Shravanamasam:
లక్ష్మీ ప్రదమైన మాసం శ్రావణమాసం. స్థితికారుడు మహావిష్ణువు, లక్ష్మీదేవికీ అత్యంత ప్రీతికరమైన మాసం.ఈమాసంలో వ్రతాలు,నోములు ఆచరించడం వలన విశేషమైన పుణ్యంతో పాటు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.చాంద్రమానం ప్రకారం తెలుగుమాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణమాసం. పూర్ణిమనాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉండడంతో శ్రావణమాసంగా పిలవడం ఆనవాయితీ. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈమాసంలో భక్తిశ్రద్ధలతో హరిని పూజిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రవచన.
శ్రావణమాసం మహిళలకు పవిత్ర మాసం. మహిళలు ఆచరించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈమాసంలో ఉండడం వలన వ్రతాలమాసమని.. సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పిలుస్తారని పురాణవచన.
శ్రావణమాసంలో విశేష పర్వదినాలు;
మంగళగౌరీ వ్రతం ;
శ్రావణమాసం నందు ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది మంగళగౌరి వ్రతం. వ్రతంలో భాగంగా నెలలో నాలుగు మంగళవారాలు మంగళగౌరిని(పార్వతిదేవి) పూజించాలి. సాధారణంగా పెళ్లైన నూతన దంపతులు ఈవ్రతాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈవ్రతం ఆచరించడం వలన శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
వరలక్ష్మీ వత్రం;
శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం అనాధిగా వస్తోంది. ఈరోజున వరలక్ష్మీ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. అష్టలక్ష్మీలకు పూజించనట్లుగా భావిస్తుంటారు. ఈవ్రతాన్ని ఆచరించడం వలన అష్టైశ్వరాలు, సుఖసంతోషాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శుక్లచవితి – నాగచవితి;
ఈరోజు ప్రత్యేకత నాగులను పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్టవద్దకు వెళ్లి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు.దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి శుక్ల చవితిని విశేషమైన రోజుగా పరిగణిస్తారు.
హయగ్రీవ జయంతి;
వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవం రూపం ధరించినట్లు పురాణా వచన. హయగ్రీవుడు జన్మించిన రోజు కావడంతో హరికి ప్రత్యేక పూజలు నిర్వహించి శనగలు, ఉలవలతో నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరం.
కృష్ణపక్ష అష్టమి – శ్రీ కృష్ణాష్టమి;
శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీ కృష్ణుడు జన్మించిన ఈరోజును జన్మాష్టమిగా పిలుస్తారు. స్వామివారికి ఉదయం నుంచి సాయత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు,పెరుగు,వెన్నలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం చేపడతారు.