ప్రధాని మోదీ భుజాలపై బొజ్జగణపయ్య.. అద్భుతం అంటున్న నెటిజన్స్..!

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేశ్ మహారాజ్ కి జై స్లొగన్స్ హోరెత్తుతున్నాయి. అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాధునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న రూపాలలో గణేశుడు దర్శనమిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

తెలంగాణ రాష్ట్రం హన్మకొండ లో బాల గణపతి యూత్ గుడిబండలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని మోడీ  బొజ్జ గణపయ్య ను మోస్తున్న విగ్రహం నెటిజన్స్ ను ఫిదా చేసింది. ఈ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఏనుగుల.. ప్రత్యేకంగా తయారు చేయించి బాల గణపతి యూత్ కు అందించారు.

ఇక సకల విఘ్నాలు తొలగించే వినాయకుడిని ప్రధాని స్వయంగా మోసుకొస్తున్నట్టు.. గణనాధుని అనుగ్రహం తో ప్రజల కష్టాలను ప్రధాని దూరం చేస్తారని అర్థం వచ్చేలా ఈ విగ్రహం తయారు చేశారని గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. సమస్త మానవాళిని రక్షించే వినాయకుని..విశ్వ నాయకుడు మోడీ మోస్తున్నట్లు రూపొందించిన విగ్రహం అద్భుతంగా ఉందని స్థానికులు కొనియాడుతున్నారు.

కాగా చాలాసార్లు తాను ప్రధాన మంత్రిని కాదని ప్రధాన సేవకున్ని అని ఉద్ఘాటించిన ప్రధాని మోడీ.. ఆది దేవుడైన గణనాధునికి ప్రధాన సేవకుడని బీజేపీ నేత రాకేష్ రెడ్డి పేర్కొన్నారు . గణపయ్య ఆశీస్సులతో ఓరుగల్లు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. సకల విఘ్నాలనూ లంబోదరుడు తొలగిస్తే.. దేశ ప్రజల విఘ్నాలు తొలగించుటకు స్వామి వారి ప్రతినిధిగా ప్రజలు నరేంద్ర మోడీని ఎన్నుకున్నారని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.