నిజాం రాజ్యంలో మతం – ఎవరికి మేలు, ఎవరికి కీడు??

విశీ( సాయి వంశీ) :

ఇత్తెహాదుల్ ముసల్మీన్ అనే సంస్థ ప్రతినిధులు ఊరి దొర, కరణాల ఎదురుగానే మాలలు, మాదిగలను ఇస్లాం మతంలోకి మార్చారు. వారికోసం దొర గోమాంస బిర్యానీ కూడా వండించాడు. ఓ దళిత మహిళ తాళి తీయడానికి ఇష్టపడక, ఈ మతం నాకొద్దని పోతూ ఉంటే దొర లోలోపల సంతోషించాడు. చివరకు తాళి మెళ్ళో ఉండగానే వారిని మతం మారేలా చేశారు ఆ సంస్థ నాయకులు.

ముస్లింగా మారిన దళిత పుల్లయ్య కొన్నాళ్లకు దొర గడీ ముందుకు వచ్చాడు. మతం మారినంత మాత్రాన ఆర్థిక స్థితి మారుతుందా? ముస్లింలుగా మారినంత మాత్రాన ఈ పేద దళితుల్ని సమానంగా చూస్తారా? అదంతా దొరకు చెప్పి వాపోయాడు పుల్లయ్య. పట్నంలో ఆర్యసమాజం వారు ఉన్నారని, ఇలా ముస్లింలుగా మారిన వారిని తిరిగి హిందూమతంలోకి మారుస్తారని చెప్పాడు.

కొన్నాళ్లకు ఆర్య సమాజం నుంచి నరేంద్రజీ అనే వ్యక్తి వచ్చి దొరను కలిశాడు. ముస్లింలుగా మారిన మాల మాదిగలను మళ్లీ హిందూ మతంలోకి మారుస్తానన్నాడు. వారి మధ్య జరిగిన సంభాషణ చూడండి.

  “అచ్చా! మీరేం చేస్తరు?” అడిగాడు దొర.

“శుద్ది చేస్తాం.” అన్నాడు నరేంద్ర.

“అంటే!”

“హోమంచేసి తురకలుగా మారినవారిని మళ్ళీ హిందువుల్ని చేస్తాను”

“ఊహు. అయితే ఏం లాభమైతది?”

అలాంటి ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్దంగా లేడు నరేంద్రజీ. లాభమంటే ఏమిటో అతనికి అర్థం కాలేదు. కాస్త ఆలోచించి “దొరవారూ! తరకలు కాకుండా వుంటేనే ఈ మాల మాదిగలు మీ చేతుల్లో ఉంటారు. తురకలైతే రాజులమైపోయామనుకుంటారు. మీ మాట వినరు, వెట్టిచేయరు. ఆ విధంగా మీకు నష్టం కలుగచేస్తారు” అన్నాడు.

“హు. మీకు రామారెడ్డి సంగతి ఎరికే లేనట్లున్నది. నా పేరు చెప్పితే ఉచ్చపడ్తది లంజకొడుకులకు. ఇంక నా మాట ఇనరనుకుంటాన్నారు? వాండ్లు తురకోండ్లయిన, బాపనోండ్లయిన, నేను ఎట్ల దున్కమంటే అట్లు దున్కాలే – ఎరికేనా?” అన మీసం మెలేశారు రెడ్డిగారు.

“మీ అధికారం తక్కువగా ఉన్నదని కాదు నేననడం. ఇవ్వాళ నీ బాంచను, నీ కాల్మొక్తనని చేసేవాడు, రేపు మీకు భయపడి చేస్తాడు. మీరొక దెబ్బ కొట్టినా, తన్ను తన్నినా పోలీసుల వద్దకు వెళ్ళాడనుకోండి. వాడిమాటే వింటారు పోలీసులు కాని, మీమాట వినరు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ అధికారానికి భయపడి ఈ కొత్త తురకలిలా ఉన్నారు కాని వేరే చోట్లలో ఎన్ని ఘోరాలు చేస్తున్నారో తెల్సునా! తురకలు కాగానే బావులు ముట్టుకుంటున్నారు. ఊళ్ళోవాళ్ళేమైనా గడిబిడి చేస్తే బావుల్లో ఆవు మాంసం వేస్తున్నారు. చచ్చిన జంతువుల్ని మేం తీసెయ్యమంటే బ్రాహ్మణులు తీసుకోవాల్సి వస్తున్నది.”

