రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో వారికి మాత్రమే వారిచ్చే దీక్ష, ఉపదేశం, మార్గదర్శనం అందేవి. దీక్ష కూడా సాధకుని మనఃస్థితిని బట్టి మారుతుంటుంది. పరమహంస యోగానంద (ఒకయోగి ఆత్మకథ రచయిత) ప్రజలకు పెద్ద ఎత్తున మేలుచేయుట ఎలా అని అడిగితే, భగవాన్ – “అదెలా సాధ్యం? మూకుమ్మడి దీక్షలుండవు. ఉపదేశం సాధకుని పక్వత, అర్హతలపై ఆధారపడి వుంటుంది” అన్నారు.
రమణుల ఉపదేశదీక్షా కార్యక్రమం ఎంత క్రియాశీలకమైందో అంత గోప్యమైంది కూడా. చూసేవారికి దాని ఆనుపానులు తెలియక వారెవరికీ దీక్ష యివ్వరనీ, అసలు ఎవరినీ పట్టించుకోరన్న అపోహ కలిగేది. ఈ విషయంలో నటేశ ముదలియార్‌ను ఇదే మిషపై నిరుత్సాహపరిచాడో బ్రాహ్మణుడు. నిజానికి ఆత్మసాక్షాత్కారానికి సద్గురువు ప్రసాదించే దీక్ష, ఉపదేశం అత్యంత ఆవశ్యకం. ఈ విషయంలో భగవాన్ అభిప్రాయం ఇతర సంప్రదాయ గురువుల అభిప్రాయంకంటే ఏ విధంగాను భిన్నంకాదు. అందుచేత సత్య సాధకులకు రమణుల బోధనా విశిష్టత, ప్రశాంతయుతమైన వారి సన్నిధి లభిస్తే సరిపోదు. వారు తమకు దీక్షాగురువులన్న సంగతి ఏదోవిధంగా ప్రతిష్ఠమవ్వాలి.
గురువుకు సమర్పణ అంటే తన ఆత్మకంటే బాహ్యంగా వున్న వేరెవరికో కాదు. తన నిజతత్త్వాన్ని గుర్తించే దిశలో సహకరించేందుకు తనకు బాహ్యంగా ప్రకటమైన తనకే అని గుర్తించాలి. “గురువున్నది లోపలే. ధ్యానం చేసేది గురువు బాహ్యంగా ఉన్నాడన్న అజ్ఞానపు అపోహను తొలగించేందుకు. అతడు బాహ్యంలో తారసిల్లిన ఎవరో నూతనవ్యక్తి కాడు సుమా! అదే అయితే, ఇతరులవలె అతడూ కాలక్రమంలో అదృశ్యమై తీరుతాడు. అలాటి అశాశ్వత వ్యక్తితో ఒరిగేదేమిటి? మరి, నీవో పరిమితమైన దేహం అనుకున్నంతసేపు గురువు కూడా వేరే దేహంతోటి నీకు వెలుపల కనిపించే ఆవశ్యకత ఉంది. ‘నేను’ దేహమనే దోషభావం తొలగిపోగానే ఇంకేముంది, గురుమూర్తి నీ స్వరూపమే అయిన ఆత్మ అని గ్రహిస్తావు.
పూర్ణత్వంతోటి తాదాత్మ్యంలో ఉన్న గురువుకు పరిమిత అహం-గుర్తింపు లేని కారణంగా ఆ సంగతిని ప్రకటించే పనిలేదు. అలాగే ఇతరాన్ని చూడని కారణంగా తనకేదో శిష్యులున్నారనీ చెప్పుకోడు. రూపాలుంటేనే నంబంధాలు, బంధాలు కదమ్మా!
అయితే ఈ విషయంలో తికమక పడిపోయి, ఎటూ పాలుపోక అగమ్యగోచర స్థితిలో ఉన్న భక్తుని ఓదార్చి, సందేహాన్ని తీర్చి, నిలదొక్కుకునేలా చేయడంలో ఆయనకాయనే సాటి. 1940లో తనకట్టి అభయం ఈయబడినట్లుగా చాడ్‌విక్ అనే ఇంగ్లీష్ భక్తుడు వ్రాసుకున్నాడు.
చా: భగవాన్ తమకు శిష్యులు లేరంటారే?
భ: అవును.
చా: మరి, వారే ఆత్మసాక్షాత్కారానికి సద్గురువు అవసరమంటారే.
భ: అవును.
చా: ఇపుడేం చెయ్యాలి నేను. ఇన్ని సంవత్సరాల నా నిరీక్షణంతా వృథా కాలక్షేపమేనంటారా? భగవాన్ తమను తాము, గురువుగా అంగీకరించకుంటే నేను పోయి దీక్షనిచ్చే గురువును వెతుక్కోవాలా?
