Varahivijayayatra: ‘అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి … అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే జనసేన ఎన్నికల నినాదం కావాల’ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభలో భాగంగా.. అందరితో నినాదాన్ని పలికించారు.సభకు హాజరైన అశేష జనవాహిని ‘హల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం దద్దరిల్లింది. “వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేటు పెరిగిపోయిందన్నారు పవన్. అక్కను వేధించొద్దు అన్న పాపానికి బాపట్లలో 14 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందన్నారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని.. మనల్ని పాలించే నాయకులు బాధ్యతగా లేకపోవడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్యను కవర్ చేయడానికి ముందు గుండెపోటు నాటకం ఆడారని.. తరువాత విషయం బయటకు పొక్కడంతో ఎవరో చంపారని చెప్పారన్నారు. నిజం బయటకొస్తుందనే భయంతో ఒక వ్యక్తిని చంపేశారు. విచారణ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులను బెదిరించారు. హత్యకు సంబంధించిన కీలక వ్యక్తిని అరెస్టు చేద్దాం అంటే అడ్డుకున్నారు. కోనసీమ అల్లర్ల కేసులో అభంశుభం తెలియని 250 మంది యువకులపై కేసులు పెట్టడానికి బలంగా పనిచేసిన చట్టాలు… చిన్నాన్నను చంపిన వాళ్లను పట్టుకోవడంలో మాత్రం పనిచేయలేదు. ఇలాంటి ప్రభుత్వాలా మనకు కావాల్సింది? అని జనసేనాని ప్రశ్నించారు.
దళిత నాయకులు ఎందుకు మాట్లాడలేదు?
కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు కావాలని పోరాడిన దళిత నాయకులు… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును జగనన్న విదేశీ విద్యాపథకంగా మారిస్తే ఎందుకు మాట్లాడలేదు..? అని పవన్ నిలదేశారు. జిల్లాకు అంబేద్కర్ పేరు కోసం గట్టిగా పోరాడిన నాయకులు, ప్రభుత్వం చేసిన పథకం పనిని ఎందుకు వ్యతిరేకించలేదు..? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా నా ఎస్సీ… నా ఎస్టీ అని మాట్లాడతాడు. దళితులకు మేనమామ అంటాడు. నిజంగా ఆయన మేనమామ అయితే దళితులకు సంబంధించిన 23 పథకాలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యా పథకంగా ఎందుకు మార్చారు? ఈ రోజు కోనసీమ నడిబొడ్డు నుంచి ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా … అంబేద్కర్ గారి కంటే నువ్వు గొప్పవాడివా జగన్ మోహన్ రెడ్డి. మీరు తీరు మార్చుకోవాలి. కాలం మారుతోంది. ప్రజలు మారుతున్నారు. యువత మారుతోంది. కొత్తతరం వస్తోంది. సమాజంలో మార్పు వచ్చి తీరుతుందని పవన్ తేల్చిచెప్పారు.
విషాన్ని తాగిస్తున్న వైసీపీ సర్కారు..
నోట్లో వేలు పెడితే కొరకని పసిబాలుడు అయిన జగన్ బాబు కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డల పసుపుకుంకుమలు తీసేస్తున్నాడని పవన్ ఆరోపించారు. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాడని.. వైద్యులు నన్ను జనవాణిలో కలుస్తున్నపుడు వారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను చెబుతుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. ముఖ్యంగా చిన్న వయసున్న యువత వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యం తాగి లివర్, కిడ్నీ, పాంక్రియాస్ వ్యాధుల బారిన పడుతున్నారని చెబుతుంటే గుండె తరుక్కుపోతోందని వాపోయారు. అత్యంత విషపూరితమైన రసాయనాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగి ప్రజలు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని.. వారి కుటుంబాలను అనాధలను చేస్తున్నారని.. ఆడపడుచుల కళ్ళలో నీళ్ళు నింపిన పాపం ఊరికేపోదని.. వైసీపీకి కచ్చితంగా ఇది తగులుతుందని పవన్ పేర్కొన్నారు.