సీమాంధ్ర కథలు అనగానే గుర్తొచ్చే పేరు సింగమనేని నారాయణ. ఎండిన సేళ్లు, నీళ్లివని బోర్లు, వట్టిపోయిన చెరువులు, సీమ రైతుల కన్నీటి కష్టాల్ని కథల రూపంలో తీసుకొచ్చిన ఘనత వారిదే. నవల రచయితిగా, సాహిత్య విమర్శకుడిగా, ప్రసిద్ధుడైన ఆయన అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా వారిగురించి క్లుప్తంగా..
సింగమనేని అనంతపురం జిల్లా మరూరు బండమీదపల్లిలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వృత్తిపరంగా అధ్యాపకుడు, ప్రవృత్తిపరంగా అభ్యుదయ రచయిత, మార్క్సిస్టు చింతనాశీలి. మహాప్రస్థాన గేయాలు, తిలక్ వచనా కవితలు ఆయనికి కంఠోపాటం. వెయ్యి పద్యాలను ఏకధాటిగా చెప్పగలరు. ఆధునిక రచయుతగా, సాహిత్య విమర్శకుడిగా ఎదిగిన సింగమనేని 1970 తరువాత అనంతపురం నుంచి తెలుగులో కథా వికాసానికి, కథానిక సాహిత్య విమర్శకు తనదైన శైలిలో దోహదం చేశాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన కరువు పీడిత అఞ్ఞతపురం జిల్లా వ్యవసాయం, రైతుల కష్టాల గురించి జూదం(1978), ఊబి(1982), విముక్తి(1988) లాంటి కథలు రాశాడు. వృత్తి రీత్యా అధ్యపకుడైన సింగమనేని ఉపాధ్యాయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. విద్యారంగం ఆధారంగా , భారతీయ కార్యనిర్వహణ వ్యవస్థలో అధిపత్యాన్ని, అవినీతిని,బుడుగల(1978), పరీక్ష (1979),విష్(1982) లాంటి కథల్లో వాస్తవిక దృష్టితో చిత్రించారు.
సింగమనేనికి మధురాంతకం రాజారాం అంటే ఎనలేని అభిమానం. రాజారాం సాహిత్య ఔన్నత్యాన్ని విశ్లేషిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ కి ఒక మోనోగ్రాఫ్ రాసారు. దాదాపు 75 కథలు రాసిన ఆయన, ఇతర రచయితల కథా సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ‘కథావరణం’ అనే కథానిక సాహిత్య విమర్శ గ్రంథం రాశారు. ‘వతన్ ‘ అనే ముస్లిం కథల సంకలనం మీద ‘మనకు తెలియని ప్రపంచం’ అనే వ్యాసం రాశారు. ముస్లిం జీవితాల పట్ల గొప్ప సానుభూతితో ఆ కథలను విశ్లేషించారు. తెలుగు భాష పట్ల ఎనలేని ప్రీతి.. సభలలో తెలుగు భాష గొప్పతనాన్ని విసుగు చెందకుండా ప్రసంగించేవారు సింగమనేని.