు. బనియాల పెట్టుబడి బ్రాహ్మణ జర్నలిస్టులకు ఏనాడూ చేదు కాలేదు. వైశ్యులైన రామ్ నాథ్ గోయెంకా పత్రికల్లో గాని, సాహూ జైన్ల టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు పత్రికల్లో గాని బ్రాహ్మణ సంపాదకులదే ఆధిపత్యం. మరి మైనారిటీ జైన మత వైశ్యుడు గౌతమ్ ఆదానీ పెట్టుబడి ప్రవేశించిన ఎన్డీటీవీ హిందీ టీవీ చానల్ నుంచి రవీష్ కుమార్ పాండే నిష్క్రమించడం దివంగత బ్రాహ్మణ పాత్రికేయులను అవమానించడమేనని కొందరు తెలుగు బ్రాహ్మణ జర్నలిస్టులు బాధపడుతున్నారు. ఉత్తరాదిన 90 శాతం మీడియా సంస్థలు వైశ్యుల యాజమాన్యంలోనే నూరేళ్ల నుంచీ నడుస్తున్నాయి.
ఇకపోతే, ఓబీసీ కాషాయ నేత నరేంద్రమోదీ, ఓబీసీ లోహియా సోషలిస్ట్ నితీష్ కుమార్ ఎన్నికల్లో గెలవడానికి ‘తోడ్పడిన’ ప్రశాంత్ కిషోర్ పాండే ఇప్పుడు కొత్త వేషం వేయడం కొత్తగానే ఉంది. బిహార్లో 1990 తర్వాత (చివరి బిహార్ బ్రాహ్మణ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా) మూడున్నర దశాబ్దాలు దాటాక పాట్నాలో బ్రాహ్మణ సీఎం ప్రమాణం చేయాలని ప్రశాంత్ కిషోర్ ఆశించడం ‘హేతుబద్ధంగా’ లేదు. ఏదేమైనా ఈ బిహారీ బ్రాహ్మణ పాండేలు-రవీష్, పీకేలకు అనాయాసంగా గొప్ప పేరొచ్చేసింది.