పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికి.. పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అమరీందర్ సింగ్తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్ఛార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇక ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయించుకుంటామని తెలిపారు మాజీ సీఎం అమరీందర్ సింగ్. గెలుపే ప్రధాన లక్ష్యంగా ఈ పంపకాలు ఉంటాయన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని 101 శాతం నమ్మకం ఉందన్నారు అమరీందర్ సింగ్. గెలుపులో సీట్ల పంపిణీ ప్రక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు అమరీందర్ సింగ్.
అటు అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు ఊపందుకున్నాయి. పాటియాలాలోని 22 మంది కార్పొరేటర్లు సహా ఇతర కాంగ్రెస్ నేతలు.. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ కండువా కప్పుకున్నారు. పాటియాలాలో జరిగిన ఓ కార్యక్రమంలో.. అమరీందర్ సింగ్ కుమార్తె బిబా జై ఇందేర్ కౌర్ సమక్షంలో ఈ నేతలంతా ఆ పార్టీలో చేరారు.