జర్నలిస్ట్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఎవరిదో?

జర్నలిస్ట్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఎవరిదో?

తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రముఖ తెలుగు చానెల్స్ కి చెందిన సీనియర్ మహిళా రిపోర్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి చెందిన సీనియర్ రిపోర్టర్ రెహానా ఈ పోటీలో ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. టీవీ 9 సీనియర్ రిపోర్టర్ హసీనా కూడా తన మార్గంలో, వైఎస్సార్ సీపీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు..ఉన్నతాధికారుల ఆశీస్సులతో తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తోంది. గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు జర్నలిస్టు కోటా కింద అవకాశం కల్పించాలని, ఈ ఇద్దరూ మహిళా జర్నలిస్టులు వైఎస్సార్ సీపీలోని సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్ళినట్లు గుసగుసలు వినపడుతున్నాయి.

 

ఇక ఇప్పటికే ఇద్దరు సీనియర్ మహిళ రిపోర్టర్లు ఎమ్మెల్సీ స్థానాల కోసం వైఎస్సార్ సీపీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకోవడానికి ముమ్మరంగా లాబీయింగ్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీవీ సీనియర్ రిపోర్టర్ శ్రీమతి రెహానా ఇప్పటికే తాను రచించిన పలుపుస్తకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ పుస్తకాలను పలువురు మంత్రులకు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలకు ఆమె స్వయంగా అందిస్తూ లాబీ చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసులో ఏముందో ఇప్పటివరకూ బయటపడలేదు. వైసీపీ పెద్దలు కొంతమంది హాసీనాకు సపోర్ట్ చేస్తుండగా, ఇంకొంతమంది రెహానాకు సపోర్ట్ చేస్తున్నారు.

 

అటు సీఎం సొంత పత్రికకు చెందిన పలువురు జర్నలిస్టులు కూడా ఎమ్మెల్సీ పదవికి తమకు అవకాశం కల్పించాలని లాబీ చేస్తున్నట్లు వినికిడి. అయితే, ఎన్నికల ముందు వీరిలో ఒకరికి ఇస్తే, ఇంకొకరు బాధపడే అవకాశం ఉంది కాబట్టి, ఎవరికి ఇవ్వకపోవడమే మంచిదనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు మరో స్వరం వినపడుతోంది. మరోవైపు జర్నలిస్ట్ కోటా నుంచి మహిళా జర్నలిస్టులకు అవకాశం వస్తుందా? లేక జర్నలిస్టు కోటానే ఉండదా అన్న చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.