అట్టహాసంగా పద్మ అవార్డులు ప్రధానోత్సవం!

రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..54 మంది గ్రహీతలకు పద్మ అవార్డులను ప్రధానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో ప్రముఖ యోగా గురువు స్వామి శివానందతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

ఇక పద్మ అవార్డులు ప్రదానోత్సవంలో భాగంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దర్బార్ హాల్లో యోగా గురు స్వామి శివానంద పేరు పిలవగానే ఆయన వచ్చి మొదట ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పాదాభివందనం చేశారు. ఇందుకుగాను ప్రధాని కూడా కిందకు వంగి వారికి ప్రతి నమస్కారం చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి చెంతకు వెళ్లి ఆయన పాదాభివందనం చేశారు. దీంతో హాలులో ఉన్నవారంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో యోగా గురును అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ స్వామి శివానందను కొనియాడారు. ఈ వీడియో ఇప్పుడు నేట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
కాగా అవార్డును అందుకునేందుకు యోగా గురు.. తెల్లని ధోవతి, కుర్తా ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చి ఈ పురస్కారాన్ని స్వీకరించడం గమనార్హం.

ఇక పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. అనంతరం వారితో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య పాట పాడి వినిపించారు. తెలుగు వారికి అవార్డులు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు జస్టిస్ రమణ.

Optimized by Optimole