ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ రాష్ట్ర ముఖ్య నేత , ఓ ఎమ్మెల్యేల రూ.600 కోట్ల విలువ చేసే భూములకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయాలని కలెక్టర్ కు పంపించారు. అందుకు సదరు కలెక్టర్ ఒప్పుకోకపోవడంతో వెంటనే అక్కడి బదిలీ చేయించారు. మరో ఐపీఎస్ అధికారి ఏకంగా స్టేజి మీదే జయహో మంత్రి అంటూ భక్తిని చాటుకోని బిందాసుగా ఉన్నాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ తన సీట్లో కూర్చోక ముందే…అధికార పార్టీ ఎమ్మెల్యే ఫైరవీ చేసి మరో జిల్లాకు పంపించేశాడు. మరో జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శిని డీపీవో బదిలీ చేయడంతో లోకల్ ఎమ్మెల్యే ఆ అధికారికి ఫోన్ చేసి అమ్మానా బూతులు తిట్టిండు. ఇవ్వి కొన్ని ఉదాహణలు మాత్రమే.
రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు మధ్యన ఓ సన్నని విభజన రేఖ ఉండాలి. అప్పుడే, వ్యవస్థ గాడి తప్పకుండా సక్రమంగా ముందుకు వెళ్తుంది. ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు రాజకీయ నాయకులు తమకు దగ్గరి మనుషులకు కీలక పోస్టింగుల కోసం పైరవీలు చేయడం కాదనలేని వాస్తవం. కానీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. అన్ని వ్యవస్థల్లో రాజకీయ జోక్యం మితి మీరిపోతోంది. రాజకీయనాయకుల ఒత్తిళ్లకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు సైతం తలవంచక తప్పని పరిస్థితి నెలకొంది.
పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే..
జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి కనీసం అటెండర్లను కూడా మార్చలేని దుస్థితి. హోంగార్డులను కూడా స్థానచలనం చేయించలేని పరిస్థితుల్లో ఐపీఎస్ లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయడం అవసరమా? అని కొంత మంది సిన్సియర్ అధికారులు మదనపడిపోతున్నారు. మెలికలు తిరిగిన తొవ్వలో మనం కూడా మెలికలు తిరిగే నడవాలి. ముక్కు సూటిగా పోతానంటే ఎలా? ఎత్తు తక్కువ గుమ్మంలో మనం తలవంచుకుని నడవాలి. ఎత్తిన తల దించనంటే ఎవరికి నష్టం? అని ఆలోచిస్తూ సర్దుకుపోతున్నారు.
ప్రదక్షిణలు చేస్తేనే పదవులు
నిజానికి అధికారుల ట్రాక్ రికార్డు తో సంబంధం లేదు. ఉద్యోగంలో నువ్వు సాధించిన మెడల్స్ కి గుర్తింపు లేదు. చేసిన పనిలో రిస్క్ తో సంబంధం లేదు. అండగా అధికారపార్టీ నాయకులు ఉంటే చాలు. ఎక్కడంటే అక్కడ పోస్టింగ్ వచ్చేస్తుంది. నాయకులతో బెడిసి కొడితే, తంతే పోయి పనికి రాని పోస్టులో పడాల్సిందే. అవును బాస్! ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నది. అవునన్నా, కాదన్నా ఐఏఎస్, ఐపీఎస్ నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు నేతల ఇంటి చుట్టు ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీ,లేదంటే మంత్రి, లెటర్ ఉంటేనే పోస్టింగ్ వచ్చే పరిస్థితిని దాపరించింది. ఆత్మాభిమానాన్ని చంపుకొని చాలామంది అధికారులు ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ పోస్టింగ్ కోసం తిరుగుతున్నారు. ఎలాంటి అండదండలు లేని వాళ్ళు సంవత్సరాల తరబడి లూప్ లైన్ లోనే ఉద్యోగాన్ని నెట్టుకొస్తున్నారు. పైరవీకారులు మంచి పోస్టింగ్ నుంచి లూప్ లైన్ కు రావాల్సి వస్తే అక్కడ రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తిని దూరప్రాంతానికి బదిలీ చేయించి అతను అక్కడ పోస్టింగ్ తెచ్చుకుంటాడు. అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లు మంచి పోస్టింగ్ లలో దర్జాగా కూర్చుంటున్నారు.
పని కాదు ఫైరవీ ముఖ్యం..
