Telangana:
(అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ…)
అస్తిత్వానికి
నిలువెత్తు అసేతు హిమాచలం సురవరం
ఆయన జయంతిన
నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం
బుద్ధిలేని తనం సోయి అడుగంటిన దినం
బానిసలున్నంతకాలం
మైత్రివనాలు మహానాడుల ఏడ్పులుంటాయి
చెంబు చేతినుండి జారాక
అన్నీ కన్నీళ్లే
అవమానాలు వడిసెల రాళ్ళయి విసురుతుంటాయి
విగ్రహాలు ఠీవిగా వెలుస్తుంటాయి
తల్లికి జైకొట్టని వాళ్లందరూ గులాములే!
అవును !
డిక్షనరీలో లేదంటున్నావు
అసలు నువ్విక్కడ పుడితే కదా!
ఇక్కడే పుట్టిన జొన్న కర్రకు తంగేడు పూలకు
చెలిమెలకు పోరాట చరిత్ర తెలుసు
తుమ్మకాయను శాన్రాయిమీద రాసి నుదుట బొట్టుపెట్టుకో అప్పుడు కన్పిస్తది
భారత చిత్రపటంలో
సముజ్వల సంగ్రామం తెలంగాణం!
కవులే పూజ్యంబంటే
గోలకొండ కవుల సంచిక మాడు పగులగొట్టింది
తౌరకాంధ్రమన్న కరుణశ్రీల కళ్లు తెరిపించింది
హైదరాబాద్ ను ప్రపంచ పటంలో చేర్చింది నేనన్న
రెండుకళ్ల సిద్దాంతిని ఊరు దాటించింది
భాషను మేమే నేర్పించామన్న నోళ్లకు తాళం పడింది
మున్ముందు ఇంకా అవమానిస్తే
అన్నదమ్ములమని మర్సిపోవాల్సిందే!
తెచ్చుకున్నామన్న సంబురం
పదేళ్లే పూలపండుగ
మూడేళ్లనుండి తోరణంలేని గడప
చాపకింద నీరులా వలసవాదాన్ని సుస్థిరపరస్తూ విస్తృత మవుతున్నారు
ఇక్కడి కవులతోనే
మాతెలుగు తల్లికి మల్లెపూల దండంటూ పాడిస్తున్నారు
ఇక్కడి వ్యాఖ్యాతలతోనే బిరాబిరా వైభవాన్ని పలికిస్తున్నారు
దిగుమతవుతున్నాయి
సమైక్య నేతల రూపొలు
రవింద్రభారతి ఆంధ్రభారతై ఎక్కిరిస్తున్నది
అదును చూసి పంజా విసురుతున్నారు
పదేళ్లు ఈగలు వాలలే
సమైక్యనక్కలు తోడేళ్లు తోకలూపుతున్నాయి
మతతత్వ శక్తుల అండతో
మీసాలు మెలేస్తున్న విద్వేషాలు
మతి భ్రమించిన ప్రేలాపనలు
తెలుగు తెగులు రోగాలు
ఆధిపత్య దృక్ఫథాలకు చరమగీతమే
స్వీయ అస్తిత్వానికి జమిడీకలై
సబ్బండ దరువులను మ్రోగిస్తాం!
బుద్ది జీవులం బుద్దులం జయశంకరులం
నిప్పుల నెగళ్లు ఆరిపోలే
అమరుల స్పూర్తితో
కవుల కలాలను కదిలిస్తాం గోలకొండలా వెలిగిస్తాం
సాంస్కృతిక చారిత్రక అస్తిత్వాన్ని కాపాడుతాం
కృష్ణా గోదావరులపై పెత్తనాన్నెదిరిద్దాం!
దళారులను పొలిమేర దాటిద్దాం!
_________
వనపట్ల సుబ్బయ్య
(9492765358)
