దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 28వేల మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మంది కొవిడ్ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) మధుమేహులకు చెందినవారని పేర్కొనడం గమనార్హం.
బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్రలో 6339 కేసులు ..గుజరాత్‌లో 5486 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని తెలిపింది. ఇక సెకండ్ వేవ్ సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని.. కోలుకుంటున్న వారిసంఖ్య పెరుగుతోందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం 83శాతం క్రియాశీల కేసులు 10రాష్ట్రాల్లో ఉండగా.. 17శాతం కేసులు 26రాష్ట్రాల్లో ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో కేసుల పాజిటివిటి రేటు 6.34శాతానికి తగ్గినట్లు స్పష్టం చేసింది.
దేశంలో కరోనా వైరస్ మార్పులకు సంబంధించి జన్యుక్రమాన్ని విశ్లేషించే ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 30వేల శాంపిళ్లను పరీక్షించామని తెలిపింది .కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకర్‌మైకోసిస్ ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఈ కేసులను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.