టిడిపి ఎన్డీయేలో చేరడం నష్టమా? లాభమా?.. ప్రత్యేక వ్యాసం..

ప్రత్యేక వ్యాసం :

_____________________

తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే లో చేరుతున్నట్లు అనేక కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అన్నది ఎన్డీయే పక్షాలు కాని, తెలుగుదేశం పార్టీ నుండి గానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఎన్డీయేలో తిరిగి తెలుగుదేశం పార్టీ చేరడంవల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే చేరడంవల్ల ఆంధ్ర రాష్ట్రప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను, ప్రజల మనోభావాలను పరిశీలిస్తే రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌పార్టీ ఎంత నష్టం చేసిందో దానికన్నా ఎక్కువగా విభజన హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్రానికి నష్టం చేసిందని కోపంగా ఉన్నారు. 

ఆంధ్రరాష్ట్రప్రజలు మనోభావాలను అధ్యయనం చేస్తే కాంగ్రెస్‌, బిజెపి పార్టీలను అంటరాని పార్టీలుగా చూస్తున్నారు. కేవలం విభజన చట్టంలోని హామీలు ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుబడిన  రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, పోలవరం ప్రాజెక్టు పూర్తి తదితర ప్రధానమైన హామీలను కేంద్రంలోని ఎన్డీయే, బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదనే కోపంతోపాటు ప్రతినిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ధరలు పెరుగుదల కూడా బిజెపి పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి, రాష్ట్రానికి అన్యాయం చేశామనే అపవాదును మూటకట్టుకున్న బిజెపి పార్టీతో తిరిగి తెలుగుదేశం పార్టీ జతకడితే ఆ పార్టీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేతో జతకడితే రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడాల్సిందే. ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సిందే. 

చంద్రబాబు నాయుడు ఢల్లీిలో జరిగిన ‘ఆత్మనిర్భర్‌’ కార్యక్రమానికి హాజరయినప్పుడు ప్రధాని మోడీ చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంటున్నారు. అంతేకాక బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుండి పలు పార్టీలు జారుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపికి ఇప్పుడు కొత్త పార్టీల ఆవశ్యకత ఏర్పడడంతో వారు టిడిపిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం అవుతుంది. అయితే 2014లో టిడిపి బిజెపి పార్టీలు పొత్తుపెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఘర్షణ పడి 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. అప్పుడు టిడిపి అధికారం కోల్పోయింది. టిడిపి బిజెపి పొత్తుపై గత చరిత్రను పరిశీలిస్తే  వారి రాజకీయ అవకాశవాదం బట్టబయలవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర వ్యవధి ఉన్నా రాష్ట్రంలో రాజకీయ వేడి అప్పుడే కాకరేపుతోంది. ఎన్నికలకు సంబంధించి పార్టీలు బలాబలాలు బేరీజు వేసుకుంటూ వివిధ కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పభుత్వం అప్పులో కూరుకుపోయింది. ఉద్యోగులకు రోజువారీ జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోతున్నారని, రాజధాని నిర్మాణంలో పూటకోమాట మారుస్తూ కాలం గడుపుతున్నారని, రాష్ట్రానికి కీలకమైన పోలవరం పనులలో పురోగతి లేదని అన్నీ విధాలా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అంచనాకు వచ్చిన ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కూటమిగా వైఎస్‌ఆర్‌సిపిని ఎదుర్కోడానికి సిద్ధమౌతున్నాయి. 

ప్రస్తుత పరిస్థితులలో పొత్తుల అంశాన్ని పరిశీలిస్తే మొదట శ్రీ పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ బిజెపితో పొత్తు కుదుర్చుకున్న ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి మధ్య సమన్వయం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలకుండా ఉండాలని దానికి జనసేనపార్టీ ముందుంటుందని ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్‌ ఇటీవల కాలంలో తరుచూ ప్రస్తావిస్తున్నారు. ఇది సాధ్యమా?  ప్రతిపక్ష పార్టీ ఓట్లు  చీలకుండా ఉండాలంటే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టిడిపితో ఆయన జతకట్టాలి. టిడిపితో జతకట్టడానికి బిజెపి సమర్థిస్తుందా? ఒకవేళ బిజెపి ముందుకు రాకపోతే జనసేన ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటుందా? ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలకూడదనుకుంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌పార్టీ  లను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలి. బిజెపి పార్టీతో వేదికను పంచుకోవడానికి కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ పార్టీలు ముందుకు రావు. ఈ పరిస్థితుల్లో జనసేన ముందు ప్రత్యామ్నాయం ఉందా? 

 బిజెపితో సంబంధం లేకుండా టిడిపి, జనసేన పొత్తుకు సిద్ధమవుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే స్థానిక నేతలు కూడా అందుకు మానసికంగా సిద్ధమైనట్లు స్పష్టమౌతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక చోట్ల టిడిపి, జనసేన పార్టీలు ఉమ్మడిగా పనిచేశాయి. 

