Maharashta2024: మ‌హా సంగ్రామంలో కీల‌కం రిజ‌ర్వ్‌డ్ స్థానాలు..!

Maharashtraelections2024:

దేశంలో ప్రముఖ సామాజికవేత్తల ఉద్యమాలకు నెలవైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కీలకమైన పాత్ర పోషించనున్నారు. డా.బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, అథేవాలే, కాన్షీరాం వంటి ఎందరో ఉద్దండులను ఆదరించిన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును రిజర్వుడ్ స్థానాలే శాసించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లలో అధిక స్థానాలు సాధించనున్న కూటమికే అధికారం దక్కనుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145 సాధించాలంటే 29 ఎస్సీ, 25 ఎస్టీ మొత్తం 54 రిజర్వుడ్ సీట్లే కీలకంగా మారి అధికారానికి సోపానాలుగా మారాయి. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓట్ల ప్రాముఖ్యతను గుర్తించిన అధికార బీజేపీ, శివసేన (ఎక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీల ‘మహాయుతి’, ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్పవార్) పార్టీల ‘మహా వికాస్ అఘాఢీ’ (ఎమ్వీఏ) కూటములు అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించుకొని కదనరంగంలోకి దిగుతున్నాయి. 2009, 2014, 2019 శాసనసభ ఎన్నికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను బేరీజు వేయడంతోపాటు రిజర్వుడ్ స్థానాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

మహారాష్ట్రలో గత ఎన్నికలకు, రాబోయే ఎన్నికలకు మధ్య ప్రధాన వ్యత్యాసం రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు మారడమే. 2019 ఎన్నికలకు, 2024 పార్లమెంట్ ఎన్నికల మధ్యకాలంలో రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాల ప్రభావం లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలో కూటములుగా ఏర్పడడంతో రాష్ట్రంలో అరడజను పార్టీల భవిష్యత్ ఇతర నియోజకవర్గాల వలే రిజర్వుడ్ స్థానాల్లో కూడా మారుతున్నట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. రిజర్వుడ్ స్థానాల్లో 2014 నుండి అన్ని ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం కనిపించినా 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆ పార్టీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 5 ఎస్సీ స్థానాలను కాంగ్రెన్ నేతృత్వంలోని ఎమ్వీఏ గెల్చుకోగా, 4 ఎస్టీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి రెండు, ఎమ్వీఏ రెండు గెల్చుకున్నాయి. మొత్తం మీద 9 రిజర్వుడు సీట్లలో ఎమ్వీఏ 7 చోట్ల గెలిచి తన ఆధిక్యతను కనబర్చి రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది పలికింది.

 

గత మూడు శాసనసభ ఎన్నికల్లోనూ 29 ఎస్సీ నియోజకవర్గాల్లో నువ్వానేనా అన్నట్టుండింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి 13 స్థానాలు, బీజేపీ, శివసేన కూటమి 16 స్థానాల్లో గెలిచాయి. 2014 ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేయగా కాంగ్రెస్ 2, ఎన్సీపీ 3, బీజేపీ 15, శివసేన 9 స్థానాల్లో గెలిచాయి. 2014 ఎన్నికల్లో మోదీ హవా బీజేపీకి కలిసి వచ్చింది. 2019 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ ఎన్సీపీతో, బీజేపీ శివసేనతో కలిసి పోటీ చేయగా కాంగ్రెస్ కూటమి 13, బీజేపీ కూటమి 14, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో కూటములు సాధించిన ఫలితాలను బట్టి అసెంబ్లీ సెగ్మంట్లలో బలాబలాలను పరిశీలిస్తే ఎమ్వీఏ 17, మహాయుతి 11, ఇతరులు మరో చోట ఆధిపత్యంలో ఉన్నారు.

 

రాష్ట్రంలో ఎస్టీకి సంబంధించిన 25 సెగ్మంట్ల అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలిస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 16 స్థానాలను గెలిచి స్పష్టమైన ఆధిక్యతను పొందింది. బీజేపీ కూటమి 6 స్థానాలకు పరిమితం కాగా, ఇతరులు 3 స్థానాలను సాధించారు. 2014 ఎన్నికల్లో మోదీ ప్రభావంతో బీజేపీ సొంతంగా 11 స్థానాలను గెలిచింది. శివసేన 4, కాంగ్రెస్ 5, ఎన్సీపీ 3, ఇతరులు 2 చోట్ల గెలిచారు. 2019 ఎన్నికల్లో రెండు కూటములు పోటాపోటీగా తలపడగా కాంగ్రెస్ కూటమి 10, బీజేపీ కూటమి 11, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి 25 ఎస్టీ సెగ్మంట్లను పరిశీలిస్తే కాంగ్రేస్ కూటమి 15 చోట్ల ఆధిపత్యం సాధించి ముందంజలో ఉండగా, బీజేపీ కూటమి 10 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. రిజర్వుడు స్థానాలకు సంబంధించి పై ఫలితాలను పరిశీలిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు కూటముల మధ్య తీవ్ర పోటీ ఉండగా, ఎస్టీ సెగ్మంట్లలో 2009లో కాంగ్రెస్ కూటమి, 2014లో బీజేపీ ఆధిపత్యం సాధించగా, 2019లో రెండు కూటముల మధ్య ఎన్నిక పోటాపోటీగా జరిగింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఎమ్వీఏ కూటమి మహాయుతి కూటమిపై స్పష్టమైన ఆధిపత్యం కనబర్చడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి సానుకూల అవకాశాలున్నట్టు స్పష్టమవుతోంది.

