Nancharaiah Merugumala: (senior journalist)
=========================
బంగారు తెలంగాణను ఇక ‘పద్మనాయకులే’ కాపాడుకోవాలేమో మరి!
డా.మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న తెలంగాణ రెడ్డి సూదిని జైపాల్ రెడ్డి అనేది నా అభిప్రాయం. కాని, ఈ పదవి సోనియా జీ ఇస్తానన్నా ఆయన కాదన్నారు. అదే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి (53) నిన్న పార్లమెంటు దిగువసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో గొడవపడి ‘నేను శూద్రుణ్ని’ అంటూ చెప్పిన ఏడుపు మాటలు విన్నాక నాకున్న మరో అభిప్రాయం మారింది. అదేమంటే–2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొంపదీసి కాంగ్రెస్ గెలిస్తే…రేవంత్ భయ్యా సీఎల్పీ నేతగా ఎన్నికయి సీఎం అయ్యే అవకాశం ఉందని అనుకునే వాణ్ని నిన్నటి దాకా. పార్లమెంటులో రాజస్థానీ వైశ్య స్పీకర్ ఓం బిడ్లా సాక్షిగా రేవంత్ ‘చేవలేని మాటలు’ నా అభిప్రాయం తప్పని నిరూపించాయి.
అసలు రేవంత్ ది ‘బలహీనమైన హిందీ’ అని మొదట వ్యాఖ్యానించింది సభలో కాంగ్రెస్ పక్ష నేత, బెంగాలీ బ్రాహ్మణుడైన అధీర్ రంజన్ చౌధరీ. రేవంత్ బలహీనమైన హిందీలో మాట్లాడుతున్నా ఆయనకు నిర్మల జవాబివ్వాలని సాటి బ్రాహ్మణుడైన అధీర్ ఆమెను కోరారు. అధీర్ మాటను పట్టుకుని నిర్మలమ్మ, ‘నా హిందీ కూడా బలహీనమైనదే అయినా రేవంత్ బలహీనమైన హిందీలో అడిగిన ప్రశ్నకు బలహీనమైన హిందీలోనే జవాబిస్తాను,’ అని అన్నారు కొంత వ్యగ్యం జోడించి. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నిర్మల మాటల్లో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఈమాత్రం దానికే, ‘నేను శూద్రుణ్ని, నిర్మలా జీ బ్రాహ్మణవాది’ అని రేవంత్ రెడ్డి బేలగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిర్మలను బ్రాహ్మణవాది అని ముద్ర వేయడానికిగాని, అభాండం వేయడానికి కాని ఇది సందర్భం కానే కాదు.
తెలంగాణలో రెడ్లు పోటుగాళ్లు, దిల్లీలో పిల్లులా?తెలంగాణలోనో, సరిహద్దున ఉన్న కర్ణాటక ప్రాంతంలోనో, ‘మా రెడ్లు పోటుగాళ్లు. ముఖ్యమంత్రిగా మంచి పరిపాలనా సామర్ధ్యం ఉన్నోళ్లు. ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయం రుజువైంది. కాకతీయుల కాలం నుంచీ రెడ్లే సత్తా ఉన్నోళ్లని తేలింది,’ అనే రీతిలో కొన్ని నెలల క్రితం రేవంత్ మాట్లాడారు. మరి పార్లమెంటులో అడుగుపెట్టాక ఆయనలో అంతటి ఆత్మవిశ్వాసం ఏమైందో మరి? తెలంగాణ రెడ్లు హైదరాబాద్ లో ఉస్తాదులు, వస్తాదులే గాని హస్తినలో బలహీనులని రేవంత్ ను చూశాక అనిపిస్తోంది. రేవంత్ ముందు తరానికి చెందిన తెలంగాణ రెడ్డి రాజకీయవేత్త, ‘రాజనీతిజ్ఞుడు’ ఎస్. జైపాల్ రెడ్డికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలు బాగా రావడమేగాక ఆయన అన్న అల్లుడైన రేవంత్ లో లేని గొప్ప ఆత్మవిశ్వాసం, ప్రతిభాపాటవాలున్నాయి. మరి ఆయనెప్పుడూ రెడ్లే తెలుగునాట ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనలేదు. జైపాల్ అన్నగారి కూతురును కులం, సంపద, ఇతర హోదాలు చూసి రేవంత్ రెడ్డి చాలా ఇష్టపడి, బాగా కష్టపడి పెళ్లి చేసుకున్నాడు, సగటు రాజకీయ నాయకునికి మించిన తెలివితేటలతో డబ్బు సంపాదించాడు. జాగాలు, సంపద కూడబెట్టాడు. జూబ్లీ హిల్స్ లో పేద్ద ఇల్లు కట్టుకున్నాడు. ప్రస్తుత కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి గారిని 2014లోనే బెదరగొట్టి లొంగదీశాడు (మల్లారెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు సీటుకు తెలుగుదేశం టికెట్ పై పోటీచేసి, గెలిచినప్పుడు).
అయితే, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సూచనపై తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యుడు ఎల్విస్ స్టీవెన్సన్ ను కలిసి, ఒక విషయంపై ‘నచ్చజెప్పడం’లో రేవంత్ విఫలమయ్యారు. అంతేగాదు, చంద్రబాబు గారి పరువు తీసినంత పనిచేశాడు. ఇంత గందరగోళపు రాజకీయ నేపథ్యం పెట్టుకుని కూడా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ అనవసరంగా నిర్మలపై నోరుపారేసుకున్నాడు. అదీ ఏడుపుగొట్టు శైలిలో.
