ప్రజల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే పవన్ ఆశయం: నాదెండ్ల మనోహర్
Janasena: ‘రాజకీయాల్లో ఒక నిర్దిష్టమైన మార్పు , ప్రజలు బతుకుల్లో వెలుగులు నింపాలనే ఆశయం కోసం పని చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు నాదెండ్ల మనోహర్. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనమంతా ప్రజా క్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఎవరో ఏదో చెప్పారని… ఏదో వాట్సప్ గ్రూపులో సమాచారం వచ్చిందని గాభరాపడొద్దు’ అని సూచించారు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప మనసున్న నాయకుడు ఎవరూ కనిపించరన్నారు. అలాంటి గొప్ప నాయకుడుని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని.. కీలకంగా జనసైనికులపై ఉందని తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో నగర నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఎన్నికలు సమీపించే తరుణంలో అధికార పార్టీ సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు పుట్టించడానికి, జనసేన పార్టీ రాజకీయ విధానాలపై గందరగోళం సృష్టించడానికి ఇప్పటికే భారీగా నెల వేతనాలకు ఉద్యోగులను నియమించిందని హెచ్చరించారు. జనసేన పార్టీ మీద బలమైన విష ప్రచారం జరగబోతోందన్నారు. కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే అవకాశం ఉందన్నారు. దీనిని ఇప్పటి నుంచే ప్రతి జన సైనికుడు తిప్పి కొట్టి.. నిలువరించాలని పిలుపునిచ్చారు. అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మాత్రమే ప్రతి జనసైనికుడికి వేదవాక్కు కావాలన్నారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న అది పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతం మీద, ప్రజా క్షేమం మీద మాత్రమే ఉంటుంది.. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకోండని మనోహర్ పేర్కొన్నారు.