ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ పునారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నానని అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురం నుంచి అర్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.  వారాహి విజయ యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పిఠాపురంలో ఆయన మాట్లాడారు.   “ఈ రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే వైసీపీ అంత లాభపడుతుందనేది వైసీపీ నాయకుడి గేమ్ ప్లాన్. పిఠాపురం రాగానే నాకు రాష్ట్రంలో జరిగిన హిందూ ఆలయాల మీద దాడులు గుర్తుకొచ్చాయి. ఆధ్యాత్మిక క్షేత్రం పిఠాపురం నుంచే ఈ దాడులు మొదలయ్యాయి. 219 హిందూ ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరిగితే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదు. దీని వెనుక చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన దాగుంది. వైసీపీ నాయకుల కుట్ర దాగుంది. వరుసగా హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే సనాతన ధర్మం నమ్మే హిందువులంతా వేరే మతస్థులను అనుమానించాలి. దాని ద్వారా వారితో గొడవ పడాలి. సమాజంలో ఘర్షణలు చెలరేగితే వైసీపీ దాని నుంచి బోలెడు లాభం పొందాలనే చచ్చు ప్రభుత్వం ఆలోచనలతోనే వరుసగా ఆలయాల మీద దాడులు జరిగాయి. సమాజంలో ఎన్ని గొడవలు జరిగితే వైసీపీ నాయకులకు అంత ఇష్టం. యువకులు తమ భవిష్యత్తును వదిలేసి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఈ నాయకులు అంత ఆనందపడతారు. పిఠాపురంలో మొదట హిందూ దేవతల విగ్రహం ధ్వంసం చేస్తే నిందితుడిని పిచ్చివాడు అని చెప్పారు. మరి 219 దాడులు, విగ్రహాల ధ్వంసం కూడా పిచ్చివాళ్ల పనేనా..? శ్రీరాముడి విగ్రహం తల నరికింది కూడా పిచ్చివాడేనా..? ఎందుకు విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయలేదు అంటే వైసీపీ దగ్గర సమాధానం ఉండదు. వైసీపీ అనే దుష్ట ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తె ఎవరినీ బతకనివ్వరు. ప్రతి ఇంట్లోకి వైసీపీ గుండాలు వచ్చి దోచుకుంటారు. హంతకులు.. గుండాలు.. రౌడీలు.. అవినీతి పరులతో వైసీపీ ప్రభుత్వం నిండిపోయింది. వైసీపీ పార్టీ గుండాలకు నిలయం. నేర పూరిత రాజకీయాలంటే నాకు చాలా చిరాకు. జనసేన ప్రభుత్వంలో నేర చరితులకు స్థానం ఉండదు. ప్రతి వైసీపీ గూండాగాళ్లను బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై ప్రజలతో కొట్టించే రోజు దగ్గర్లోనే ఉంది. క్రిమినల్ మైండ్ ఉన్న వారు పాలిస్తే క్రిమినల్స్ కు వత్తాసు పలకకుండా ఏం చేస్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డ బయటకు వెళ్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి వస్తుందా లేదా అనే భయం అందరిలోనూ ఉందని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు.

సురక్ష ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తాం ..

సాక్షాత్తు ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయిదంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు పవన్. తుని దగ్గర వైసీపీ నాయకుడి అనుచరుడు భూమి కబ్జా చేశాడని ఓ ఆడబిడ్డ ఫిర్యాదు చేస్తే, ఆమెకు మానసికంగా బాగాలేదని కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారన్నారు. కరోనా సమయంలో మాస్కులు లేవు అని చెప్పిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడు అని ముద్ర వేసి, చనిపోయేలా చేశారని వాపోయారు. ఓ నాయకుడు గూండాలతో బెదిరిస్తే, మరో వైసీపీ నాయకుడు బహిరంగంగా గన్ తో తిరుగుతాడన్నారు. ఇదీ వైసీపీ ప్రభుత్వంలోనే జరుగుతున్న తంతుగా అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోయిందన్నారు. జనసేన ప్రభుత్వంలో ‘‘సురక్ష ఆంధ్రప్రదేశ్’’ ను సాధించి తీరుతామని కుండ బద్ధలు కొట్టారు. అన్నీ వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా జనసేన బాధ్యత తీసుకుంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణను జనసేన ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్య అంశంగా చేస్తామని పవన్ తేల్చిచెప్పారు.

పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించేలా చూస్తాం 

గత నాలుగేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నాశనం చేశారని జన సేనాని మండిపడ్డారు. పోలీసుశాఖను నిర్వీర్యం చేశారన్నారు. వైసీపీ నాయకులు చెప్పిందే చట్టం… వేసిందే శిక్ష అన్నట్లు పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులపై పూర్తిస్థాయిలో వైసీపీ ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని.. సున్నితమైన అంశాల్లో సైతం పోలీసులు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారని పవన్ స్పష్టం చేశారు.

గంజాయిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం రావాలి ..

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ను గంజాయికి దేశ రాజధానిగా వైసీపీ మార్చిందని పవన్ మండిపడ్డారు. రాష్ట్రం నుంచి రవాణా అవుతున్న గంజాయి దేశంలోనే అధికమన్నారు. ఆంధ్రప్రదేశ్ గంజాయి మత్తులో తూగేలా తయారు చేశారని దుయ్యబట్టారు. మన్యంలో విపరీతంగా గంజాయి పడుతుంటే, దాన్ని రవాణా చేసి లాభపడుతోంది వైసీపీ నాయకులని ఆరోపించారు. ప్రతి గ్రామానికీ, వీధిలో బహిరంగంగా గంజాయి దొరికే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందన్నారు.   రాష్ట్రంలో గంజాయిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం రావాలని ఆకాంక్షించారు.  జనసేన ప్రభుత్వంలో నిజాయతీ గల పోలీసు అధికారులకు స్వేచ్ఛగా వారి విధులను నిర్వర్తించేలా అధికారం కట్టబెడతామని… పోలీసులు వారి విధులను ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి కాకుండా చేస్తే సమాజం అద్భుతంగా తయారవుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Optimized by Optimole