మున్నూరు కాపు నేతలే రేవంత్ వంటి ‘రవ్వంత’ రెడ్ల కన్నా ఎక్కువ చేవ ఉన్నోళ్లా?
కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న (గతంలో, ఇప్పుడు) మున్నూరు కాపు నేతలు (బీసీ నేతలు కూడా) వి.హనుమంతరావు గాని, తెలంగాణ ‘భీష్మపితాహుడు’ కంచర్ల కేశవరావు (83) గాని ఏనాడూ రేవంత్ మాదిరిగా ‘మేము మున్నూరు కాపులం, బీసీలం (డీ గ్రూపు), బడుగు–బలహీనులం’ అంటూ ఏడుపు మొహంతో భారత కేంద్ర చట్టసభలో వాపోయిన సందర్భాలు లేవు. వారికి కూడా అటల్ బిహారీ వాజపేయి, ఇందిరాగాంధీ మాదిరిగా శుద్ధ హిందీ రాదు. వచ్చిన హైదరాబాదీ దక్కనీ హిందీలో చక్కగా వారు మాట్లాడేవారు. హనుమంతన్న అయితే ఇందిర కొడుకులు సంజయ్, రాజీవ్ గాంధీలతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా మెలిగారు. తెలంగాణ ‘బహుజన’ నేతలు సైతం రేవంత్ మాదిరిగా ‘ మే. శూద్రోళ్లం. మాకు శుద్ధ హిందీ రాదు. మీరు బ్రాహ్మణవాదులు,’ అని అకారణంగా ఎవరినీ నిందించలేదు. తెలంగాణలో రెడ్డి కులంలో పుట్టి, చాలూ తెలివితేటలు ఉండి, జైపాల్ రెడ్డి వంటి బలిసిన రెడ్లకు అల్లుడు అయి, జూబ్లీ హిల్స్ లో కోటంత ఇల్లుంత మాత్రాన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే అవకాశం రాదని రేవంతన్నకు ఎవరైనా చెబితే బాగుంటుంది. సునీల్ కనుగోలో లేదా కొనుగోలో వంటి ఎన్నికల నిపుణులు రేవంత్ రెడ్డికి గచ్చిబౌలీలో ఈ విషయమై ప్రత్యేక శిక్షణ ఇస్తే మేలు.
గోదావరి గౌడ మహిళ కోడలు నిర్మలనే అంత మాట అంటే ఎలా?
ఇక, నిర్మలా సీతారామన్ విషయానిక వస్తే..ఆమె తమిళనాడు మదురై బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. మంచి చదువుతో, చాలా వరకు స్వయం కృషితో లండన్ నగరంలో మంచి ఉద్యోగం చేశారు. ఆమె పెళ్లాడి చాలా కాలం కాపురం చేసిన ఆమె భర్త –మాజీ జర్నలిస్టు, మాజీ ఆర్థికవేత్త, విశ్లేషకుడు, మాజీ నాయకుడు పరకాల ప్రభాకర్. ఆయన తండ్రి పరకాల శేషావతారం గారు కొన్నేళ్లు కమ్యూనిస్టుగా బతికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యే (నర్సాపురం), మంత్రి (పీవీ నరసింహారావు గారు, ఇతర సీఎంల కేబినెట్లలో) అయ్యారు. శేషావతరాం గారు పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ ప్రాంతానికి చెందిన కామన కాళికాంబ గారిని పెళ్లాడారు. కాళికాంబ గౌడ కుటుంబంలో పుట్టినాగాని నియోగ బ్రాహ్మణ కమ్యూనిస్టు అయిన శేషావతారం గారికి భార్యకావడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, తమిళ బాపన అయ్యంగార్ కోడలు నిర్మలా సీతారమన్ గారికి ఆవకాయ పచ్చడి పట్టడం (మేం ఇలాగే పలుకుతాం. బ్రాహ్మలేమో పచ్చడి పెట్టడం అంటారు) నేర్పారు కాళికాంబ. ఇంతటి వైవిధ్యభరితమైన కుటుంబనేపథ్యం ఉన్న నిర్మలను ‘బ్రాహ్మణవాది’ అనడం సబబు కాదు. కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలు బ్రాహ్మణవాదులైన జైరాంరమేష్, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీ వంటి ఎంపీలను వదిలేసి ‘నిర్మా మహిళ’ నిర్మలమ్మను అంత మాట అనడాన్ని చూస్తే…రేవంతయ్యకు దిల్లీ గల్లీల లోతులు, వెడల్పులు ఇంకా బోధపడలేదనుకోవచ్చు. హిందీ మాతృభాషగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లేదా బిహార్ కు చెందిన బీజేపీ బ్రాహ్మణ మంత్రులు ఎవరైనా పొగరు చూపిస్తే…వారిని అనాల్సిన తిట్టును (బ్రాహ్మణవాది) పాపం తెలుగు గౌడ–బాపన దంపతుల కోడలు నిర్మలపై ప్రయోగించడం తెలంగాణ రెడ్డి నేతల పరువు తీసే పని తప్ప మరోటి కాదు.