రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా!

Nancharaiah merugumala senior journalist:

బాహుబలి’ సినిమా విడుదలయ్యాక ఉత్తరాదిన ఈ మాటకు ‘ధీరత్వం’ అంటుకుంది..రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా..

‘‘ సూపర్‌ హిట్‌ పాన్‌ ఇండియా సినిమా ‘బాహుబలి’ హిందీ రాష్ట్రాల్లో విడుదలయ్యాక ఈ మాటకు ‘ధీరత్వం’ అనే భావం జోడించారు. ఉత్తరాదిన రాజకీయ సందర్భాల్లో మాట్లాడితే బాహుబలి అనే పదానికి గ్యాంగ్ట్సర్‌ అని అర్ధం ఉండేది, ఇంకా ఉంది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ఒక్కరే కిందటి వారం వార్తల్లోకి ఎక్కిన గ్యాంగ్ట్సర్‌ లేదా బాహుబలి కాదు. నిబంధనలు సవరించి మరీ బిహార్‌ ప్రభత్వం విడుదల చేసిన మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ కూడా బాహుబలియే.’’

–ప్రసిద్ధ జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కు ప్రతివారం రాసే తన వ్యాసంలో ఈరోజు చెప్పిన మాటలివి. బాహుబలి సినిమాను హిందీ రాష్ట్రాల్లో విడుదల చేసే ముందు దర్శకుడు కోడూరి ఎసెస్‌ రాజమౌళికి ఈ ప్రాంతాల్లో బాహుబలి అంటే నేరాలు చేసే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్న విషయం తప్పక తెలిసుండాలి. ఏదేమైనా మొదట గూండాయిజం లేదా రౌడీయిజం ద్వారా అనుచరులు, డబ్బు, పలుకుబడి సంపాదించాక ఏదో ఒక పార్టీ టికెట్‌ పైనో లేదా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగానో పోటీచేసి చట్టసభల్లోకి జొరబడే ఆనవాయితీ మొదట ఉత్తరాది హిందీ రాష్ట్రాల్లోనే వచ్చింది. తర్వాత తెలుగు రాష్ట్రాలకు దిగబాకింది. బెజవాడ పూర్వపు గ్యాంగ్ట్సర్లు దేవినేని రాజశేఖర్‌ నెహ్రూ, వంగవీటి మోహనరంగారావు కూడా మొదట ‘బాహుబలులు’గానే పేరు సంపాదించి అసెంబ్లీకి పోయినవాళ్లేనని తెలుగువారందరికీ తెలుసు. రంగా గారు మొదట విజయవాడ కార్పొరేటర్‌ గా స్వతంత్ర అభ్యర్థిగా కృష్ణలంక డివిజన్‌ నుంచి 1981లో గెలిచారు. నెహ్రూ గారేమో నేరుగా టీడీపీ టికెట్‌ పైనే 1983 జనవరిలో తను నివసించే గుణదల అంతర్భాగంగా ఉన్న కంకిపాడు నుంచి ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. కాకపోతే బాహుబలులు హిందీ రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ, పార్లమెంటుకు వెళతారనే భ్రమలో మనం ఉంటాం. తెలుగు పత్రికలు కూడా తమ పాఠకులను ఇలాంటి భ్రమాజనిత లోకంలో ఉండడానికి తోడ్పడుతున్నాయి. రాయలసీమలోని రెడ్డి, స్వల్ప సంఖ్యలో ఉండే ఇతర కులాల బాహుబలులు కూడా ఫ్యాక్షనిస్టు అనే కాస్త అందమైన పేరుతో ఎన్నికల్లో గెలవడం 50 ఏళ్ల నుంచీ మనం చూస్తున్నదే. ఎటు తిరిగీ ఏమాటకు ఆ మాట–తెలంగాణలోనే బాహుబలులు ఎన్నికల్లో గెలవడం ఇటీవల పరిణామం మాత్రమే.

Optimized by Optimole