విశీ (వి.సాయివంశీ):
మనకు తెలిసి కొన్నిసార్లు, తెలియక ఇంకొన్నిసార్లు మనలో కొన్ని భ్రమలు పేరుకుపోతాయి. అవే వాస్తవాలు అనిపిస్తాయి. అవి అబద్ధాలని తెలిసినా ఒప్పుకోలేని స్థితికి మనల్ని చేరుస్తాయి. ఆ భ్రమలే నిజాలన్న నమ్మిక మనలో ఏర్పరుస్తాయి. ఏ సామాజిక సర్వేలు చూడక, ఏ సాంఘిక జీవనాన్ని పరిశీలించక ఆ ఊహల్లోనే బతకడం నేర్పిస్తాయి. కానీ నిజం నిప్పు లాంటిది. నివురును చీల్చుకుంటూ బయటికి రాక తప్పదు.
సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ జరుగుతోంది. కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. మరికొందరు సమర్థిస్తున్నారు. వారి అవగాహన మేరకు ఈ విషయాన్ని విశ్లేషిస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి, ‘ఆమె బ్రాహ్మణ మహిళ కాబట్టే ఇంత ట్రోలింగ్ జరుగుతోంది’ అని, ఈ దేశంలో బ్రాహ్మణులు మైనార్టీలుగా మారారని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు రెండడుగులు ముందుకు వేసి, ఎస్సీ ఎస్టీ వర్గాల కారణంగానే బ్రాహ్మణులు నిరుపేదలుగా మిగిలిపోయారనే అర్థం లేని తలతిక్క కామెంట్లు చేస్తున్నారు. ఈ దేశంలో బ్రాహ్మణులు మైనార్టీలుగా మారారన్నది అర్థం లేని మాట.
భారత రాజ్యాంగంలో మైనార్టీలకు నిర్వచనం లేదు. అయితే 30వ అధికరణం మతపరమైన, భాషాపరమైన మైనార్టీల గురించి వివరించింది. National Commission for Minorities Act, 1992 ప్రకారం మనదేశంలో ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు మాత్రమే మైనార్టీలు. ఆవేశం కొద్దీ బ్రాహ్మణులను మైనార్టీలుగా అభివర్ణించినా అది నిజం అయిపోదు. ‘కులపరమైన మైనార్టీలు’ అనే అంశమే రాజ్యాంగంలో లేదు. ఈ అంశం క్లియర్.
సరే! ఎస్సీ, ఎస్టీ వర్గాల కారణంగానే బ్రాహ్మణులు నిరుపేదలుగా మిగిలిపోయారనే అర్థం లేని ఆరోపణ దగ్గరకి వద్దాం! మనదేశంలో 50 శాతానికి పైగా ఎస్టీలు ఇంకా పేదలుగానే ఉన్నారు. మొత్తం ఎస్సీల్లో 33.3 శాతం మంది ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఓబీసీల్లో 27.2 శాతం మంది ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు. ఇవి నోటి లెక్కలో, కాకి లెక్కలో కాదు. United Nations Development Programme (UNDP), The Oxford Poverty and Human Development Initiative సంయుక్తంగా రూపొందించిన Global Multidimensional Poverty Index(MPI) చెప్పిన వివరాలు. భారతదేశంలోని ఆరుగురు పేదల్లో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని ఈ సూచీ స్పష్టంగా చెప్పింది. మరి బ్రాహ్మణుల పేదరికానికి ఎస్సీ, ఎస్టీలు కారణం అనే అర్థం లేని వాదన ఎలా వచ్చింది? దానికి ఆధారం ఏమిటి? మన ఇంటి ముందు ఎస్టీ కుటుంబం కారు కొనగానే, ఇంటి వెనుక ఎస్సీ కుటుంబం ఇల్లు కట్టుకోగానే దేశం అంతా అలాగే ఉంది అనుకుంటే ఎలా? వాళ్ల మీద అసూయ పడితే ఎలా? వారి కష్టార్జితాన్ని చులకన చేసి ‘అప్పనంగా వచ్చింది’ అన్నట్టు చూడటం ఏల?