ఒకప్పుడు అధికారి పనితనాన్ని చూసి ఉన్నతస్థాయి అధికారులు పోస్టింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. మనవాడేనా?(సేమ్ క్యాస్ట్) అయితే ఓకే. మనకు అనుకూలంగా లేడా? తీసి ఆ లూప్ లైన్ లో పడేయండి ఇదే ప్రస్తుతం జరుగుతున్న తంతు. గతంలో మంచి పోస్టింగులకు రాజకీయనాయకుల రికమండేషన్ ఉండేది. కానీ, ఇప్పుడు ఏ పోస్టింగ్ కు అయినా, ఎమ్మెల్యే లేటర్ తప్పనిసరి అయింది. దీంతో వాళ్లకున్న పవర్ ని పక్కకు పెట్టి, నాయకులను జోకడం మొదలుపెట్టారు అధికారులు. ఎమ్మెల్యే లెటర్లతో వచ్చిన వాళ్ళు ప్రజల కోసం పని చేయడం పక్కనపెట్టి వాళ్ళ కోసం ఊడిగం చేస్తున్నారు. ప్రజలు చీకొట్టిన పర్వాలేదు నాకు పోస్టింగ్ ఉంటే సరిపోతుంది అని రీతిలో వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులు సైతం దిగజారి ప్రవర్తిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో లూప్ లైన్ కు వచ్చిన ఎస్ఐలకు శాలువాతో సత్కారాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఉండటం సిగ్గు చేటు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లపై ఎంక్వయిరీ చేద్దామని ఉన్నత స్థాయి అధికారులు వెళ్తే వెంటనే రాజకీయ నాయకులు నుంచి ఫోన్ చేయడం వాళ్ళని ఉండాలనుకుంటున్నావా వెళ్ళాలనుకుంటున్నా అంటూ బెదిరించడం శరమాములుగా మారింది.
ఎస్ బాస్ అంటున్న కలెక్టర్లు, ఎస్పీలు..
ఒకప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ పోస్టింగ్స్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. సిబ్బంది పనితీరు ఆధారంగా వారికి పోస్టింగ్స్ ఇచ్చే వాళ్లు. అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా రన్ అయ్యేది. కానీ, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లకు ఒక అటెండర్ ను కదిలించే పరిస్థితి లేదు, హోంగార్డుని తీసే సత్తాలేదు. ప్రజా ప్రతినిధుల పని ప్రజాప్రతినిధులు, అధికారుల పని అధికారులు చేసుకుంటూ వెళ్తే, ఈ స్థాయిలో దిగజారి అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఒకప్పుడు పోలీస్ శాఖ అంటే చాలా గాంభీర్యంగా ఉండేది. ఇప్పుడు పోలీసు అధికారులు మొత్తం నాయకుల ఇంటి చుట్టూ పోస్టింగుల కోసం తిరుగుతుంటే, వాళ్లను చూసి అక్కడికి వచ్చిన కార్యకర్తలు నవ్వుకునే పరిస్థితి నెలకొంది. డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయినవాళ్లు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్ లో విధి నిర్వహణలో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక ఇదే అదునుగా కొంత మంది నాయకులు ఒక్కోపోస్టింగ్ కు ఒక్కో రేటు కట్టి అధికారుల నుండి అందినకాడికి దోచుకునే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల్లో పని పట్ల నిబద్దత ఎలా ఆశించగలం?
పారదర్శకత కు పాతర..
నేతలకు నచ్చినవాళ్ళు, లెటర్ ఇచ్చి రికమెండ్ చేసి తెచ్చిన వాళ్ళు, నాయకుని కోసం పని చేస్తారు. కానీ, ప్రజల కోసం పని చేయరు. కనీసం ఉన్నత స్థాయి అధికారులు మాట కూడా వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే, రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని అహంకారం వాళ్లలోకి ఎక్కిపోతుంది. ప్రజాసేవ కాకుండా నాయకుల పాదపూజకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులందరినీ కూడా ట్రాన్స్ ఫర్ చేశారు. కానీ, కొత్త పోస్టింగుల విషయంలో ఆయా నాయకులు తమకు నచ్చిన అధికారులకే పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఇక ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడ ఉంటుంది? అధికార పార్టీ ఎమ్మెల్యేల లెటర్ ప్యాడ్ మీద వచ్చిన అధికారులు వాళ్లకు తొత్తులుగా మారుతారు తప్ప, ఎన్నికల నిర్వహణలో ప్రజాప్రక్షాన నిలబడే పరిస్థితులు ఉంటాయా? అందుకే, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే, జంబ్లింగ్ సిస్టంతో అందరిని మళ్లీ ట్రాన్స్ ఫర్ చేస్తే తప్ప, ఎన్నికల్లో పారదర్శకత కష్టం అని చెప్పుకోవచ్చు.
శేఖర్ కంభంపాటి, సీనియర్ జర్నలిస్ట్ నల్లగొండ జిల్లా :- 9885415533