కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందా…? మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవి ఊడటం ఖాయామా?… పార్టీ సీనియర్లు రేవంత్ కు సహకరించడం లేదా…? రేవంత్ ఓటమిని ముందే పసిగట్టి కావాలనే మొసలి కన్నీరు కారుస్తూ ఒంటరినంటూ ప్రచారం చేసుకుంటున్నారా…?ఇందులో నిజమెంత?
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీపీసీసీ రేవంత్ కంటతడి పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరగుతున్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ సీనియర్ నేతలకు టీపీసీసీ చీఫ్ కి అసలు పొసగడం లేదన్న ప్రచారానికి ఊతమిచ్చేలా రేవంత్ కన్నీటి ఎపిసోడ్ అంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ ఒంటెత్తు పోకడలపై కొంత మంది సీనియర్ నేతలు బహిరంగగానే విమర్శలు చేసినా విషయం తెలిసిందే.దీనికి తోడు మరి కొందరు నేతలు ఆత్మీయ సమావేశం పేరిట విందు రాజకీయాలు చేస్తున్నారు. ఇక పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి..గతంలో రేవంత్ చేసిన కామెంట్స్ కి బదులుగా సందు దొరికితే చాలు తనదైన సెటైర్స్ తో రెచ్చిపోతున్నాడు. మునుగోడు ఉప ఎన్నికలో కానిస్టేబుల్స్ ప్రచారం చేయరని కేవలం ఎస్పీ మాత్రమే ప్రచారం చేసి గెలిపిస్తారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని.. తాను ప్రచారం చేస్తే పదివేల ఓట్లు మాత్రమే వస్తాయంటు పుండు మీద కారం చల్లిన మాదిరి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. రేవంత్ వ్యూహం ప్రకారమే ముసలి కన్నీరు కారుస్తు పార్టీనేతల సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నాడన్న మరో చర్చ తెరపైకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ మునగడం ఖాయమని భావించే రేవంత్.. అధిష్టానం దృష్టి మరలిచ్చేందుకు సరికొత్త వ్యూహం పన్నారని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే తన నాయకత్వంలో హుజురాబాద్ లో పార్టీ ఘోర ఓటమి పాలైంది. ఇప్పుడు మునుగోడు లో పార్టీ ఓడిపోతే తన పదవి (పిసిసి) పోతుందని భావించే ఒంటరిని అంటూ నక్క వినయాలు ప్రదర్శిస్తున్నాడని రేవంత్ వ్యతిరేక వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.
ఇటు వరుస ఎన్నికల్లో పార్టీకి ఓటములు.. అటూ ముఖ్య నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో పార్టీ నూతన రథ సారథి ఖర్గే.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణా కాంగ్రెస్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి!