ఫలితాలు అన్ని పార్టీలకు మును(పటి)గోడే…!!

దేశంలోనే అత్యంత ఖరీదైన మునుగోడు ఉప ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పుడు రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయాలపై చర్చలు మొదలయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల ప్రభావంతో రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలకు మునుగోడు బలమైన నియోజకవర్గం. 2018 సాధారణ ఎన్నికల్లో 12 వేల ఓట్లు మాత్రమే సాధించిన బిజెపి బలం నామమాత్రమే అయినా ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యక్తిగతంగా పట్టు ఉంది. 2014లో 38 వేల ఓట్ల మెజార్టీ సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు కేసిఆర్‌ మొదలుకొని మంత్రులు, పార్టీ రాష్ట్ర యంత్రాంగం అంతా అస్త్రశస్త్రాలతో అదరగొట్టినా పది వేల మెజార్టీతో గట్టెక్కారు. బిజెపి రాష్ట్ర రాజకీయాల్లో బలోపేతం కావడానికి మునుగోడును ఒక ప్రయోగశాలగా చేసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఓటిమి చెందినా మరోవైపు రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నాం అనే సందేశాన్ని మాత్రం బిజెపి ఇవ్వగలిగింది.

 

  కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోవడం కోలుకోలేని దెబ్బ. గెలిచినా మధనపడుతున్న టిఆర్‌ఎస్‌..

టిఆర్‌ఎస్‌ మునుగోడు ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలు గుప్పించింది. మద్యం, డబ్బు పంపిణీ విచ్చలవిడిగా పంచిందనే ఆరోపణలు ఈ పార్టీపై వచ్చాయి. మద్యానికి సంబంధించి స్వయానా మంత్రి మల్లారెడ్డి ఉన్న వీడియోలు సంచలనంగా మారాయి. టిఆర్‌ఎస్‌ అధికారాన్ని కూడా అనుకూలంగా మల్చుకుందనే వార్తలు రోజూ చూశాం. చివరికి ఎన్నికల రోజు కూడా ఓటు వేయని గ్రామస్తులకు అభివృద్ధి పనులకు సంబంధించి స్వయానా కేటిఆర్‌ ఫోనులో హామీ ఇచ్చిన ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ విధంగా అర్థ, అంగ బలాన్ని టిఆర్‌ఎస్‌ పార్టీ దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి.

వామపక్షాలకు సుమారు పాతిక వేల వరకు ఓటు బ్యాంకుండడంతో కేసిఆర్‌ ముందుచూపుతో వారితో జతకట్టారు. ఈ పరిణామాల మధ్య టిఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డా ఎన్నికల ఫలితాలు మాత్రం టిఆర్‌ఎస్‌ ఊహించిన స్థాయిలో లేవనే చెప్పవచ్చు. గ్రామీణ స్థాయిలో కూడా టిఆర్‌ఎస్‌కు బిజెపి సవాలు విసిరింది. ఈ ఫలితం ప్రభావం ఆ పార్టీపై వచ్చే సాధరణ ఎన్నికల్లో తప్పకుండా ఉంటుంది. రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌పై ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. ఒక ఎన్నికపై ఇంత దృష్టి పెట్టిన ఆ పార్టీ వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలపై ఈవిధంగా కేంద్రీకరించడం సాధ్యం కాదు. 2018 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు ఓడిపోయిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల అసంతృప్తి నెలకొంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మునుగోడులో గెలిచినా టిఆర్‌ఎస్‌కు అంతర్గతంగా హెచ్చరిక సూచనలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బిజెపిది బలం కాదని, వాపు అనే ప్రచారం చేయడానికి మాత్రం అనుకూల పరిస్థితులు కేసీఆర్‌ బృందానికి ఏర్పడ్డాయి.

బిజెపి విస్తరణను అడ్డుకట్టుగా ఫలితం..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసీటు మాత్రమే గెలిచి ఘోర పరాజాయాన్ని మూటగట్టుకున్న బిజెపికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన మోడీ అనుకూల పవనాలతో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలిచింది. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలు, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు కలిసి వచ్చాయి. ఈ విజయాలతో దూకుడు ప్రదర్శించిన బిజెపి మరింత ఎదగాలనే భావనతో మునుగోడు ఎన్నికను ఏరికోరి తెచ్చుకుంది. నియోజవకర్గం అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేసినట్టు రాజగోపాల్‌రెడ్డి చెప్పినా కాంట్రాక్టుల కోసమే ఆయన పార్టీ మారారనే విషయాన్ని టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ఇవి అనవసర ఎన్నికలనే అభిప్రాయం ప్రజల్లో తీసుకురాగలిగాయి. గంపగుత్తగా కాంగ్రెస్‌ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారుతారని బిజెపి భావించినా రాజగోపాల్‌రెడ్డి అనుచరులు, అభిమానులు తప్ప పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు రాలేదు. టిఆర్‌ఎస్‌తో పోటీపడుతూ బిజెపి కూడా మద్యం, డబ్బు పంపిణీ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. మునుగోడు ఎన్నికల్లో విజయం సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలలోని అసంతృప్తి నేతలతో పాటు వివిధ సామాజిక వర్గ నేతలు పార్టీలో చేరుతారని ఆ పార్టీ ప్రణాళికలు రూపొందించింది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు మునుగోడులో బిజెపి ఓటమి రాష్ట్రంలో ఆ పార్టీ విస్తరణకు కాళ్లకు బంధాలేసినట్టు అయ్యింది. బిజెపి ఓటమితో ఆ పార్టీలోకి చేరుదామనుకునే నేతలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బిజెపిలో చేరాలనుకునేవారు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అదీగాక ఆపరేషన్‌ ఫాంహౌస్‌ ఘటనతో కూడా జంకుతున్నారు.