తెలుగుదేశం బిజెపి పొత్తు కథనాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రెండు పార్టీలు జతకట్టడం కొత్తేమి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబు హయాం నుండి ఈ రెండు పార్టీలు పలుమార్లు పొత్తులు పెట్టుకున్నాయి. తర్వాత విడిపోయాయి. ఇక రాష్ట్రం విడిపోయాక మొదటి అసెంబ్లీ ఎన్నిక ల్లో కూడా టిడిపి బిజెపి జతకలిసాయి. 2014 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేమారు జరిగాయి. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీచిందని అది చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎంతో తోడ్పడిరదని బిజెపి వారు ప్రచారం చేశారు. ఈ పార్టీలు రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికి కాచుకొని కూర్చున్న వై.ఎస్‌. జగన్‌ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను రాబట్టుకోవడంలో టిడిపి విఫలమైందని పెద్దఎత్తున ఆరోపణలు గుప్పించారు. 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోవడం తదితర అంశాలు టిడిపికి నష్టం చేకూరుస్తాయని భావించిన చంద్రబాబు నాయుడు ఆ వైఫల్యాలను  కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీకి. బిజెపికి వ్యతిరేకంగా పావులు కదిపారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బిజెపిని ఇరుకున పెట్టే విధంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ బిజెపిని ఎండగట్టారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ధర్మదీక్షలు చేపట్టారు. చంద్రబాబు బిజెపికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలపై కన్నెర్ర జేసిన శ్రీ నరేంద్రమోడీ, బిజెపి అదే స్థాయిలో చంద్రబాబును దెబ్బ కొట్టాలని చూశారు. రాష్ట్రంలో జగన్‌ చంద్రబాబు వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే, చంద్రబాబు రాష్ట్రంపై బిజెపి వివక్షను ప్రచారం చేశారు. ఇలా 2019 అసెంబ్లీ ఎన్నికల వరకూ వీరి వైరం తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఏమైతేనేం ప్రజలు రాష్ట్రంలో మార్పును కోరి జగన్‌కు పట్టం కట్టారు. చంద్రబాబు బిజెపితో వైరం పెట్టుకున్నందుకే అధికారం కోల్పోయారనే ప్రచారం జరిగింది. అయితే ఇది వాస్తవమేనా అని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.

2014లో బిజెపితో పొత్తు కుదుర్చుకొని పోటీ చేసిన టిడిపి అందలమెక్కింది. ఉమ్మడి రాష్ట్ర విభజనకు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రేస్‌తో పాటు బిజెపికి కూడా పాత్ర ఉంది. రాష్ట్ర విభజన తీరుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఈ రెండు జాతీయ పార్టీలకు చావుదెబ్బ తప్పదని భావించారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని భావించిన ప్రజలు రాష్ట్రాన్ని పాలించడానికి అనుభవం ఉన్న వారు కావాలనే ఆలోచనతో చంద్రబాబుకు పట్టంకట్టారు. ఇది టిడిపితో జతకట్టిన బిజెపికి బాగా కలిసి వచ్చింది. ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే అంశంతో కోలుకోలేని దెబ్బతింది. ఈ ఎన్నికలను పరిశీలిస్తే రాష్ట్రంలో మోడీ ప్రభంజనం కంటే నూతన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలనే అంశానికి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చి యువకుడైన జగగ్‌ను కాదని అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 44.9% ఓట్లతో 102 స్థానాలు రాగా వైఎస్‌ఆర్‌సిపికి ప్రధాన ప్రతిపక్షంగా వైఆర్సిపికి 44.6% ఓట్లతో 67 స్థానాలొచ్చాయి. అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం కేవలం 0.3 శాతమే. సీట్ల పరంగా చూస్తే మాత్రం 35 సీట్ల వ్యత్యాసం ఉంది. బిజెపి 2.2% ఓట్లతో నాలుగు స్థానాలు పొందింది.

ప్రత్యేక రాష్ట్రంలో రెండోసారి అసెంబ్లీ ఎన్నికలకు ఎవరికి వారే పోటీ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి, 

బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు నూతనంగా జనసేన వామపక్షాలు, బిఎస్పీలతో పొత్తుపెట్టుకొని పోటీ చేశాయి. ఎన్నో ఆశలతో, అంచనాలతో చంద్రబాబును అందలమెక్కించిన రాష్ట్ర ఓటర్లు హామీలు ఆచరణ రూపం దాల్చలేదనే అసంతృప్తితో జగన్‌కు పట్టం కట్టారు. అయితే బిజెపిని దూరం చేసుకోవడం వల్లనే చంద్రబాబు అధికారం కోల్పోయారనే భావన ప్రచారం జరిగింది. 

