కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం.. ఘాటు కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్స్..

సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలంగాణ సంపదను కేసీఆర్ బీహార్ కు దోచిపెడుతున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే..అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే సీఎం కేసీఆర్ లో కనబడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. జవాన్ల మరణాలకు కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆయన తప్పు బట్టారు.సీఎం కేసీఆర్ మాటలు వినలేక నీతిష్ కుమార్ లేచి నిలబడ్డాడని.. తెలంగాణ నవ్వుల పాలు చేస్తున్నాడని బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఇక కేసీఆర్ బీహార్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శానాస్త్రాలు సంధించారు. ఏముఖం పెట్టుకుని బీహార్ లో పర్యటించారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని.. నాయకులందరినీ ఏవిధంగా ఏకం చేస్తారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.కేంద్రంపై దుష్ప్రచారం చేసినా ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కేసీఆర్  మాట్లాడుతుంటే.. బీహార్ సీఎం లేచి నిలబడ్డాడని..గొప్పలకు పోయి కేసిఆర్ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నాడని కిషన్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

కాగా కేసీఆర్ కు అమరజవాన్లపై ప్రేమ ఉంటే.. 2013 లో మరణించిన జవాన్ యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ బిహార్‌ పర్యటనలో అమరజవాన్లకు ఆర్థికసాయం కంటే.. రాజకీయ విస్తరణ కాంక్షే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు.అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా తెలంగాణ ప్రజల సొమ్మును .. కేసీఆర్ దేశమంతా పంచుతున్నారని మండిపడ్డారు.అమర జవాన్ల మరణాలను సైతం స్వార్థ రాజకీయాలకు వాడుకునే కేసీఆర్ ఎత్తుగడ చూసి తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి దాపరించిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఈనేపథ్యంలోనే బీహార్ పర్యటనలో కేసీఆర్ తలపాగా ధరించిన వీడియో నెట్టింట తెగ హాల్ చల్ చేసింది. గతంలో ప్రధాని మోదీ వేషధారణపై కేసీఆర్ చేసిన కామెంట్స్ ఊటంకిస్తూ..నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోయారు.ఇతరులను విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కేసిఆర్ ఘాటుగా కౌంటర్ విసిరారు. 

మొత్తంమీద కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయంగా , సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే చెలరేగింది. ఇటు ప్రతిపక్షనేతలు విమర్శల దాడి చేస్తుంటే.. అటు నెటిజన్స్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.