రిజర్వుడ్ స్థానాల్లో రెండు ప్రధాన కూటములతో పాటు చిన్న పార్టీల్లో ప్రధానంగా వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ), బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) ప్రభావం కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీవీఏ ఒక్క శాతం ఓట్లే సాధించినా మూడు స్థానాల్లో గెలిచింది. మరోవైపు డా.బీఆర్. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వీబీఏ దాదాపు 5 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. వీబీఏ సీట్లు గెలవకపోయినా ఓట్లు చీల్చడంతో ప్రధానంగా ఎమ్వీఏకు నష్టం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఎమ్ఐఎమ్తో పొత్తు పెట్టుకున్న వీబీఏ సుమారు 10 స్థానాల్లో ఓట్లు చీల్చడం ద్వారా ఎమ్వీఏ ఓటమికి కారణమైంది. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిన వీబీఏ అకోలా, బుల్దాన, హాట్కనన్గేల్, నార్త్ వెస్ట్ ముంబాయి నియోజకవర్గాల్లో ఎమ్వీఏ ఓటమికి పరోక్షంగా కారణమైంది. దీంతో బీజేపీకి ‘బీ’ టీమ్గా వీబీఏ మారిందనే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఆరోపణలను ఏ మాత్రం పట్టించుకోని ప్రకాశ్ అంబేద్కర్ ప్రధానంగా విదర్భ, ముంబాయి ప్రాంతాల్లో 70 మందికి పైగా అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడంతో ఎమ్వీఏలో ఆందోళన నెలకొంది.

2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో పలుమార్లు గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో… 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రెండు కూటములు పోటాపోటీగా తలపడినా ఎమ్వీఏ వ్యూహాత్మకంగా వ్యవహరించి మాహాయుతిపై ఆధిపత్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్ర సందర్భంగా ఎస్టీ స్థానమైన నందూర్బార్లో భారీ సభ నిర్వహించి ఆ సామాజికవర్గానికి చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ప్రియాంక గాంధీ కూడా నందూర్బార్తో పాటు పలు రిజర్వుడ్ స్థానాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కాంగ్రెస్కు రిజర్వుడ్ స్థానాల్లో అనుకూల ఫలితాలొచ్చాయి. దీంతో పాటు బీజేపీ ప్రచారం పెట్టన ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని కూడా కాంగ్రెస్ ప్రత్యేకంగా రిజర్వుడ్ స్థానాల్లో తెలివిగా వాడుకుంది. బీజేపీకి మెజార్టీ పెరిగితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దీంతో బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలుగుతుందనే కౌంటర్ ప్రచారం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వుడ్ స్థానాల్లో నష్ట పోయింది.

పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వుడ్ స్థానాల్లో దెబ్బతిన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీజేపీ రాజ్యాంగం మారుస్తుందని కాంగ్రెస్, కాంగ్రెస్ రిజర్వేషన్లను మారుస్తుందని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగం వర్సస్ రిజర్వేషన్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో 17 శాతానికిపైగా ఎస్సీలుండగా వారిలో బౌద్దులకు చెందిన వారు సగంపైగా ఉన్నారు. ఎస్సీల్లో హిందూ దళితులు బీజేపీకి, బౌద్దులు బీజేపీ యేతర పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. బౌద్దుల ఓట్లపై కన్నేసిన బీజేపీ లోక్సభ ఎన్నికల అనంతరం ఆ సామాజిక వర్గంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 పైగా చిన్న, పెద్ద, వీధి సమావేశాలను ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ అధినేతలు కూడా బౌద్ద సన్యాసుల ఆశ్సీసులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 54 రిజర్వుడ్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఓట్లే కాకుండా ఇతర సామాజికవర్గాలపై కూడా దృష్టి పెట్టిన ఈ రెండు కూటములు పరోక్షంగా చిన్న పార్టీలను బరిలోకి దింపి ప్రత్యర్థుల ఓట్లు చీల్చడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నాయి.

మహారాష్ట్రలో అధికారానికి తొలిమెట్టు రిజర్వుడ్ స్థానాల్లో గెలుపే అని గుర్తించిన రెండు కూటములు ఎస్సీ, ఎస్టీ సామాజిక ఓట్లను పొందేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల బలాలు, బలహీనలతోపాటు చిన్న పార్టీల ద్వారా జరిగే ఓట్ల చీలికలపై కూడా ఆశలు పెట్టుకొని అడుగులేస్తున్నాయి. నవంబర్ 20న జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ప్రసన్నం ఎవరికి లభిస్తుందో నవంబర్ 23న వెలువడే ఫలితాల్లో తేలనుంది.

Optimized by Optimole