దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలనూ పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను సంస్థ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో మరోసారి కమలం వికాసం తథ్యమని ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది. అధికార బీజేపీ 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉందని… ఇన్ని సీట్లు రావడానికి మోదీ హవానే కారణమని వెల్లడించింది.
మొత్తంగా 60 నియోజకవర్గాల్లో 240 పోలింగ్ స్టేషన్లల్లో సంస్థ ప్రతినిధులు సర్వే నిర్వహించి 4800 శాంపిల్స్‌ను సేకరించి సర్వే రిపోర్ట్ రూపొందించినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు.
కాగా 182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 92 సీట్లు గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 25 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 16 శాతం, ఇతరులకు 13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ± 3 శాతం. మొత్తంగా బిజెపి-కాంగ్రెస్ మధ్య ఓట్ల వ్యత్యాసం 21 శాతంగా కనిపిస్తోంది.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం అయినందున, ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్ బీజేపీకి లాభం చేకూర్చిందనే చెప్పవచ్చు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ.. దాదాపు 30 బహిరంగ సభల్లో పాల్గొనడం.. వరసగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అమిత్ షా క్షేత్రస్థాయిలో ఉండి వ్యుహాలు రచించడం వల్ల గుజరాత్ లో బీజేపీ తన పట్టు నిలుపుకోగలిగిందన్నది సర్వే రిపోర్ట్ బట్టి చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ఊహించని విధంగా గుజరాత్ లోకి దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ 16 శాతం ఓట్లు సాధించినా.. సీట్లు సాధించడంలో విఫలమయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో ఓట్లు సాధించిన ఓట్ల శాతం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తగ్గిన బీజేపీ ఓటింగ్ శాతం..
2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ షేర్ 3.1 శాతం తగ్గింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఓట్ షేర్ 16.4 శాతానికి పడిపోయింది. 2017 ఎన్నికల్లో రాహుల్ గాంధీ లాగా..ఈ సారి జాతీయ నాయకులు ఎవరూ గుజరాత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టకపోవడమే కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గడానికి కారణమని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.అటు దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ పార్టీకి కొంత మేలు చేకూరింది. మైనార్టీలు తప్ప దాదాపు అన్ని సామాజిక వర్గాలు బీజేపీ మద్దతుగా నిలిచారు. హర్థిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్… పార్టీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి ప్లస్ అయ్యిందని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది.
రైతులు, సామాన్యులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నా… వారికి వేరే ప్రత్యామ్నాయ పార్టీ కనిపించకపోవడంతో మళ్లీ బీజేపీకే జై కొట్టారు. కొంతలో కొంత స్థానిక సమస్యలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినందు వల్ల ఆ పార్టీకి ఆ మాత్రం సీట్లు వస్తున్నాయని పీపుల్స్‌పల్స్ వెల్లడించింది.
సీఎంగా మద్దతు ఎవరికంటే…?
గుజరాత్ సీఎం ఎవరన్న ప్రశ్నకు.. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ కు 24 శాతం మంది..మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 20 శాతం.. హర్థిక్ పటేల్ కు 14 శాతం మంది..మద్దతు తెలిపినట్లు పీపుల్స్‌పల్స్ సర్వేలో వెల్లడైంది.
_____________
హిమాచల్ ప్రదేశ్ లో బిజేపి _కాంగ్రెస్ నువ్వా నేనా..!
హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య ‘నువ్వా నేనా’ అనేవిధంగా పోటీ ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ సంస్థ పోస్ట్‌పోల్ సర్వేలో తేలింది. రిపోర్ట్ ప్రకారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 29-39.. బిజెపికి 27-37..ఇతరులకు 2-5 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది . ఇక రెండూ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.4 శాతం మాత్రమే ఉన్నట్లు.. కాంగ్రెస్‌కి 45.9 శాతం, బిజెపికి 45.5 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 2.1 శాతం, ఇతరులకు 6.5 శాతం.. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ± 3 శాతంగా ఉండేట్లు అంచనా వేసింది.సర్వేలో భాగంగా సంస్థ ప్రతినిదులు నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 96 పోలింగ్‌స్టేషన్లలో సర్వే నిర్వహించి, 1920 శాంపిల్స్‌ను సేకరించారు.
ఇదిలా ఉంటే హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 35 సీట్లు గెలవాలి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో హాంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుండటంతో స్వతంత్ర అభ్యర్థులు ఈ సారి హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు సర్వే రిపోర్ట్ ఆధారంగా భావించవచ్చు.