BJPTelangana: బండికి ప్రమోషన్.. అరుణకు మరోసారి అవకాశం..!

BJPTelangana:  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నేతలకు కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణకు రెండో సారి అవకాశం కల్పించింది. ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌ను రెండోసారి బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు అరుణ్‌ సింగ్‌ నేతల నియమాకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు.

కాగా ఇటీవల  కరీంనగర్‌ ఎంపీ బండిసంజయ్‌ ను తెలంగాణ అధ్యక్షుడిగా తొలగించడంతో పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సంజయ్‌.. అసమ్మతి నేతలను టార్గెట్‌ చేయడంతో కమలం పార్టీలో కలకలం రేగింది. దీంతో అలర్ట్‌ అయినా హైకమాండ్‌ పెద్దలు బండిని ఢిల్లీకి  పిలిచి సర్దిచెప్పారు.

తాజాగా బండికి బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మా నాయకుడికి జాతీయ నాయకత్వం సముచిత స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాతో కాషాయం నేతలు కామెంట్లు పెడుతున్నారు.

 

Optimized by Optimole