Mirchi: ప్లాస్టిక్ ఫ్రీ.. “మిర్చి ప్లాస్టిక్ వారియర్ ఛాలెంజ్ ” ఘన విజయం..!!

Vijayawada: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు రేడియో మిర్చి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై నెలను ప్రపంచ వ్యాప్తంగా ‘ప్లాస్టిక్ ఫ్రీ మంత్’ గా  ప్రకటించగా రేడియో మిర్చి .. *మిర్చి ప్లాస్టిక్ వారియర్ చాలెంజ్* పేరిట శ్రోతలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఛాలెంజ్ విసురుతూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పించే విధంగా పలువురు నిపుణులతో ఇంటర్వ్యూలు రేడియో మిర్చి ప్రసారం చేసింది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై విస్తృత ప్రచారం చేస్తోంది.

ఇక రేడియో మిర్చి సంస్థ ప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆదివారం నాడు “ప్లాస్టిక్ క్లీనప్ డ్రైవ్” నిర్వహించారు. ఆవారా స్విమ్ అండ్ రెస్క్యూ అకాడమీ (ఫస్ట్ రెస్పాండర్స్ ఇండియా) సంస్థతో కలసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. కొండవీటి వాగు పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను శ్రోతలు, ఆర్జేలు, వాలంటీర్లు కలిసి శుభ్రం చేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో విత్తనాలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ఆర్జే కావ్య శ్రీపతి సారథ్యం వహించగా, ఆమె బృందం అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవారా నుండి డాక్టర్ అజయ్ కాట్రగడ్డ, గౌరీ, శకుంతల, సౌజన్య తదితరులు తమ సేవలతో ముందుండి నడిపించగా …రేడియో మిర్చి తరఫున మిర్చి అమృత్, శ్రోతలు సాయి, అశోక్, కావ్య, హరిదీప్ తో పాటు పలువురు చురుకుగా ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

“ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయన్న నమ్మకంతో, మేమంతా ‘ప్లాస్టిక్ ఫ్రీ మంత్’ చేపట్టామని..మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటాం” అని రేడియో మిర్చి క్లస్టర్ ప్రోగ్రామింగ్ హెడ్ కొవ్వలి తేజ, ఆర్జే కావ్య శ్రీపతి, అలాగే డాక్టర్ అజయ్ కాట్రగడ్డ తెలిపారు.

ఈ ప్లాస్టిక్ క్లీనప్ డ్రైవ్ పలువురికి స్ఫూర్తిగా నిలిచిందని మేధావి వర్గం తరపున ప్రశంసల వర్షం కురుస్తోంది. సమాజంలో పాజిటివ్ మార్పుకు రేడియో మిర్చి – ఆవార బృందం చేసిన ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయమని కొనియాడుతున్నారు.

Optimized by Optimole