“సరేగాని, మీరేమో జంధ్యమేసి, మంత్రంచెప్పి, బాపన్లను చేసి నెత్తికెక్కించుకుంటరట కద?”

“అదేం లేదు. వారిని శుద్దిచేసి వారి పూర్వపు పేర్లు వారికి పెడ్తాను అంతే.”

ప్రముఖ రచయిత, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకుడు దాశరథి రంగాచార్య 1970లో రాసిన ‘చిల్లర దేవుళ్లు’ నవలలోని సన్నివేశాలు ఇవి. నిజాం రాజ్యంలో క్రూరత్వాన్ని కళ్లారా చూసిన, అనుభవించిన వ్యక్తి రంగాచార్య గారు. ఆయన అబద్ధం రాస్తారా? ఇస్లాం మతవ్యాప్తి కోసం దళితుల్ని తమ మతంలోకి మార్చింది నిజాం ప్రభుత్వం. కానీ వారిని దూరంగానే ఉంచింది. వాళ్లు తమ కిందే బానిసల్లా ఉండాలన్న ఆశతో వారిని తిరిగి హిందూమతంలోకి మార్పించారు దొరలు. రాజ్యంలో ఏ మతం ఉండనీ, వాళ్ల బతుకులు మాత్రం ఏమీ గొప్పగా లేవు. 

ఇదే నవలలో చింతలతోపులో దొంగతనం చేసినందుకు ఒకణ్ని చంపిస్తాడు దొర. లంబాడీల దగ్గర డబ్బు తీసుకుని, వారి భూమిని ఇవ్వకుండా తిప్పుతుంటాడు కరణం. చివరకు వారు ఎదురుతిరిగితే పోలీసు పటేల్ సాయంతో వారిని బంధించి, వారిలో ఒకరి భార్యను చంపే స్థితికి తెస్తాడు. చివరకు ఆ లంబాడీలే అతణ్ని నరికి చంపేస్తారు.

నిజాం రాజ్యంలో సంస్కృతిపై దాడి జరిగింది నిజం. ఆ దాడి హిందువుల సంస్కృతిపైనా, బహుజనుల సంస్కృతిపైనా అనేది ఆలోచించాలి. భాష మీద దాడి జరిగింది వాస్తవం. అయితే దొరల పాలనలో దళితులకు విద్య అందిందా అనేది ఆలోచించాలి. రజాకార్లు హిందువులను చంపింది వాస్తవం. కానీ అంతకుమించి దళిత, బహుజన వర్గాలు అటు దొరలు, ఇటు రజాకార్ల కాళ్ల కింద నలిగాయి. ఖాసీం రజ్వీ సేనలు స్త్రీలపై అత్యాచారాలు చేసిన మాట నిజం. కానీ దొరల చేతిలో నలిగిన బహుజన స్త్రీల గొంతుకలు ఎవరు వినిపిస్తారు? అన్ని అత్యాచారాలను నైసుగా నిజాం ఖాతాలో వేద్దామా? దళిత, బహుజనుల ఘోష హిందువుల గోసగా ఇవాళ మారింది. మరి ఆరోజు? అందరితో సమానంగా వారికి విద్య, ఇతర సౌకర్యాలు ఎందుకు అందలేదు? నిజాం రాజ్యంలోని అప్పటి ముస్లింలు ఆనాటికీ, ఈనాటికీ ఎందుకు నిరుపేదలుగా జీవిస్తున్నారు? ఆ మహిళలు ఇంకా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఇది కదా కావాల్సిన చర్చ.

హిందూ అనే పదం ఇవాళ ట్యాగ్‌గా వాడి అందరినీ ఆ గొడుగు కిందకు తేవచ్చు కానీ, ఆ వేళ దళితులు, బహుజనులు ఇంకా వెట్టి చాకిరీ, నిరుపేదరికం, నిరక్షరాస్యతలోనే కూరుకుపోయి ఉన్నారు. దానికి కారణం నిజామా? దొరలా? ఆ నిరుపేదల భూములు  దొరలపాలు చేసింది ఎవరు? వాటిని వారికి తిరిగి ఇప్పించింది ఎవరు? సినిమా వాళ్లకు ఇంత చరిత్ర గుర్తుండక పోవచ్చు. వాళ్లకు నచ్చిందే వాళ్లు చూపిస్తారు. నిజానిజాలు తెలియకుండా మనం ఊగిపోరాదు. మనం ఊగిన కొద్దీ అటు ఓట్లు, ఇటు చిల్లర ఏరుకునే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. వారి వలలో పడొద్దు.