ఈ నెల 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ మొదటి దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యులతో పాటు కరోనాపై పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న రెండవ దశలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందించనున్నారు.
వాక్సిన్పై ప్రజల్లో అనుమానాలు…
ప్రస్తుతం దేశంలో వాక్సినేషన్ డ్రైవ్ నడుస్తుండగా చాలా రాష్ట్రాల్లో టార్గెట్ రీచ్ అవ్వలేక పోతున్నారు. కరోనా వాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే అనుమానాలే ఇందుకు కారణం. వాక్సిన్ వల్ల ఎలాంటి అపోహలు వద్దని హర్యానా, బీహార్, తెలంగాణ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు తరచూ చెప్తున్నప్పటికీ అక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం కలగడం లేదు. ఇలాంటి పరినామాలను దృష్టిలో ఉంచుకుని రెండవ దశ ప్రక్రియలో ప్రజాప్రతినిధులంతా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
భయం అవసరం లేదంటున్న నిపుణులు…
అయితే కోవిడ్ వాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తవని, ఈ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కేవలం 0.002శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వాక్సిన్ తీసుకున్న వారిలో 0.18శాతం మంది మాత్రమే చిన్న పాటి ప్రతికూలతలు ఎదుర్కొన్నట్లు స్పష్టం చేస్తున్నారు.