ప్రత్యేక హోదా, బడ్జెట్ ప్రొవిజన్ ను సాకుగా చూపెట్టి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గుమ్మాల ఎక్కి దిగిన ప్రయోజనం శూన్యమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు సహకరించే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లోని అతి కీలకమైన వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సాక్షి దినపత్రిక మినహా, అన్ని వార్తా దినపత్రికలు ప్రముఖంగా కథనాన్ని ప్రచురించాయని గుర్తుచేశారు. జగన్ నమ్మిన బంటు నవీన్ ఫోన్ ద్వారా జరిపిన సంభాషణల గురించి సిబిఐ అధికారులు ఒకవేళ చూసి చూడనట్లు వ్యవహరించిన ..తనలాంటివారు ఆ వ్యవహారాన్ని అంత తేలికగా వదలరని తేల్చి చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందుతులు ఎవరో తేలే అవకాశం ఉందని రఘురా ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు..
న్యాయస్థానాలను, రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అనర్హులని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణకు ఉన్న రోజే న్యాయస్థానాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యం.. జ్ఞాన శూన్యత అనుకోవాలా?, విశృంకలత్వం అనుకోవాలా??, ఇంకేమైనా అనుకోవాలా??? అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు.
న్యాయవ్యవస్థపై గౌరవం సన్నగిల్లే ప్రమాదం
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో తాను సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించకముందే సాక్షి దినపత్రికలో బెయిల్ పిటిషన్ రద్దు అంటూ వార్తా కథనాన్ని ప్రచురించారన్న రఘురామ.. ఆ తరువాత సాక్షి దినపత్రికలో రాసినట్లుగానే న్యాయస్థానం తీర్పును వెలువరించిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వంటి వారి వల్ల రాజకీయ నాయకులంటే గౌరవం తగ్గుతోందన్నారు. న్యాయస్థానాలంటే ఇప్పటికీ ప్రజలకు ఎనలేని గౌరవం ఉందని.. ఒకవేళ న్యాయస్థానం కూడా రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని సమర్ధిస్తే, ప్రజల్లో న్యాయవ్యవస్థ పై కూడా అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందని రఘురామ హెచ్చరించారు.