ఈశాన్య మారుమూల ప్రాంతాల్లో 4G సూర్యోదయం మొదలైంది: మోదీ

పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మన్ కీబాత్ ద్వారా తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధాని..సెప్టెంబర్ 1 వతేది నుంచి 30 వతేదివరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటామని వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత.. చిరుధాన్యాల సంవత్సరంతోపాటు.. అమృత్ సరోవర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇక చెన్నైకి చెందిన శ్రీదేవి వరదరాజన్ రాసిన లేఖ గురించి ప్రస్తావించిన ప్రధాని.. నూతన సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని భారత్ చేసిన ఈ ప్రతిపాదనకు 70కి పైగా దేశాల మద్దతు లభించిందని ప్రధాని తెలిపారు. ప్రాచీన కాలం నుంచి వ్యవసాయం, సంస్కృతి, నాగరికతలో -చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు ఒక భాగంగా ఉన్నాయన్నారు. వేదాల్లో, పురాణాల్లో, తొల్కాప్పియం గ్రంథంలో వీటి ప్రస్తావన ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు.

కాగా వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతిలో నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి పేర్కొన్నారని ప్రధాని గుర్తుచేశారు. దేశంలో ప్రజల భాగస్వామ్యంతో అమృత్ సరోవర్ నిర్మాణం ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా ‘మంగ్త్యా-వాల్యా తాండా’ గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉందని..గ్రామస్థుల చొరవతోఇప్పుడు ఈ స్థలాన్ని అమృత్ సరోవర్ అభియాన్ కింద అభివృద్ధి చేశారని వెల్లడించారు.ఈఏడాది వర్షాలకు ఈ చెరువు నీటితో నిండిపోయిందని ప్రధాని స్పష్టం చేశారు.
అన్నారు.

ఆజాదీకా అమృతోత్సవాల్లో భాగంగా అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం మొదలైందన్నారు ప్రధాని మోదీ. ఈనేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్‌ సియాంగ్ జిల్లా జోర్సింగ్ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచే 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయని ప్రధాని తెలిపారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కొత్త ఉదయాన్ని తెచ్చిందన్నారు. ఒకనాడు పెద్ద నగరాల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండేవని.. ఇప్పడు డిజిటల్ ఇండియాతో గ్రామ గ్రామానా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీని వల్ల దేశంలో కొత్త డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆవిర్భవిస్తుందని మోదీ తెలిపారు.