‘బ్రాహ్మణ’ శబ్దం ‘ఇబ్రాహీం’ నుంచి వచ్చిందన్న సింగర్‌ లకీ అలీ క్షమాపణ..

Nancharaiah merugumala senior journalist:

బ్రాహ్మలే అసలు సిసలు హిందువులు’ అని ఇప్పటికీ నమ్మే ముస్లిం ఉన్నత వర్గాలు!

మోదీ పాలనలో ‘హైక్లాసు’ ముసల్మానులు సైతం భయపడాల్సిన అవసరమేముంది?

‘బ్రాహ్మణులు మాత్రమే అసలు సిసలు హిందువులు. మిగిలిన అన్ని కులాలోళ్లకూ మతధర్మం అంటే శ్రద్ధలేదు. మనం అభిమానించినా, గొడవపడినా ఆ అర్హత ఉన్నోళ్లు బ్రాహ్మణులు మాత్రమే,’ అనే అభిప్రాయం ఇండియాలోని కులీన, బుద్ధిజీవి, ఇతర ఉన్నత వర్గాల ముస్లింలకు ఉందనిపిస్తుంది. అనేక మంది తెలిసిన ముసల్మానులైన మిత్రులు, పరిచయస్తులతో మాట్లాడితే కలిగే భావన ఇది. అలాగే, శూద్రులు, ఇతర ‘కింది కులాల’వారికి ముస్లింలతో పోల్చితే దైవ భక్తి, పాపభీతి చాలా తక్కువ, నాగరికత చాలా స్వల్పం అనే అభిప్రాయం భారతీయ బ్రాహ్మణ సమాజంలో కూడా ఎప్పటి నుంచో ఉంది.  అది నిజమేనని ప్రఖ్యాత గాయకుడు, అంతకన్నా ప్రసిద్ధుడైన హిందీ నటుడు మెహమూద్‌ కొడుకు లకీ అలీ మాటలు నిరూపించాయి. బ్రామ్మణులు ఉన్నత శ్రేణి లేదా సూపర్‌ ఫైన్‌ క్వాలిటీ హిందువులనే అర్ధంలో మాట్లాడిన లకీ అలీ నిన్న నాలుకు కరుచుకున్నారు. వివరణతో కూడిన క్షమాపణ చెప్పారు. ఇటీవల బ్రాహ్మణుల పుట్టుక ఎంత గొప్పదో క్లుప్తంగా వివరిస్తూ లకీ అలీ చేసిన ట్వీట్‌ ను వారి నుంచి వచ్చిన వ్యతిరేక స్పందనతో తొలగించాల్సివచ్చింది. బ్రాహ్మల దాడికి భయపడి తొలగించిన ట్వీట్‌ లో ఏం చెప్పారంటే–‘‘బ్రాహ్మణ అనే పేరు ‘బ్రహ్మ’ అనే మాట నుంచి వచ్చింది. బ్రహ్మ అనే పదం ‘అబ్రామ్‌’ అనే శబ్దం నుంచి వచ్చింది. అబ్రామ్‌ కూడా అబ్రహామ్‌ లేదా ఇబ్రాహీమ్‌ అనే మాట నుంచి పుట్టింది. కాబట్టి బ్రాహ్మణులు ఇబ్రాహీమ్‌ కు వారసులు. ఇబ్రాహీమ్‌…అలైసలామ్‌ (స్తోత్రం) అన్ని జాతులకూ తండ్రి. మరి అందరూ ఏమాత్రం కార ణాలు లేకుండా ఎందుకు తమలో తాము వాదులాడుకుంటూ కొట్లాడుకుంటున్నారు?’’. ఇలా హిందువులకు వృత్తిపరమైన పూజారులైన బ్రాహ్మణులను పొగుడుతూ ఓ మంచి సందేశం ఇవ్వాలని ప్రయత్నించి (గొప్ప హాస్యనటుని కుమారుడైన) లకీ అలీ బోర్లాపడ్డాడు. సాధారణ బ్రామ్మల నుంచి సద్బ్రాణుల వరకూ ఈ ట్వీట్‌ లోని విషయాలతో నొచ్చుకున్నారు. వారి మనసులు గాయపడ్డాయి. వారి మనోభావాలు కుంచించుకుపోయాయి. అన్ని జాతులకు పిత అని లకీ అలీ చెబుతున్న ఇబ్రాహీమ్‌ గారికి మేం పుట్టడమేంటని హిందూ బ్రాహ్మణులు కలతచెందారు. కొందరైతే బేహోషయి కుప్పకూలిపోయారు. తేరుకున్నాక సోషల్‌ మీడియాలో లకీ అలీకి వారు క్లాసులు పీకారు.