భ: నిన్నంత దూరంనుంచి తీసుకువచ్చి ఇంతకాలం ఇక్కడ నిలిపిన ఆ శక్తిని ఏమంటావు? నీకు సందేహం ఎందుకు? ఇతర గురువుతో పనుంటే నువ్వెప్పుడో ఇక్కడినుండి తొలగిపోయేవాడివి కాదూ!
చా: ఆ లెక్కన భగవాన్‌కు శిష్యులున్నట్టే అన్నమాట.
భ: నే చెప్పినట్టే. భగవాన్ దృష్టి పరిధిలో శిష్యులే లేరు. కానీ, శిష్యుని దృక్కోణంలో గురుకరుణ ఓ మహాసముద్రం. చిన్నగ్లాసుతో వస్తే అంతే అనుగ్రహాన్ని నింపుకొంటాడు. అందుకని సముద్రాన్ని పిసినారి అనడం తగునా? “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన ….” అన్నట్టుగా ఎవరెంత పెద్దపాత్ర తెచ్చుకుంటారో వారంత అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు. అంతా వారి వారి ఇష్టం.
చా: దీనిని బట్టి భగవాన్ నా గురువా, కాదా అన్నది నా విశ్వాసం మీద ఆధారపడి ఉంది; భగవాన్ ఒప్పుకోరు కదా మరి.
భ: (నిటారుగా, కూడదీసుకొని కూర్చుని, అనువాదకుని ద్వారా దృఢస్వరంతో) అంతేనా, లేక ఓ కాగితంమీద రాసి సంతకంపెట్టి ఇవ్వాలని కూడా అంటాడా ఏం!
ప్రొఫెసర్ మునగాల వేంకటరామయ్య తన డైరీలో ఆంగ్లవనిత మిసెస్ పిగోట్‌తో భగవాన్ ఇలా అన్నట్లుగా రాసుకున్నారు: ఆత్మ సాక్షాత్కార సాధనలో బోధలు, ప్రవచనాలు, ధ్యానాలు – ఇవన్నీ ద్వితీయ పక్షం. కానీ, ముఖ్యమైన, ప్రాథమికమైన కారణం గురువు అనుగ్రహమే.
భగవాన్‌ను ఎపుడైనా దీక్షలు ఇస్తారా అని ప్రశ్నిస్తే సూటి జవాబును దాటవేస్తారు. కాని, వారిచ్చే నయనదీక్ష అత్యంత ప్రత్యక్షం. ఈ ఒక్కవిషయంలో వారికి దాపరికం లేదు. తాము ఎంచుకున్న భక్తునిపై తీక్షణమైన దృష్టిని ప్రసరించేవారు. ఆ చూపు తీవ్రత, శక్తి ప్రకాశం భక్తుని అంతరంలోకి దొలుచుకొని పోయి అతని తలపు-ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసేవి. కొందరికది ఓ విద్యుత్ ప్రవాహ అనుభూతి, ఇంకొందరికి అత్యంత విశాలమైన శాంతికాంతి వెల్లువ. ఓ భక్తుడు అంటాడిలా! ”అంతే ఒక్కసారిగా భగవానుల ప్రజ్జ్వల పారదర్శక నేత్రాలు నాపై నిలిచాయి. అంతకు మునుపు నేను వాటికేసి ఎక్కువసేపు చూడలేకపోయేవాణ్ణి. ఇపుడా భీకరమైన తేజోపుంజాల కేసి తేరిపార చూసాను. ఎంతసేపలా సూటిగా నిలిపానో చెప్పలేను గానీ, ఆ దృక్కులు నన్నో విస్పష్టమైన – నాకు వినబడేంత సుస్పష్టమైన – స్పందనలో నిలబెట్టాయి”.
ఈ ప్రత్యక్ష దీక్షానుభవం తర్వాత ఒక తిరుగులేని, నిస్సందేహమైన నిశ్చయం ఏర్పడుతుంది. భగవాన్ స్వీకరించారనీ, ఇకపై ఆయనే కర్త, మార్గదర్శీ అని. కొంత ‘ఎరుక’ గలవారు అది సంభవించినపుడు గుర్తించగలరు – దీక్షాదానం అయినట్లు. అయితే, చాలావరకూ అది కొట్టొచ్చినట్లు ఏమాత్రం కనబడదు. ఏ వేదపారాయణ సమయంలోనో, వంటావార్పూ నడుమనో కావచ్చు. ఒకోసారి భక్తునికి వీడ్కోలు సమయంలోనో ఎపుడో భగవాన్‌నుండి ‘ఆకాశవాణి’ పిలుపు అందుతుంది, బహుశః అపుడు వారిచుట్టూ ఎవరూ ఉండకపోవచ్చు కూడా. ఇక, మౌనదీక్ష అత్యంత గోప్యం. పొందిన వానికొక్కనికే తెలిసేది. అతడెక్కడున్నా సరే ఆ దీక్షాప్రవాహం సూటిగా ఎదలో నాటుకోవడం గుర్తిస్తాడు. ఒకోసారి, నటేశ ముదలియార్‌కివలె, స్వప్నంలో జరగచ్చు.