సరే! ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎస్సీ, ఎస్టీలకే వస్తాయి అనే ఊహ కూడా చాలా మందిలో ఉంది. ఒకసారి లెక్కలు తీసి చూడండి. దేశంలో అతి పెద్దదైన సివిల్ సర్వీసెస్‌లో 15.92 శాతం ఓబీసీలు, 7.65 శాతం ఎస్సీలు, 3.80 శాతం ఎస్టీలు ఉన్నారు. మిగిలిన వారంతా ఓసీలు. ఇవీ కాకి లెక్కలు కావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. ఇప్పుడు తెలిసిందా నిజం! వాస్తవాలు కళ్లకు కనిపించాయా? ఉన్నతస్థాయి ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంత దూరంలో ఉన్నారో అర్థమైందా? ఇంకా వింత విషయం చెప్పనా? మోదీ పాలిత భాజపా ప్రభుత్వంలో 2019 నాటికి ఉన్న వివిధ శాఖల కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు ఎస్టీలు, ఒక ఎస్సీ మాత్రమే ఉన్నారు. మిగిలినవారంతా ఓసీలే! ఓబీసీలు ఎవరూ లేరు. ఈ నాలుగేళ్లలో పరిస్థితిలో గొప్ప మార్పేమీ రాలేదు. మరి ఎవరి ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఎవరికి అన్యాయం జరుగుతోందని మీ బాధ?
2016 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల శాతం 17.49, ఎస్టీల శాతం 8.47, ఓబీసీల శాతం 21.57. మిగలినవారంతా ఓసీలే! ఇదీ మన పరిస్థితి. ఎస్సీ, ఎస్టీలు వారికున్న (15, 7.5 శాతాల) రిజర్వేషన్ సంఖ్యను దాటి ఓపెన్ కేటగిరిలో ఉద్యోగాలు పొందారు. కానీ బీసీల జనాభా ప్రకారం రావాల్సిన ఉద్యోగాలు(27 శాతం) మాత్రం వారికి దక్కలేదు. రావాల్సినవి ఎన్ని, వచ్చినవి ఎన్ని? ఈ స్థితి గురించి ప్రశ్నించే ధైర్యం లేకపోగా, ‘రిజర్వేషన్ క్యాండేట్’ అనే అవమానకరమైన మాట. “రిజర్వేషన్లు తీసేయాలి” అనే అర్థం పర్థం లేని నినాదం. అలా అంటూ, అంటూనే ‘EWS Reservations’ పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్‌కు ఎసరు పెట్టారు.
సరే! ఉద్యోగాలు వదిలేద్దాం! రాజకీయాలు చూద్దాం! 1950లో 489 సీట్లు ఉన్న పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లు 98. ఆ తర్వాత డెబ్బై ఏళ్లు గడిచాక ఇచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? 543కుగాను 131. అంటే 50 ఏళ్ల క్రితం పార్లమెంటులో 20.4 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ 2021 నాటికి 24.13 శాతం అయ్యింది. మొత్తం సీట్లు పెరిగాయి కాబట్టి రిజర్వేషన్ సీట్లు పెరిగాయి. లేకపోతే యథావిధిగా అన్నే ఉండేవి. మరి రాజకీయాలన్నీ ఎస్సీలు, ఎస్టీలే చేస్తున్నారని అనడం ఏమైనా న్యాయమా? దేశంలో బ్రాహ్మణ జనాభా 4.3 శాతం ఉంది. పార్లమెంటులో 9.17 మంది బ్రాహ్మణ ఎంపీలు ఉన్నారు. మరి ఎవరికయ్యా రాజకీయ ప్రాతినిధ్యం లేనిది? మీ జిల్లాలో బ్రాహ్మణ ఎంపీ/ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇక దేశంలో ఎక్కడా బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం లేదనుకుంటే ఎలా? వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీ ఊహల్లో నుంచి బయటకు రండి.
ఇదంతా ఎవరి మీదా ద్వేషంతో రాసింది కాదు. నిజాలు అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో రాసింది. పేదరికం, నిరుద్యోగం లాంటి సామాజిక సమస్యల్ని మనందరం అనుభవిస్తున్నాం. వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించడం మానేసి, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల మీద పడి ఏడిస్తే ఏమిటి లాభం? ఎస్సీ, ఎస్టీలు తేరగా అన్నీ పొందుతున్నారు అని భ్రమపడితే ఎలా? మీరు మీ భ్రమల్లో ఉండగా, అక్కడ కొందరు రాజకీయ నాయకులు దేశాన్ని దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ల నుంచి మన దేశాన్ని, మన భవిష్యత్తును రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.