అన్నివిధాలా నష్టపోయిన కాంగ్రెస్‌..

మునుగోడు ఎన్నికల్లో అన్ని విధాలా నష్ట పోయింది నిస్సందేహంగా కాంగ్రెస్‌ పార్టీయే. గతంలో నియోజకర్గంలో ఆరుసార్లు విజయం సాధించిన కాంగ్రెస్‌ ఇప్పుడు డిపాజిట్‌ కోల్పోవడం స్వయంకృతాపారాధమే. రేవంత్‌రెడ్డి పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టి నుండి పార్టీలో మొదలైన వర్గపోరు మునుగోడు ఎన్నికతో పరాకాష్టకు చేరింది. అభ్యర్థి ఎంపిక నుండి ప్రచారం వరకూ అన్ని అంశాలలో అసంతృప్తులు బట్టబయలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీకి కీలక నేతలున్నా మునుగోడులో ఘోర పరాజయం పార్టీకి కోలుకోలేని దెబ్బే. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన స్రవంతికి 27 వేల ఓట్లు రాగా ఇప్పుడు 23 వేల ఓట్లే రావడం ఇక్కడ గమనార్హం. రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. ఎన్నికలకు ముందే తనను, పార్టీని అణగదొక్కడానికి టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలతో కొందరు కాంగ్రెస్‌ నేతలు చేతులు కలిపారని రేవంత్‌ కన్నీరు పెట్టారు. ఈ ఎపిసోడ్‌తో ఆయనకు ఎంత సానుభూతి వచ్చిందో అటుంచుతే ఎన్నికకు ముందే ఆయన చెత్తులేత్తేసారనే సంకేతాలు వెళ్లడంతో పార్టీ అభిమానులు, తటస్తంగా ఉన్న ఓటర్లు, ప్రభుత్వ వ్యతిరేకుల ఓట్లు బిజెపికి బదిలీ అయి కాంగ్రెస్‌ ధరావత్తు కోల్పోవడానికి కూడా కారణమయ్యాయి. కాంగ్రెస్‌ నేతల అంతర్గత రాజకీయాలకు పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ జోడో యాత్ర కూడా తోడయ్యింది. ఎన్నికల ప్రచారంపై ఆసక్తి లేనివారు మనుగోడు కాకుండా జోడో యాత్ర సాకుతో పలాయనం చిత్తగించారు. దేశవ్యాప్తంగా పాద యాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో ఉన్నప్పుడే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్‌ కోల్పోయిన ఫలితం రావడం యాదృచ్ఛికమే అయినా ఆయనకు ఇబ్బందికరమైన అంశమే. టిఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నేతలకు రాష్ట్రంలో సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్‌ ఒక ఆశాజనకంగా ఉండేది. అయితే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ వరుసగా పరాజయాలు పాలుకావడంతో కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వారు మరో దారి చూసుకునే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలహీన పడుతున్న ప్రస్తుత దశలో బిజెపి వెంట ఉంటే లాభదాయకమని తటస్థ నేతలు భావిస్తారు.

వామపక్షాలు ఎప్పుడేగట్టున ఉంటాయో…

మతతత్వ పార్టీ అయిన బిజెపిని అడ్డుకుంటామానే వామపక్షాలు ఎంఐఎంకు మిత్రపక్షంగా ఉన్న టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం అవకాశవాదమే. మునుగోడులో ఉప ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్‌ ఒక్కమారే గెలిస్తే, వామపక్షాలకు ఐదు సార్లు గెలిచిన చరిత్ర ఉంది. ఈ విజయాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ వామపక్షాలే పోటీకి సిద్దమై, కేసీఆర్‌ మద్దతు కోరుంటే మునుగోడు ఉప ఎన్నిక చరిత్రే మరోలా ఉండేది. బిజెపి బలపడకుండా ఉండడానికి టిఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినట్లు వారు సమర్థించుకుంటారు. అయితే ఇంతకాలం కేసిఆర్‌ ప్రభుత్వంపై వారు చేసిన విమర్శలన్నీ ఒప్పు అవుతాయా..? టిఆర్‌ఎస్‌తో ఉంటూనే ప్రజా సమస్యలపై నిలదీస్తామంటారు. టిఆర్‌ఎస్‌తో జతకట్టినప్పటి నుండి వారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తిచూపిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ వామపక్షల మధ్య అవగాహన ఉంటుందనే వార్తలొస్తున్నాయి. అప్పుడు మళ్లీ ఈ వామపక్షాలు కొన్ని స్థానాలకే పరిమితమవడం ఖాయం.

===================

 

 

-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,
సెల్‌నెం: 9949372280.

Optimized by Optimole