బ్రాహ్మల దెబ్బకు అలీభాయ్‌ క్షమాపణ సబబేనా?

దీంతో ఆదివారం ఫేస్‌ బుక్‌ ద్వారా తన ‘బ్రాహ్మణులు ఇబ్రాహీమ్‌ వారసులు’ ట్వీట్‌లో వర్ణించిన మాటలకు లకీ అలీ క్షమాపణ చెప్పారు. ‘‘డియర్‌ ఎవ్రీవన్, నా కిందటి పోస్టు ఎంతటి వివాదం సృష్టించిందో తెలుసుకున్నాను. అందుకు నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఎవరిలోనూ బాధ, కోపం తెప్పించడం నా ఉద్దేశం కాదు. నిజానికి, ప్రజలందరినీ కలపడమే నా లక్ష్యం. అయితే, నేను అనుకున్నట్టు నా మాటల వల్ల జరగలేదు. ఇక నుంచి నేను పెట్టే పోస్టుల్లో ఏముంది? వాటిలో మాటల వరుస క్రమం ఎలా ఉందో జాగ్రత్తగా గమనిస్తాను. ఎందుకంటే, నా పోస్టు ఇప్పటికే నా హిందూ సోదరసోదరీమణుల్లో అనేక మందిని అల్లకల్లోలం చేసింది. ఇందుకు నేను చాలా ఎక్కువ బాధపడుతున్నా. అందరికీ ప్రేమాభిమానాలతో..’’ అని లకీ అలీ తన ఫేస్‌ బుక్‌ పోస్టులో సంజాయిషీ ఇచ్చుకుంటూ క్షమాపణ చెప్పాడు. 2000 సంవత్సరం జనవరి 14న విడుదలై దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉర్రూతలూగించిన రితిక్‌ రోషన్‌ మొదటి హిందీ సినిమా ‘కహోనా ప్యార్‌ హై’లో మనుషుల్లో ప్రేమ ఎందుకు పుడుతుందనే విషయంపై పాడిన ‘నా తుమ్‌ జానో నా హమ్‌’ అనే సూపర్‌ హిట్‌ పాతో భారత సినీ పాటల ప్రేమికులందరికీ పరిచయమయ్యాడు లకీ అలీ. 64 సంవత్సరాల లకీ అలీ గత కొన్నేళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నాడు. పాటలు పాడడమేగాక గీత రచయిత, నటుడు కూడా అయిన లకీ అలీ కర్ణాటక రాజధాని నగరంలోని తన తండ్రి నుంచి వచ్చిన ఫామ్‌ హౌస్‌ లో తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. తాను పుట్టిపెరిగిన ముంబై నగరమంటే తనకు ఇష్టమేగాని ఒక్క చోటే ఉండాలంటే తనకు నచ్చదని, ఇక్కడ నుంచి కూడా ఇక ముందు వేరే చోటుకు వెళ్లిపోతానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కాపురముండే ఊరు నచ్చకపోతే మరో నగరానికి వలసపోవడం తప్పులేదు. కాని, తన మాటలు బ్రాహ్మణులకు ఆగ్రహావేశాలు తెప్పించాయనే సాకుతో అభిప్రాయాలు మార్చుకోవడం సరికాదేమో మరి. ఏదేమైనా అల్పసంఖ్యాకవర్గమైన బుద్ధిజీవి బ్రాహ్మణుల మాదిరిగానే భారతీయ పై క్లాసు ముస్లింలు కూడా చాలా తెలివైనోళ్లని అనేక సందర్భాల్లో చాలా మందికి అనిపిస్తోంది.

Related Articles

Latest Articles

Optimized by Optimole