2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైఎస్‌ఆర్‌సిపి 49.95% ఓట్లతో 151 స్థానాలు, టిడిపి 39.17% ఓట్లతో 23 స్థానాలు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన బిజెపికి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు, ఒక్క స్థానం కూడా రాలేదు అంటే 2019లో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకోకపోవడంతోనే నష్ట పోయిందనే అంశం వాస్తవికతకు దూరంగా ఉంది. 2014లో టిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపి 2.2 శాతం ఓట్లతో 4 స్థానాలు పొందితే 2019లో పొత్తు లేకుండా పోటీ చేయడంతో ఒక్క శాతం ఓట్లను కూడా పొందలేక పోయింది . అంటే పొత్తు టిడిపి కంటే బిజెపికే లాభసాటి. 

2019 తర్వాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి పోటీ చేయకపోయినా బిజెపి ` జనసేన మద్దతుతో  బరిలోకి దిగింది. బద్వేల్లో 1 4.73% ఓట్లు, ఆత్మకూరులో 14% ఓట్లను సాధించింది. సహజంగా బలమైన పార్టీతో జత కట్టడానికి ఇతర పార్టీలు ముందుకొస్తాయి. అయితే ఇక్కడ 40% ఓటు బ్యాంకు ఉన్న టిడిపి ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని బిజెపితో పొత్తుకు ఉత్సాహం చూపడం, ఎన్డీయే లో చేరాలనుకోవడం ఆశ్చరకరమైన విషయం.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో మళ్లీ జత కట్టడం రాజకీయ అవకాశవాదమే అవుతుంది. రాష్ట్రానికి కీలకమైన ప్రత్యేక హోదా, రాజధాని నగరం ఏర్పాటు, పోలవరం 

అంశాలను పరిశీలిస్తే ప్రత్యేక హోదా, పోలవరం రెండూ కేంద్రం ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. ఇందులో ప్రత్యేక హోదాపై బిజెపి ప్రభుత్వం ఎప్పుడో చేతులేత్తేసింది. ఇక పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు ఎంతో అత్యవసరం. 

2014 మొదలుకొని ఇప్పటివరకూ వీటిపై అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పార్టీల హోదాలు మా త్రం మారుతున్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇప్పుడు అధికారంలోకి, అప్పుడు అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే సమస్యలు అలానే ఉన్నాయి. పాత్రలు మాత్రం మారాయి. 

2014 బిజెపితో కలిసిన టిడిపి పొత్తు విచ్ఛినం అయినప్పటి నుండి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అంశాలపై భారీ స్థాయిలో పోరాడుతూ బిజెపిపై యుద్ధం ప్రకటించింది. టిడిపిని అధికారం కోల్పోగానే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వీటిపై ఒత్తిడి తేవడం లేదని, జగన్‌ తన అవినీతి కేసులకు భయపడి బిజెపితో రాజీ పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బిజెపి టిడిపి పార్టీలు ఇప్పుడు జతకడితే టిడిపి లేవనెత్తుతున్న ఆయా సమస్యలకు పరిష్కారం లభించినట్టేనా? ఇవే అంశాలపై చంద్రబాబు గతంలో ధర్మ దీక్షలు చేపట్టారు. ప్రభుత్వాలు మారాయి. సమస్యలు మాత్రమే అలానే ఉన్నాయి. ఈ అంశాలపై జగన్‌ పాటు కేంద్రం లోని బిజెపిపై కూడా విమర్శలు చేసిన చంద్రబాబు అదే బిజెపితో ఇప్పుడు పొత్తు పెట్టుకోవడంపై ఏమి చెబుతారు? ఇప్పుడు బిజెపి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ప్రయోజనకర హామీలు ఇచ్చిందని టిడిపి పోత్తుకు సిద్ధమవుతోంది? 

స్థానిక బిజెపి నేతలు ఇప్పటికే రాష్ట్ర టిడిపిపై పలు విమర్శలు చేస్తున్నారు. మరి చంద్రబాబు స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర బిజెపితో పొత్తుకు రెఢీ అయ్యారా? రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే చంద్రబాబు మరియు బిజెపి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉంది. జగన్‌ను ఎదుర్కోవాలంటే టిడిపి ప్రజా సమస్యలపై పోరాడుతు ప్రజా మద్దతును కూడగట్టాలి. అయితే అందుకు భిన్నంగా పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ స్థానికంగా బలంలేని బిజెపితో పొత్తుకు ఉబలాటపడడం ఆయన దివాళా కోరు రాజకీయాలకు చక్కటి నిదర్శనం. రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. అలాగే అవకాశవాద రాజకీయాలు కూడా ఉంటాయంటారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు గనుక కుదిరితే ఇప్పుడు ఈ రెండు వాదాలు మరోసారి నిజమవుతాయి.

_________

ఐ.వి.మురళి కృష్ణ శర్మ,

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