Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్ ప్రభావంతో దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ సమీకరణలు ఏర్పడడం మనం చూశాం. ఆ ప్రాంతాలలో ఎన్నికల ముందు కుల విభజన ఉద్యమాలను ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందడం తరచూ జరుగుతోంది. జాట్లు, పాటిదార్లు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం ఆయా రాష్ట్రాల రాజకీయాలపై పెను ప్రభావం చూపింది. ఇటువంటి ఉద్యమాలు ఎన్నికల ముంగిట్లో ఇప్పుడు మళ్లీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ చోటు చేసుకుంటున్నాయి.
తెరపైకి ‘స్వర్ణ ఆయోగ్’ ఉద్యమం..
హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో నూతన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఆధిపత్యం కనిపించగా ఒక్క పంజాబ్‌లో ఆప్ పార్టీ అధికారం చేపట్టింది. ఈ ఫలితాలు రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనున్నాయో అని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. లోగడ గుజరాత్‌లో హార్థిక్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన పటేల్ సామాజిక వర్గం రిజర్వేషన్ల ఉద్యమం అప్పటి అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో స్వర్ణ మోర్చా ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆయోగ్’ ఏర్పాటుకు ఉద్యమం జరుగుతోంది. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దేశంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా హిమాచ్‌ల్‌ప్రదేశ్‌లో దాదాపు 27 శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా ఉన్నా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలతో పాటు సామాజికంగా కూడా రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణుల ఆధిప్యతమే కొనసాగుతోంది. రాష్ట్రంలో 17 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ సీట్లుగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా ముఖ్యమంత్రిగా రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వీరి ఆధిపత్యం కొనసాగుతున్నా ఇప్పటివరకు బడుగు వర్గాల నుండి సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఎటువంటి తిరుగుబాటు, ఉద్యమం ఇక్కడ జరగకపోవడం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో స్వర్ణ మోర్చా ఆధ్వర్యంలో ఉన్నత వర్గాలు చేపట్టిన స్వర్ణ ఆయోగ్ ఏర్పాటు ఉద్యమం జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఈ ఉద్యమ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. 2014 నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటి నుండి గమనిస్తే మొదటిసారి కుల, మత ఘర్షణలు జరిగాయి. కుల విభజన రాజకీయాల ప్రభావం కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపిపై ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్‌లో కాపు, హర్యానాలో జాట్లు, గుజరాత్‌లో పాటిదార్లు) రిజర్వేషన్ల కోసం పలు కులాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. వీటిని లోతుగా పరిశీలిస్తే కులాల ఆధారంగా ఇస్తున్న రిజర్వేషన్లను వ్యతిరేకించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. 2014 తర్వాత బడుగు కులాలకు, మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నత కులాల ఉద్యమ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రూపాలలో నిత్యం ఎక్కడోచోట బలహీన వర్గాలపై ఉన్నత వర్గాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు హిమాచల్ ప్రదేశ్‌లోని కుల విభజన ఉద్యమంతో పోలిస్తే భిన్నమైనవేమీ కావు.
స్వర్ణ ఆయోగ్ ఉద్యమం బడుగు, మైనార్టీ వర్గాలు పొందుతున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్నదే. డిసెంబర్ 2021లో రాష్ట్ర శీతాకాల విధాన సభ సమావేశాల సమయంలో స్వర్ణ మోర్చా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్ ఠాకుర్ స్వర్ణ ఆయోగ్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తర్వాత 2022 ఫిబ్రవరి/మార్చిలో బడ్జెట్ సమావేశాల సమయంలో సిమ్లాలో స్వర్ణ మోర్చా మరోసారి చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఉన్నత వార్గలు వారు పాల్గొన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో పాల్గొనడానికి నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యమ నాయకులు ప్రకటించడం ఆ ఉద్యమానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆలోచనను వ్యతిరేకించే ఉద్యమంలోని ఒక వర్గం నూతన పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో పాల్గొనడంపై అసంతృప్తితోఉంది.
ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం ప్రారంభంలో పార్టీలకతీతంగా పలువురు నేతలు పార్టీ ఏర్పాటును స్వాగతించారు. అదే సమయంలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లలో ఆందోళన రేగింది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రకటన వెలువడిరదో అప్పటి నుండి స్వర్ణ మోర్చా నాయకులపై కేసులు నమోదుతోపాటు వారిని రిమాండ్‌కు పంపడం వంటి ఘటనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజకీయాలు ఇప్పటివరకూ రెండు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మధ్యనే ఉండేవి. నవంబర్ 12, 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, స్వర్ణ మోర్చా కూడా ప్రవేశించడంతో వివిధ పార్టీల మధ్య పోటీ నెలకొంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పలు జరిగే సూచనలున్నాయి. ప్రచారం సంగతి ఎలా ఉన్నా … గెలుపు అవకాశాలు ఏ మాత్రం లేని ఆ రెండు శక్తులు, ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బిజెపిల గెలుపోటములను ప్రభావితం చేస్తాయని ‘పీపుల్స్ పల్స్’ ప్రజాక్షేత్రంలో జరిపిన సర్వే వెల్లడిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లో బడుగు వర్గాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నత కులాలు స్వర్ణ ఆయోగ్ ఏర్పాటు కోసం ఉద్యమించడం ఒక సెంటిమెంట్‌ను రగల్చడమే కాకుండా కుల, సామాజికంగా ఉన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రవర్ణాల తరగతి ముందుకొస్తుంది. ఈ ఉద్యమం బడుగు వర్గాలు ఇకపై చేపట్టే కుల ఉద్యమాలకు, డిమాండ్లకు వ్యతిరేకంగా కూడా ఉంటుంది. ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చిన ఈ ఉద్యమం మరింత కుల విభజనకు నాంది అవుతుంది. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ఉద్యమాలను పరిశీలిస్తే వీటి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ప్రస్పుటమవుతోంది. ఏ రకంగా చూసినా రిజర్వేషనన అంశమే కీలకమౌతోంది. గతంలో గుజరాత్ ఎన్నికల్లో పటేల్ ఉద్యమం లేవనెత్తిన హార్థిక్ పటేల్ ముఖ్యంగా యువతను భారీ ఎత్తున ఆకర్షించి బిజెపికి ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. తర్వాత అతను తన స్వప్రయోజనాల కోసం పార్టీలు మారడం చూశాము.
ఇదిలా ఉంటే .. సరిగ్గా ఇప్పుడు అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కుల విభజన రాజకీయాలకు ఊపిరిపోసేలా స్వర్ణ ఆయోగ్ ఉద్యమం రావడం, ఉద్యమం కీలక దశ చేరుకున్న సమయంలో ఉద్యమ నేతలు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటుతోపాటు, ఎన్నికల్లో పోటీకి సిద్దమవడం పాతచరిత్ర పునరావృత్తమవుతుందా అనిపిస్తుంది. గతంలోని మండల కమిషన్ ఉద్యమం ప్రభావం వివిధ రాష్ట్రాలపై ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలలో పడిరది. ఇప్పుడు స్వర్ణ ఆయోగ్ ఉద్యమం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అవుతుందా? లేక ఇతర రాష్ట్రాలపై కూడా పడనుందా అనేది వేచి చూడాల్సిందే. ఉద్యమ నేతలు కూడా రాజకీయ నేతల్లా తమ స్వప్రయోజనాల కోసం సెంటిమెంట్‌ను వాడుకుంటుంటే ఇటువంటి రాజకీయ మంటలు రగులుతూనే ఉంటాయి.
===================
రోహిత్‌కుమార్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.
మెయిల్ ఐడి: peoplespulse.hyd@gmail.com