ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు!

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన పధకంలోని సుమారు 50 కోట్ల మంది లబ్దిదారులు ‘ఆయుష్మాన్ కార్డులను’ ఉచితంగా పొందవచ్చునని కేంద్రం ప్రకటించింది. గతంలో ఈ కార్డు కోసం రూ. 30 వసూలు చేయగా.. ఇప్పుడు వాటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఆయుష్మాన్ కార్డు ద్వారా లబ్దిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ కార్డులను దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్లలో(సీఎస్సీ) లభిస్తాయి. ఇక ఆయుష్మాన్ డూప్లికేట్ కార్డులు పొందేందుకు రూ. 15 చెల్లించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ అధారిటీ(ఎన్‌హెచ్ఏ) ద్వారా లబ్దిదారులకు ఉచితంగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
తద్వారా ఈ పధకం కింద సర్వీస్ డెలివరీ ప్రక్రియను క్రమబద్దీకరించడమే కాకుండా సులభతరం చేయవచ్చునని భావిస్తున్నారు. ఆయుష్మాన్ కార్డులను పీఎం-జీఏవై ఆసుపత్రుల్లో పొందవచ్చునని ప్రభుత్వం తెలిపింది.

ఆయుష్మాన్ భారత్ పధకం అంటే .?

ఆయుష్మాన్ భారత్ పధకాన్ని ప్రధానమంత్రి  ఆరోగ్య యోజనా లేదా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం లేదా మోదీకేర్ అని పిలుస్తారు. ఈ పధకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల కుటుంబాలకు ఏటా రూ. 10 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తోంది. ఇక వారు ఉచితంగా చికిత్స చేయించుకునేందుకు ఆయుష్మాన్ కార్డులు అవసరమని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద క్యాన్సర్‌తో సహా సుమారు 1300కిపైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందవచ్చును. ఈ పధకానికి మీరు అర్హులై ఉండి.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే.. మీ దగ్గర ‘ఆయుష్మాన్ కార్డు’ ఉండాలి. ఆయుష్మాన్ కార్డును ‘ఆయుష్మాన్ భారత్ యోజన గోల్డెన్ కార్డు’ అని కూడా పిలుస్తారు. ఈ కార్డు పొందేందుకు ఆయుష్మాన్ భారత్ పధకం కిందకు వచ్చే ఆసుపత్రులను కూడా ప్రజా సేవా కేంద్రాన్ని గానీ సంప్రదించాల్సి ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లబ్దిదారులు ఈ కార్డును పొందేందుకు ప్రభుత్వం ప్రజా సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ సహాయంతో ఈ కార్డులను ఉచితంగా పొందవచ్చు. ఇదిలా ఉంటే ఆయుష్మాన్ ఇండియాలో కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. ఈ పధకానికి అనుసంధానమైన కుటుంబంలోని మహిళ పెళ్లి చేసుకుంటే.. ఆమె భర్తకు ఉచితంగా చికిత్స కోసం కొరకు ఆయుష్మాన్ కార్డు లేదా డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదని.. ఆమె ఆధార్ కార్డు చూపిస్తే చాలని కేంద్రం తెలిపింది.

కాగా, ఆయుష్మాన్ భారత్ యోజనకు మీరు అర్హులో.? కాదో తెలియాలంటే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్‌ను జారీ చేసింది. 14555 / 1800111565 నెంబర్‌కు డయల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే https://mera.pmjay.gov.in/search/login అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.