ఏ కన్ను ఇష్టమంటే….!

ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పుడో పనికిమాలిన చర్చ జరుగుతోంది. నిన్న అర్జెంటీనాకు ఫీఫా ప్రపంచ కప్ గెలిచి పెట్టిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ గొప్పా? మొన్నెపుడో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడి క్వార్టర్ ఫైనల్లోనే కథ ముగియడంతో వెనుదిరిగిన కెప్టెన్ క్రిష్టియానో రొనాల్డో గొప్పా? అన్నది ఆ చర్చ! ఎంతో తేలికైన, సులువైన, వినచక్కని సమాధానం ఉండగా…. ఈ పండిత చర్చ ఎందుకూ? అన్నది నా వాదన. ఏమిటా సింపుల్ జవాబు? అంటారా! అది, వెరీ సింపుల్. ఏంటంటే…. ‘ఇద్దరూ గొప్పే!’ 

అలా కాదంటారు ఈ చర్చాసుర సన్నాసులు. ఈ తెగని ముచ్చటకు కోట్ల వ్యూస్ అంటే నమ్మండి. ఆ ఇద్దట్లో ఎవరో ఒకరు మాత్రమే ‘మేక-GOAT’ అంటారు వారు. మన దగ్గర మేక (బక్రా) అంటే, ‘పాపం… బలి అయిన/అవుతున్న/అవబోయే వాడు’ అనే అర్థంలో  చూస్తాం. కానీ, వారి మేక కు అర్థం ‘G’reat’ ‘O’f ‘A’ll ‘T’ime’ అంటే, అన్ని సమయాలలో గొప్ప అని భావించాల(ట)!. సరె! వారి వాదనకేముందీ, అన్నేసి మ్యాచ్ లు, ఇన్నేసి గోల్సూ అంటూ గణాంకాలతో ఇద్దరు ఆటగాళ్లకొచ్చిన రికార్డులు, అవార్డులూ, రివార్డులూ, డబ్బులూ లెక్కిస్తూ….. ఏదో తమకు తోచిన తక్కెట్లో ఆ ఇద్దరు ఆటగాళ్లను పెట్టి, తూకం వేయడానికి, హెచ్చు-తగ్గులు తేల్చడానికి యత్నిస్తున్నారు. నేను, అది తప్పూ అంటాను! ఇద్దరూ…ప్రతిభ, నైపుణ్యం, ఫైర్ ఉన్న ఆటగాళ్లే! ఇరువురూ ఎంతగానో శ్రమిస్తూ, ఎన్నో త్యాగాలతో, ఫుట్బాల్ నే త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తూ… దాదాపు రెండు దశాబ్దాలుగా ఆటలో రాణిస్తున్న వాళ్లే! ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయ్! 

 

రొనాల్డో ఓ కఠిన శ్రమ ఫలం! మెస్సీ సహజ నైపుణ్య వరం!!

అందుకే, రొనాల్డో ఎప్పుడూ ఓ చక్కటి రణనీతిని పాటిస్తూ, దాడుల క్రమాన్ని రచిస్తూ-అమలు పరుస్తూ….  ఫుట్బాల్ క్రీడనొక యుద్దంలా ఆవిష్కరిస్తాడు. అది ఆయన బాణీ! 

ఇక మెస్సీ పంథా వేరు. ఎంతటి యుద్దాన్నైనా యుక్తితో నెగ్గజూసే శాంతికాముకుడు. అందుకే, రక్తి కట్టించే పదకదలికలు, సహచరులనూ విజేతలు చేసే మనస్పూర్తి పాసింగ్స్, ఫుట్బాల్ క్రీడనొక కవిత్వం చేసే సృజనశీలి మెస్సీ! ఈ రెండు వీడియో క్లిప్స్ చూస్తే తెలుస్తుంది! దేహాన్ని ఒడుపుగా సంధిస్తూ, వేట కోసం రివ్వని పైకి ఎగిరే ఓ చిరుతలా మైదానంలో రొనాల్డో విన్యాసాలు మన రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయి. మైదానం బయట మెస్సీని చూడండి ఇంకో వీడియో క్లిప్ లో! భూమి గురుత్వాకర్షణ, గరిమనాభి సూత్రాన్ని వాటి మర్మంతో సహా ఎరిగి…. చేసే పని మీద ఏకాగ్రత, ఫోకస్ ని పెనవేసి, లక్ష్యాన్ని సాధించే  అద్వితీయ అతీంద్రియ శక్తి మనల్ని ఇట్టే మైమరిపించదూ? 

   వైవిధ్యభరితమైన ఈ కళాకౌశలాన్ని, నైపుణ్య మార్మికత ను, అందులోని రసానుభూతిని…. కలగలిపి అనుభవించడం చేతగాని భావనాలుప్త అల్పజీవులు….. ఎక్కువ-తక్కువల వివాదాల సృష్టించి, శుష్క చర్చల్లో పగిలిన మాటల, చెదిరిన భావాల పెంకులు ఏరుకోజూస్తున్నారు. ప్చ్! ప్చ్!! జాలిపడటం తప్ప ఏమీ చేయలేం! 

రోనాల్డో, మెస్సీ… ఇద్దరూ ఇద్దరే! మన తరం మేటి ఫుట్బాల్ ఆటగాళ్లు. అన్ని కాలాలకూ సరిపడా కీర్తి గడించిన ఉద్దండులు. అయినా… నాదో ప్రశ్న, ఎవరైనా ఎదురొచ్చి నీలో నీకు ఏ కన్ను ఇష్టం? అంటే, ఏం చెపుతాం..

===============

ఆర్. దిలీప్ రెడ్డి

పీపుల్స్ పల్స్ డైరెక్టర్