Karimnagar:
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ శుభవార్త. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్ల జిల్లాలో 4059, సిద్దిపేట జిల్లాలో 1118, జగిత్యాల జిల్లాలో 1135, హన్మకొండ జిల్లాలో 1133 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ పరీక్ష ఫీజు చెల్లించాలంటే రూ.15 లక్షలకుపైగా ఖర్చవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే. వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పని చేసి బతికేటోళ్లు. పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఆ మొత్తాన్ని తన వేతనం నుండి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు.
వాస్తవానికి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు సరస్వతి శిశు మందిరాల్లో చదువుకునే విద్యార్థులుసహా దాదాపు 20 వేల మందికి ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేశారు. అతి త్వరలోనే సర్కారీ స్కూళ్లలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకు సైతం సైకిళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. అట్లాగే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే ‘మోదీ కిట్స్’ పేరుతో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ ను పంపిణీ చేయబోతున్నారు.

